Service records
-
అసమర్థ ఉద్యోగులను పంపేయండి
న్యూఢిల్లీ: ముప్పయ్యేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులందరి సర్వీసు రికార్డులను మదింపు చేయాలని, అసమర్థ, అవినీతి అధికారులకు ముందస్తు రిటైర్మెంటు ఇచ్చి ఇంటికి పంపేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కేంద్ర సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 1972 కింద 56 (జె), 56 (ఐ), 48 (1)(బి) నిబంధనల ప్రకారం... ఉద్యోగి పనితీరును పరిశీలించి ప్రజాప్రయోజనాల దృష్ట్యా అతనికి రిటైర్మెంట్ ఇచ్చి పంపే సంపూర్ణ హక్కు సంబంధిత పై అధికారికి ఉంటుందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొంది. ముందస్తు రిటైర్మెంట్ ‘శిక్ష’కాదని వివరించింది. ఉద్యోగి 50 లేదా 55 ఏళ్లకు చేరుకున్నాక, 30 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నాక... ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఎప్పుడైనా సదరు ఉద్యోగిని ఇంటికి పంపించవచ్చని పేర్కొంది. ఉద్యోగుల సామర్థ్యాన్ని అంచనా వేసి వారిని సర్వీసులో కొనసాగించడంపై ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ అవుతుంటాయని, ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల విషయంలో మరింత స్పష్టత ఇవ్వడానికి, అమలులో ఏకరూపత తేవడానికి తాజా ఆదేశాలు జారీచేశామని సిబ్బంది వ్యవహారాల శాఖ తెలిపింది. రిటైర్ చేయదలచుకున్న ఉద్యోగికి మూడు నెలల నోటీసు ఇవ్వాలని, అలాకాని పక్షంలో మూడునెలల వేతనం ఇచ్చి పంపాలని తెలిపింది. 50 లేదా 55 ఏళ్లకు చేరుకుంటున్న, 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకోబోతున్న ఉద్యోగులందరి వివరాలతో కూడిన రిజిస్టర్‌ను ప్రతిశాఖలో నిర్వహించాలని, ఏడాదికి నాలుగుసార్లు ఈ జాబితాను మదింపు చేయాలని ఆదేశించింది. డిజిటల్ లాకర్లోకి పెన్షన్ ఆర్డర్ రిటైరయ్యే ఉద్యోగులకు పెన్షన్‌కు సంబంధించిన పత్రాల కోసం నిరీక్షించే బాధ తప్పనుంది. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (పీపీవో)ను ఎలక్ట్రానిక్ రూపంలో ఇకపై నేరుగా ఉద్యోగుల డిజిటల్ లాకర్‌కు పంపనున్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్ ఆదివారం వెల్లడించారు. పెన్షన్ ప్రక్రియలో ఇక ఆలస్యానికి తావుండదని, అలాగే పెన్షన్ ఆర్డర్ పత్రాలను పోగొట్టుకునే ప్రమాదం ఉండదని మంత్రి తెలిపారు. పౌరులు తమకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలన్నింటినీ ఎలక్ట్రానిక్ రూపంలో దాచుకోవడానికి డిజిటల్ లాకర్ ఉపకరిస్తుంది. -
‘అరుణ’ సర్వీసు రికార్డులు ఎక్కడ
- వెతుకులాట ప్రారంభించిన కేఈఎం ఆస్పత్రి అధికారులు - ఇప్పటి వరకు ఆమె సర్వీసుపై లేని స్పష్టత - వారం రోజుల్లో తెలుసుకుంటాం: ఆస్పత్రి డీన్ అవినాశ్ సాక్షి, ముంబై: అత్యాచారానికి గురై 42 ఏళ్లుగా కోమాలో ఉండి ఇటీవల మరణించిన అరుణా శాన్‌బాగ్ సర్వీసు రికార్డుల కోసం కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆమెపై అత్యాచారం జరిగి 42 ఏళ్లవుతున్నా అరుణ సర్వీసుపై ఎవరికీ సరిగ్గా తెలియదని ఆస్పత్రి అధికారులు పేర్కొంటున్నారు. ఇంకో వారం రోజుల్లోగా ఈ సమాచారం తెలుసుకుంటామని ఆస్పత్రి డీన్ డాక్టర్ అవినాశ్ గుప్తా తెలిపారు. అరుణపై అత్యాచారం జరిగి కోమాలోకి వెళ్లిన తర్వాత ఉద్యోగం నుంచి ఆమెను తొలగించారా లేదా ఆమె రిటైర్మెంట్ వరకు ఆమెను ఉద్యోగిగానే కొనసాగించారా అన్న దానిపై అధికారులు దృష్టి సారించారు. 