
‘అరుణ’ సర్వీసు రికార్డులు ఎక్కడ
అత్యాచారానికి గురై 42 ఏళ్లుగా కోమాలో ఉండి ఇటీవల మరణించిన అరుణా శాన్‌బాగ్ సర్వీసు రికార్డుల కోసం కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రి అధికారులు ప్రయత్నిస్తున్నారు...
- వెతుకులాట ప్రారంభించిన కేఈఎం ఆస్పత్రి అధికారులు
- ఇప్పటి వరకు ఆమె సర్వీసుపై లేని స్పష్టత
- వారం రోజుల్లో తెలుసుకుంటాం: ఆస్పత్రి డీన్ అవినాశ్
సాక్షి, ముంబై: అత్యాచారానికి గురై 42 ఏళ్లుగా కోమాలో ఉండి ఇటీవల మరణించిన అరుణా శాన్‌బాగ్ సర్వీసు రికార్డుల కోసం కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆమెపై అత్యాచారం జరిగి 42 ఏళ్లవుతున్నా అరుణ సర్వీసుపై ఎవరికీ సరిగ్గా తెలియదని ఆస్పత్రి అధికారులు పేర్కొంటున్నారు. ఇంకో వారం రోజుల్లోగా ఈ సమాచారం తెలుసుకుంటామని ఆస్పత్రి డీన్ డాక్టర్ అవినాశ్ గుప్తా తెలిపారు. అరుణపై అత్యాచారం జరిగి కోమాలోకి వెళ్లిన తర్వాత ఉద్యోగం నుంచి ఆమెను తొలగించారా లేదా ఆమె రిటైర్‌మెంట్ వరకు ఆమెను ఉద్యోగిగానే కొనసాగించారా అన్న దానిపై అధికారులు దృష్టి సారించారు. 2006 వరకు అరుణ ఆస్పత్రి పేరోల్‌లో ఉందని భావిస్తున్నారు. ఒకవేళ ఆమె ఉద్యోగంలోనే కొనసాగితే సర్వీసు రికార్డుతో పాటు ఆమె జీతభత్యాలు, పీఎఫ్ తదితరాలను కూడా కనుక్కోవాలని చూస్తున్నారు. చాలా కాలం కిందటి విషయం కాబట్టి ఈ అంశాలు కనుక్కోవడం కొంచెం కష్టమైన పనే. అరుణపై అఘాయిత్యం జరిగినపుడు చాలా మంది ఉద్యోగులు పనిచేశారని, దీంతో ఆమె వివరాలు కనుక్కోవడం కష్టమని అధికారులు చెబుతున్నారు. కాబట్టి కెఈఎమ్, బీఎంసీ సమన్వయంతో ఆమె వివరాలు తెలుసుకోవడం సులువేనని ఆస్పత్రి వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
అరుణ కేసులో నిందితుడిపై మళ్లీ కేసు!
ఇదిలా ఉండగా అరుణ షాన్‌బాగ్‌పై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు సోహన్‌లాల్ వాల్మీకిపై హత్య కేసు నమోదు చేయాలని ఆస్పత్రి వర్గాలు యోచిస్తున్నాయి. సోహన్‌లాల్‌కు కేవలం ఏడేళ్లు జైలు శిక్షపడిన సంగ తి తెలిసిందే. శిక్షానంతరం ప్రస్తుతం ఢిల్లీలో సోహన్‌లాల్ నివాసముంటున్నట్టు సమాచారం. అయితే అరుణా షాన్‌బాగ్ మరణించడంతో మళ్లీ సోహన్‌లాల్‌పై హత్య కేసు నమోదు చేయవచ్చా అనే కోణాల్లో ఆలోచిస్తున్నారు. ఘటన జరిగిన 42 ఏళ్ల తర్వాత సోహన్‌లాల్‌పై హత్య కేసు నమోదు చేయవచ్చా అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కేసు నమోదు చేయడం, కోర్టులో విచారణ జరపడం సాధ్యం కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సంఘటన చాలా అరుదైంది కాబట్టి కేసు నమోదు చేయవచ్చా, చేస్తే కోర్టులో నిలుస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.