ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒక పక్క ఉద్యోగుల విభజన జరుగుతుండగా ఇక్కడి నుంచి వెళ్లడం ఇష్టం లేని ఉద్యోగులు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. వారి సర్వీస్ రికార్డుల్లో జన్మస్థలం ఉన్న ప్రాంతంలో వైట్ ఫ్లుయిడ్‌తో దిద్దుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన కారణంగా వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులను సర్వీస్ రికార్డుల ప్రకారం వారి స్వసస్థలాలకు పంపిస్తున్నారు. స్వస్థలాలకు వెళ్లడం ఇష్టం లేని ఎన్నెస్పీలోని సీమాంధ్ర ఉద్యోగులు కొందరు వారి సర్వీస్ రిజిస్టర్‌లో జన్మస్థలం అని ఉన్న ప్రాంతంలో వైట్ ఫ్లూయిడ్‌తో దిద్దారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొంత మంది ఉద్యోగ సంఘాల నాయకులు ఈ విషయాన్ని ఎన్నెస్పీ ఎస్‌ఈ అప్పలనాయుడిని కలిసి వివరించినట్లు తెలిసింది. సీమాంధ్ర జిల్లాలకు చెందిన వర్క్ చార్జ్‌డ్ ఉద్యోగులు ( లష్కర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు) గత అనేక సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. రాష్ర్ట విభజన నేపథ్యంలో ఉద్యోగుల బదలాయింపుల్లో భాగంగా వర్క్ చార్జ్‌డ్ ఉద్యోగులను వారి స్వస్థలాలకు పంపాలనే నిబంధన ఉంది. కానీ కొందరు తమ సర్వీస్ రికార్డులో జన్మస్థలం దగ్గర సీమాంధ్ర జిల్లాల వివరాలు ఉంటే దాన్ని వైట్ ప్లూయిడ్‌తో దిద్ది దానిపై ఖమ్మం జిల్లాలో జన్మించినట్లు నమోదు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ తతంగం మొత్తం కొంత మంది ఈ శాఖ ఉద్యోగుల ఆమోదంతోనే జరిగిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సుమారు 15 మంది వరకు ఇలా దిద్దినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు ఎస్‌ఈని కలిసి ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఎస్‌ఈ ఆరోపణలు వచ్చిన వర్క్ చార్జ్‌డ్ ఉద్యోగుల సర్వీస్ రికార్డులను తెప్పించుకుని చూసి కొంత మందిని పిలిచి చీవాట్లు పెట్టినట్లు తెలిసింది. ఈ విషయంపై ఎస్‌ఈ అప్పలనాయుడిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఇద్దరు, ముగ్గురికి సంబంధించిన విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయం అసోసియేషన్ నాయకులు చెప్పారని, వారికి సంబంధించిన అన్ని రకాలు రికార్డులు తీసుకుని రావాలని చెప్పానన్నారు.
ఆ రికార్డులను పరిశీలించి అసలు ఎలా ఉంటే అలాగే పంపుతామని అన్నారు. ఇలా అనేక విభాగాల్లో ఉద్యోగుల బదలాయింపుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిల్లో కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయని, చాలా వరకు వెలుగులోకి రావడం లేదనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి వాటిపై సమగ్రమైన పరిశీలన చేస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంటుంది.
సర్వీస్ రికార్డులను దిద్దారు...
Published Sun, Jun 1 2014 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM
Advertisement
Advertisement