
సాక్షి, అమరావతి : బడ్జెట్ సమావేశాలను అర్థవంతంగా నిర్వహిస్తామని శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు అనుభవఙ్ఞులైన వారితో సమానంగా సభలో అవకాశాలు ఇస్తానని పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ... శాసన సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులకు ఇప్పటికే సభ వ్యవహారాలపై క్లాసులు నిర్వహించామని తెలిపారు. అర్థవంతమైన బిల్లులను సభలో ప్రవేశపెడుతున్నారని... సభ నిర్వహణపై సభాపతికి పూర్తి స్థాయిలో సీఎం అధికారం ఇవ్వడం చరిత్రలో ఎన్నడూ జరగలేదని వ్యాఖ్యానించారు.
అదే విధంగా సభలో ప్రతిపక్ష పార్టీ సలహాలు, సూచనలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పడం ప్రజాస్వామ్యం పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతకు నిదర్శమన్నారు. సభలో అధికార, ప్రతిపక్ష సంఖ్యా బలాన్ని బట్టి మాట్లాడే అవకాశం ఇస్తానని స్పీకర్ తమ్మినేని వెల్లడించారు. గతంలో మాదిరి కాకుండా సభలో సభ్యులు వేసే ప్రశ్నలకు వెంటనే సమాధానాలు వచ్చేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.