దూషణలే సమాధానాలు
- విపక్షం అడగడమే తరువాయి అధికారపక్షం నుంచి తిట్ల దండకం
- ఇదీ బడ్జెట్ సమావేశాల తీరు
- ముగిసిన 15 రోజుల సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన పూర్తిస్థాయి తొలి బడ్జెట్ సమావేశాలు అర్థవంతంగా జరగలేదు. సభలో ఏకైక ప్రతిపక్షం లేవనెత్తిన అనేకాంశాలపై ఎదురుదాడి, దూషణలే సమాధానంగా అధికార తెలుగుదేశం ఒరవడి కొనసాగింది. అధికారపక్షం నుంచి యథేచ్ఛగా సాగిన దూషణలకు నిరసనగా విపక్షం పోడియం వైపు వెళ్లని సందర్భమంటూ లేకుండా సమావేశాలు నడిచాయి.
అధికారపక్ష దూషణలు నిత్యకృత్యం కావడంతో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకదశలో సభాపతిపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం వరకు వెళ్లింది. సభలో తమకు మాట్లాడే అవకాశమిచ్చే విషయంలో తదనంతర కాలంలో తగిన న్యాయం చేస్తారన్న నమ్మకంతో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్టు ఆ పార్టీ సభ చివరిరోజున ప్రకటించింది. ఈ నెల 7న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగంతో మొదలైన సమావేశాలు 15 రోజులపాటు కొనసాగిన అనంతరం నిరవధికంగా వాయిదా పడ్డాయి.
ఈ సమావేశాల్లో ఏ ఒక్క ప్రజాసమస్యపైనా ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతో ఈ సమావేశాలు వృథా ప్రయాసగానే సాగాయి. ఏదేని అంశంపై ప్రతిపక్షం అడగ్గానే అధికారపక్షం నుంచి నలుగురైదుగురు సభ్యులు లేచి విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు చేయడానికే సమయాన్నంతా వినియోగించారు. సభానాయకుడు (చంద్రబాబు) సైతం సహనం కోల్పోయి మీ అంతు చూస్తా అంటూ సభా వేదికగా హెచ్చరించడం, దీనికితోడు మీరంతా 420లు.. ఏంట్రా ఏంట్రోయ్... పాతరేస్తా అంటూ అధికారపక్ష సభ్యులు విపక్ష సభ్యులపై దూషణలకు దిగడం వంటివి సమావేశాల్లో చోటుచేసుకున్నాయి.
కుదించుకుపోయిన బడ్జెట్ సమావేశాలు: సాధారణంగా బడ్జెట్ సమావేశాలు సెలవులతో కలుపుకుని ఎప్పుడూ 40 రోజుల వరకు కొనసాగేవి. ఈసారి వాటిని 15 రోజులకే పరిమితం చేశారు. శాసనసభా వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ)లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ దీనిపై అభ్యంతరం వ్యక్తంచేసింది. మరో 15 రోజుల పాటు కొనసాగించాలంది. ఇందుకు ప్రభుత్వం తిరస్కరించింది. అవసరమైతే సాయంత్రం సమావేశాలు నిర్వహిస్తామన్నా.. అదేం జరగలేదు. ప్రతిపక్షం ఒక్కటే ఉన్నందున మాట్లా డేందుకు వైఎస్సార్‌సీపీకి ఎక్కువ సమయమివ్వాలన్న జగన్ విన్నపాన్ని ప్రభుత్వం అంగీకరించలేదు.
ప్రతిపక్షం లేకుండానే మూడురోజులు: పోలవరానికి చంద్రగ్రహణం పేరిట ‘సాక్షి’ దినపత్రిక ఇచ్చిన కథనం అసెంబ్లీలో కలకలం రేపింది. దీనిపై చంద్రబాబుసహా మంత్రులు సాక్షిపై కారాలు మిరియాలు నూరారు. అయితే సభలో తన మాటల ద్వారా పోలవరం వ్యవహారంలో తెరవెనుక సాగుతున్న తతంగాన్ని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. ఇక పట్టిసీమ పథకం వెనుక అక్రమాలపై సభలో ప్రతిపక్షం నిలదీయగా అధికారపక్షం సమాధానం చెప్పుకోలేకపోయింది.
ఈ సందర్భంగా అసహనానికి లోనైన సీఎం తీవ్రస్థాయిలో విపక్ష సభ్యులపై శివాలెత్తారు. ‘‘పిచ్చిపిచ్చిగా చేస్తే మీ కథేంటో తేలుస్తా... వదిలి పెట్టను మిమ్మల్ని... పిచ్చి ఆటలు ఆడొద్దు... తమాషాలు ఆడుతున్నారు. మర్యాదగా చెబుతున్నాం.. మీకు పిచ్చి పట్టింది. సిగ్గులేదు. మీరు మనుషులు కాదు’’ అంటూ దూషణల పర్వాన్ని అందుకున్నారు. ఆ మరుసటిరోజే టీడీపీ సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు వైఎస్సార్‌సీపీ సభ్యులనుద్దేశించి ‘ఏంట్రా.. ఒరేయ్ ఏంట్రా... పాతేస్తా... నా...కొ..’ అంటూ తీవ్ర పదజాలాన్ని వినియోగించారు.
రైతుల సమస్యలపై శాసనసభలో ప్రతిపక్షనేత జగన్ ప్రసంగిస్తున్న సమయంలో తీవ్ర ఆటంకాలు ఎదురవ్వడం, మైక్ కట్ అవ్వడం యథేచ్ఛగా సాగింది. దీనిపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు మాట్లాడే అవకాశమివ్వాలంటూ పోడియంలోకి వెళ్లి నిరసన తెలిపిన సందర్భంలో జరిగిన ఘటనలతో 8 మంది ఎమ్మెల్యేలను సభనుంచి 3 రోజులపాటు సస్పెండ్ చేశారు. ఈ పరిణామంతో విపక్షం మొత్తం సభను బహిష్కరించి బయటకు వచ్చేసింది. చివరకు ప్రతిపక్షం లేకుండానే సభ 3 రోజులపాటు నడిచింది. శాసనసభ చరిత్రలోప్రతిపక్షం లేకుండా సభ జరిగిన సందర్భం గతంలో ఎప్పుడూ లేదు. ఇష్టానుసారంగా అధికారపక్ష సభ్యు లు మాట్లాడటానికి ఎందుకు ఆస్కారం ఇస్తున్నారంటూ స్పీకర్ పోడియం వద్ద ఆవేశం ప్రదర్శించిన ప్రతిపక్షంపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వ డం జరిగింది. దానిపై సంబంధిత సభ్యులతోపాటు ప్రతిపక్ష నేత కూడా వారి తరఫున క్షమాపణలు చెప్పడంతో ఈ వ్యవహారానికి తెరపడింది.
ప్రజాసమస్యలపై సర్కారు స్పందన లేమి
వైఎస్సార్‌సీపీ 22 అంశాలపై చర్చ కోరుతూ బీఏసీలో ప్రతిపాదించింది. పలు సమస్యలపై చర్చకోసం జాబితాను సమర్పించింది. దేనిపైనా అధికారపార్టీ చర్చకు ముందుకురాలేదు. రాజధాని, భూసమీకరణలో రైతుల అవస్థలపై చర్చకు విపక్షం వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చినా.. 344వ నిబంధన కింద నోటీసిచ్చినా చర్చకు ప్రభుత్వం ముందుకు రాలేదు.
రెండు బడ్జెట్లు: వచ్చే ఆర్థిక సంవత్సరానికి 1.13 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు 12వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మరోవైపు 13న రూ.14,184 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టారు. రైతు రుణ మాఫీ అంశాన్ని కేవలం ప్రస్తావించి వదిలేశారు.
పోలవరం, పట్టిసీమలపై దాటవేత
పోలవరాన్ని పక్కన పెట్టేలా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడంపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీశారు. నాలుగేళ్లలో పోలవరం పూర్తి చేస్తామన్నప్పుడు పట్టిసీమ చేపట్టడంలోని మతలబేంటని ప్రశ్నించారు. అలాగే పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీరిస్తామన్న అంశాన్ని ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పెట్టకుండా ఎందుకు మోసం చేస్తున్నారని నిలదీశారు. ఈ అంశంపై చర్చకు సమయమివ్వాలని కోరినా ఫలితం లేకపోయింది. చివరకు 344వ నిబంధన కింద స్వల్పకాలిక చర్చను చేపట్టినా ప్రతిపక్ష నేత ప్రసంగానికి అధికారపక్షం అడుగడుగునా అడ్డుతగిలింది. ఇదిలా ఉండగా విద్యుత్‌చార్జీల పెంపును నిరసిస్తూ విపక్షం సభలో ప్రభుత్వాన్ని నిలదీసింది. రూ.941 కోట్ల మేరకు ప్రజలపై భారాన్ని వేయడం సరికాదని, తక్షణమే దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. శాసనమండలిలో ఖాళీ అవుతున్న ఐదు స్థానాలకు ఈ సమావేశాల సందర్భంగా ఏకగ్రీవ ఎన్నిక జరిగింది.