రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఉద్యోగులు ఈ ఏడాది ఫిబ్రవరిలో 14 రోజుల పాటు చేసిన సమ్మె కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఉద్యోగులు ఈ ఏడాది ఫిబ్రవరిలో 14 రోజుల పాటు చేసిన సమ్మె కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యోగులు ఈ ఏడాది ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు రెండోసారి సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. ఉద్యోగులు ఆర్జిత సెలవును సమ్మె కాలానికి సర్దుబాటు చేయనున్నారు. ఆర్జిత సెలవు లేని ఉద్యోగులకు భవిష్యత్‌లో సంపాదించనున్న ఆర్జిత సెలవును సర్దుబాటు చేసుకోవడానికి వీలు కల్పించారు. వచ్చే ఏడాది పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు ఆర్జిత సెలవులు లేని పక్షంలో ఇతర సెలవును సర్దుబాటు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బోధనేతర సిబ్బంది సమ్మెకాలం కూడా: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బోధనేతర సిబ్బంది చేసిన సమ్మె కాలాన్ని కూడా ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. బోధనేతర సిబ్బంది 2013 ఆగస్టు 13 నుంచి అక్టోబర్ 17 వరకు.. 66 రోజులు సమ్మె చేశారు. బోధన సిబ్బంది 2013 ఆగస్టు 22 నుంచి అక్టోబర్ 10 వరకు 49 రోజుల పాటు సమ్మెలో ఉన్నారు. బోధనేతర సిబ్బంది 17 రోజులు ఎక్కువ సమ్మెలో ఉన్నారు. ఆ కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.