సాక్షి, హైదరాబాద్: తహసీల్దార్ల అధికారాలకు కత్తెర పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రెవెన్యూ రికార్డుల మార్పులు, చేర్పుల్లో వారి భాగస్వామ్యాన్ని తగ్గించే దిశగా ఆలోచిస్తోంది. రెవెన్యూ శాఖలో భారీ సంస్కరణలు తీసుకురావాలని యోచిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. కొత్త రెవెన్యూ చట్టంలో తహసీల్దార్ల అధికారాల కుదింపుపై స్పష్టతనిచ్చే అవకాశముంది. సెప్టెంబర్‌లో జరిగే శాసనసభ సమావేశాల్లో ముసాయిదా రెవెన్యూ కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత కొన్నాళ్లుగా నూతన రెవెన్యూ చట్టంలో పొందుపరచాల్సిన అంశాలపై ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ నేతృత్వంలోని నిపుణుల కమిటీ చర్చోపచర్చలు సాగిస్తోంది. అయితే, పురపాలక సంఘాల పదవీకాలం ముగియడం.. కొత్త చట్టంతోనే మున్సి‘పోల్స్’కు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించడంతో రెవెన్యూ చటాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టింది. ఈ చట్టం మనుగడలోకి రావడంతో ఇక కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ముసాయిదా చట్టం తయారీలో తలమునకలైంది.
తేలనున్న వీఆర్‌ఓల భవితవ్యం...
రెవెన్యూ వ్యవస్థను సంస్కరించనున్నట్లు పలు సందర్భాల్లో ప్రకటించిన సీఎం.. ఇటీవల పంద్రాగస్టు ప్రసంగంలోనూ బూజుపట్టిన చట్టాలకు పాతర వేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమలులో ఉన్న 124 రెవెన్యూ చట్టాల్లో కాలం చెల్లినవాటికి మంగళం పాడనున్నట్లు తెలుస్తోంది. అలాగే, కొన్ని చట్టాలను ఒకే గొడుగు కిందకు తేవాలని యోచిస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. భూ యాజమాన్య హక్కు (మ్యుటేషన్) జారీని సరళతరం చేయడమే గాకుండా.. పారదర్శకంగా చేసే విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశముంది. ఈ క్రమంలోనే మ్యుటేషన్ చేసే అధికారాలను తహసీల్దార్లకు కాకుండా ఆర్డీఓ లేదా జాయింట్ కలెక్టర్లకు కట్టబెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. రెవెన్యూ శాఖ భ్రష్టు పట్టడానికి కిందిస్థాయి ఉద్యోగుల అవినీతే కారణమని బలంగా విశ్వసిస్తున్న సీఎం.. వీఆర్‌ఓ, వీఆర్‌ఏ వ్యవస్థ రద్దు లేదా పంచాయతీరాజ్, వ్యవసాయశాఖలో విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
పరిశీలనలో ‘టైటిల్ గ్యారంటీ’చట్టం...
భూమి హక్కులకు సంపూర్ణ భద్రత, పూర్తి భరోసా ఇచ్చే ‘టైటిల్ గ్యారంటీ’చట్టాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈ బిల్లుకు ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో.. మన రాష్ట్రంలో కూడా దీని అమలుకు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తోంది. మూడేళ్ల క్రితమే రాజస్తాన్.. పట్టణ ప్రాంత భూముల కోసం ‘టైటిల్ సర్టిఫికేషన్’చట్టాన్ని తీసుకొచ్చింది. గోవా, మహారాష్ట్ర ప్రభుత్వాలు ముసాయిదాలను రూపొందించుకున్నాయి. భూ హక్కుకు పూర్తి హామీ ఇచ్చే ఈ చట్టం అమలులోకి వస్తే పదుల సంఖ్యలో ఉన్న భూరికార్డుల స్థానంలో భూ యాజమాన్య హక్కులకు అంతిమ సాక్ష్యంగా టైటిల్ రిజిస్టర్ ఉండనుంది. తద్వారా భవిష్యత్‌లో భూ వివాదాలకు ఆస్కారం ఉండదని సర్కార్ భావిస్తోంది. అయితే, ఈ చట్టం మనుగడలోకి తేవాలంటే భూ సమగ్ర సర్వే తప్పనిసరి. ఈ సాధకబాధకాలను అంచనా వేసిన తర్వాతే దీనిపై ముందడుగు వేసే అవకాశముంది. నీతి ఆయోగ్ సిఫార్సులు, పక్క రాష్ట్రం అమలు చేస్తున్న తరుణంలో ఇక్కడ కూడా ఈ చట్టాన్ని తీసుకొస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని నిపుణుల కమిటీ సూక్ష్మంగా పరిశీలిస్తోంది.
తహసీల్దార్ల అధికారాలకు కత్తెర!
Published Sun, Aug 18 2019 1:32 AM | Last Updated on Sun, Aug 18 2019 3:59 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment