పార్టీ మారితేనే అభివృద్ధి చేస్తారా?
ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి
వి.కోట (చిత్తూరు): వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారితేనే వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేస్తారా? అని చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం వి.కోటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటిని రాబట్టలేని స్థితిలో సీఎం చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. సీఎం అసమర్థ పాలనతో కొత్త రాష్ట్రంలో సమస్యలు తీవ్రతరమయ్యాయన్నారు. ప్రభుత్వంపై, స్పీకర్‌పై రానున్న బడ్జెట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామన్నారు. ఇందుకోసం విప్ జారీ చేస్తామన్నారు.
ఒక పార్టీ ముద్రతో గెలిచిన ప్రజాప్రతినిధులు పార్టీ మారే సమయంలో రాజీనామ చేయడం సంప్రదాయమని చెప్పారు. 2012లో తాను టీడీపీని వీడినప్పుడు రాజీనామ చేసి ప్రజల ముందు నిలిచానన్నారు. ప్రజావిశ్వాసం చూరగొనలేని వారు ఎన్ని పార్టీలు మారినా దండగన్నారు. టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఎన్నికలు నిర్వహిస్తే కచ్చితంగా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం తథ్యమని చెప్పారు.