2006 వరకు అరుణ ఆస్పత్రి పేరోల్‌లో ఉందని భావిస్తున్నారు. ఒకవేళ ఆమె ఉద్యోగంలోనే కొనసాగితే సర్వీసు రికార్డుతో పాటు ఆమె జీతభత్యాలు, పీఎఫ్ తదితరాలను కూడా కనుక్కోవాలని చూస్తున్నారు. చాలా కాలం కిందటి విషయం కాబట్టి ఈ అంశాలు కనుక్కోవడం కొంచెం కష్టమైన పనే. అరుణపై అఘాయిత్యం జరిగినపుడు చాలా మంది ఉద్యోగులు పనిచేశారని, దీంతో ఆమె వివరాలు కనుక్కోవడం కష్టమని అధికారులు చెబుతున్నారు. కాబట్టి కెఈఎమ్, బీఎంసీ సమన్వయంతో ఆమె వివరాలు తెలుసుకోవడం సులువేనని ఆస్పత్రి వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అరుణ కేసులో నిందితుడిపై మళ్లీ కేసు! ఇదిలా ఉండగా అరుణ షాన్‌బాగ్‌పై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు సోహన్‌లాల్ వాల్మీకిపై హత్య కేసు నమోదు చేయాలని ఆస్పత్రి వర్గాలు యోచిస్తున్నాయి. సోహన్లాల్కు కేవలం ఏడేళ్లు జైలు శిక్షపడిన సంగ తి తెలిసిందే. శిక్షానంతరం ప్రస్తుతం ఢిల్లీలో సోహన్‌లాల్ నివాసముంటున్నట్టు సమాచారం. అయితే అరుణా షాన్‌బాగ్ మరణించడంతో మళ్లీ సోహన్లాల్పై హత్య కేసు నమోదు చేయవచ్చా అనే కోణాల్లో ఆలోచిస్తున్నారు. ఘటన జరిగిన 42 ఏళ్ల తర్వాత సోహన్లాల్పై హత్య కేసు నమోదు చేయవచ్చా అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కేసు నమోదు చేయడం, కోర్టులో విచారణ జరపడం సాధ్యం కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సంఘటన చాలా అరుదైంది కాబట్టి కేసు నమోదు చేయవచ్చా, చేస్తే కోర్టులో నిలుస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
సర్వీస్ రికార్డులతో పాటే పరిశీలన
-
సర్వీస్ రికార్డులను దిద్దారు...
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒక పక్క ఉద్యోగుల విభజన జరుగుతుండగా ఇక్కడి నుంచి వెళ్లడం ఇష్టం లేని ఉద్యోగులు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. వారి సర్వీస్ రికార్డుల్లో జన్మస్థలం ఉన్న ప్రాంతంలో వైట్ ఫ్లుయిడ్తో దిద్దుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన కారణంగా వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులను సర్వీస్ రికార్డుల ప్రకారం వారి స్వసస్థలాలకు పంపిస్తున్నారు. స్వస్థలాలకు వెళ్లడం ఇష్టం లేని ఎన్నెస్పీలోని సీమాంధ్ర ఉద్యోగులు కొందరు వారి సర్వీస్ రిజిస్టర్లో జన్మస్థలం అని ఉన్న ప్రాంతంలో వైట్ ఫ్లూయిడ్‌తో దిద్దారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత మంది ఉద్యోగ సంఘాల నాయకులు ఈ విషయాన్ని ఎన్నెస్పీ ఎస్ఈ అప్పలనాయుడిని కలిసి వివరించినట్లు తెలిసింది. సీమాంధ్ర జిల్లాలకు చెందిన వర్క్ చార్జ్డ్ ఉద్యోగులు ( లష్కర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు) గత అనేక సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. రాష్ర్ట విభజన నేపథ్యంలో ఉద్యోగుల బదలాయింపుల్లో భాగంగా వర్క్ చార్జ్డ్ ఉద్యోగులను వారి స్వస్థలాలకు పంపాలనే నిబంధన ఉంది. కానీ కొందరు తమ సర్వీస్ రికార్డులో జన్మస్థలం దగ్గర సీమాంధ్ర జిల్లాల వివరాలు ఉంటే దాన్ని వైట్ ప్లూయిడ్‌తో దిద్ది దానిపై ఖమ్మం జిల్లాలో జన్మించినట్లు నమోదు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తతంగం మొత్తం కొంత మంది ఈ శాఖ ఉద్యోగుల ఆమోదంతోనే జరిగిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సుమారు 15 మంది వరకు ఇలా దిద్దినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు ఎస్ఈని కలిసి ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఎస్ఈ ఆరోపణలు వచ్చిన వర్క్ చార్జ్డ్ ఉద్యోగుల సర్వీస్ రికార్డులను తెప్పించుకుని చూసి కొంత మందిని పిలిచి చీవాట్లు పెట్టినట్లు తెలిసింది. ఈ విషయంపై ఎస్ఈ అప్పలనాయుడిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఇద్దరు, ముగ్గురికి సంబంధించిన విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయం అసోసియేషన్ నాయకులు చెప్పారని, వారికి సంబంధించిన అన్ని రకాలు రికార్డులు తీసుకుని రావాలని చెప్పానన్నారు. ఆ రికార్డులను పరిశీలించి అసలు ఎలా ఉంటే అలాగే పంపుతామని అన్నారు. ఇలా అనేక విభాగాల్లో ఉద్యోగుల బదలాయింపుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిల్లో కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయని, చాలా వరకు వెలుగులోకి రావడం లేదనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి వాటిపై సమగ్రమైన పరిశీలన చేస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంటుంది.