శ్రావణి (ఫైల్), కడసారి చూసేందుకు వచ్చిన బంధువులు
రోడ్డు ప్రమాదంలో మృతులు కందుకూరు వాసులు
పెళ్లింట అంతులేని విషాదం
పెళ్లి కూతురి తల్లి, అన్న, బంధువు మృతి
మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
శ్రీపొట్టి శ్రీరాములు: రోడ్డు ప్రమాదం పెళ్లింట అంతులేని విషాదాన్ని నింపింది. వివరాలు.. కందుకూరు పట్టణంలోని విప్ప గుంటలో నివాసముంటున్న రాయని అరుణ (50), రమణయ్య భార్యాభర్తలు. రమణయ్య సుమారు 20 ఏళ్ల క్రితం భార్యతో విభేదించి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆమె కోవూరు రోడ్డులో టిఫిన్ దుకాణాన్ని నిర్వహించుకుంటూ తన ఇద్దరి పిల్లలను పెంచి పెద్ద చేశారు.
ఈ క్రమంలో కుమార్తె స్రవంతికి తెలంగాణలోని ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన అశేష్ అనే యువకుడితో వివాహం నిశ్చయమైంది. పాల్వంచలోని వరుడి ఇంట్లో బుధవారం రాత్రి ఘనంగా పెళ్లి జరిగింది. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో అరుణతో పాటు కుమారుడు వేణుగోపాల్, మేనల్లుడు వినోద్, అతని భార్య తల్లపనేని దివ్య (30), వారి కుమారుడు మణి, మరో బంధువు గుళ్లాపల్లి శ్రావణి (22) కలిసి కారులో కందుకూరు బయల్దేరారు. వాహనాన్ని వేణుగోపాల్ నడిపారు.
ఈ క్రమంలో గురువారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో సూరారెడ్డిపాళెం వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. ప్రమాదంలో అరుణ, దివ్య, శ్రావణి అక్కడికక్కడే మృతి చెందగా.. వేణుగోపాల్, వినోద్, మణి తీవ్రంగా గాయపడ్డారు. ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వీరు చికిత్స పొందుతున్నారు.
అంతలోనే..
అప్పటి వరకు పెళ్లిలో ఆనందంగా గడిపిన వారు అంతలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. తల్లి, బంధువులు రోడ్డు ప్రమాదంలో మరణించారనే వార్త తెలిసి కొత్త పెళ్లి కూతురు స్రవంతి కన్నీరుమున్నీరయ్యారు. దివ్య భర్త వినోద్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త, తన ఐదేళ్ల కుమారుడు మణితో కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు. మేనత్త కుమార్తె వివాహం కావడంతో వినోద్ కుటుంబంతో కలిసి రెండు రోజుల క్రితమే కందుకూరొచ్చారు. అయితే ఊహించని ప్రమాదంలో దివ్య మృతి చెందారు.
ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా..
పెళ్లి కోసమే హైదరాబాద్ నుంచి వచ్చిన శ్రావణి మృతి చెందడం తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, ఆదిలక్ష్మికి మింగుడు పడని ఘటనగా మారింది. శ్రావణి కుటుంబం చాలా కాలంగా హైదరాబాద్‌లో ఉంటోంది. డిగ్రీ పూర్తి చేసిన ఆమె ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. స్రవంతి పెళ్లి కోసమని శ్రావణి కందుకూరు వచ్చారు. ఇక స్రవంతి సొంత అన్న వేణుగోపాల్ కొద్దిరోజులుగా పెళ్లి పనులతో తీరిక లేకుండా గడుపుతున్నారు.
విశ్రాంతి తీసుకోకుండా అర్ధరాత్రి కారు డ్రైవింగ్ చేస్తూ రావడం.. నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని బంధువులు చెబుతున్నారు. అటు తల్లిని కోల్పోయి, ఇటు అన్న హాస్పిటల్ పాలవడంతో స్రవంతి రోదన వర్ణానాతీతంగా ఉంది. మృతదేహాలను గుర్రవారంపాళెం సమీపంలోని శ్మశానంలో ఖననం చేశారు. అక్కడికి పెద్ద ఎత్తున బంధువులు చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment