పీఆర్సీ కోసం... కేటీపీఎస్ ఉద్యోగుల సమ్మె | ktps employees strike for prc | Sakshi
Sakshi News home page

పీఆర్సీ కోసం... కేటీపీఎస్ ఉద్యోగుల సమ్మె

Published Mon, May 26 2014 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM

ktps employees strike for prc

 పాల్వంచ, న్యూస్‌లైన్ :  విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటనలో జాప్యాన్ని నిరసిస్తూ కేటీపీఎస్ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. గత 21నే పీఆర్సీకి సంబంధించిన జీవో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఆలస్యం
అవుతోంది. అయితే గతంలోనే విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధం కాగా.. రాష్ట్ర విభజనతో నిమిత్తం లేకుండా మే 21న జీవో విడుదల చేస్తామని ఏపీ జెన్‌కో ఎండీ హామీ ఇవ్వడంతో వారి నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.

ఇప్పుడు ఆ హామీ నెరవేరేలా లేకపోవడంతో సమ్మెబాట పట్టారు. పలు సంఘాల నాయకులు ఏకమై కేటీపీఎస్ పరిధిలోని ఓఅండ్‌ఎం 5, 6 దశల కర్మాగారాల ఎదుట ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల నుంచే ఆందోళనకు దిగారు.మొదటి షిఫ్ట్ కార్మికులు విధులకు  వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో మధ్యాహ్నం చీఫ్ ఇంజనీర్ సిద్దయ్య ధర్నా వద్దకు వచ్చి సమ్మెతో విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడుతుందని,  తక్షణం విధుల్లోకి రావాలని, మిగితా కార్మికులను లోనికి అనుమతించాలని నాయకులను కోరారు. అయితే వారు దానికి అంగీకరించకుండా పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, ఈపీఎఫ్‌ను జీపీఎఫ్‌గా మార్చాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఎస్పీఎఫ్ కమాండెంట్‌జమీల్‌పాషా ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని గేట్లు తెరవడంతో పాటు అక్కడ ఆందోళన చేయవద్దని, పక్కకు వెళ్లాలని చెప్పడంతో ఉద్యోగులకు - పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.  సీఈ గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సిద్దయ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 ఉద్యోగ సంఘాల మధ్య ఘర్షణ...
 సమ్మె విరమించి విధులకు రావాలని ఎస్‌ఈలు ఆనందం, బిచ్చన్న కోరడంతో ఆందోళనకు దూరంగా ఉన్న తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు టి.ప్రవీణ్ కుమార్, వెంకటేషం, కట్టా మల్లికార్జున్ త దితరులు విధులకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో వారిని జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. ఈ సమయంలో వారి మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

 రాత్రి షిఫ్ట్ సిబ్బందితోనే యూనిట్ల నిర్వహణ
  శనివారం రాత్రి విధులకు వెళ్లిన ఉద్యోగులు, కార్మికులు ఉదయం డ్యూటీ దిగాల్సి ఉండగా అధికారులు ఆదివారం కూడా వారితోనే పనులు చేయించారు. సిబ్బందికి అవసరమైన టిఫిన్, భోజనం, ఇతర సౌకర్యాలను అక్కడే కల్పించారు.  కొన్ని మార్గాల ద్వారా కొంత మేరకు కార్మికులను లోనికి తీసుకెళ్లి యూనిట్లు పడిపోకుండా చర్య తీసుకోగలిగారు. సీఈలు, ఎస్‌ఈలు కర్మాగారాల్లోనే ఉండి విద్యుదుత్పత్తిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. సమ్మెకు 1104 యూనియన్ నాయకులు కె.కోటేశ్వరరావు, సునీల్ రెడ్డి, 327 నాయకులు పి.వి.కోటేశ్వరరావు, 1535 నాయకులు లీవెన్, అంబాల శ్రీను, హెచ్ 67 నాయకులు ఎం.రమేష్, తెలంగాణ విద్యుత్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి భాస్కర్, ఏఈస్ అసోసియేషన్ నాయకులు అన్వర్‌బాషా తదితరులు నాయకత్వం వహించారు.

 విద్యుదుత్పత్తికి  భారీగా గండి..
 పాల్వంచ  :  రాష్ట్రానికి వెలుగులు పంచే కేటీపీఎస్ కాంప్లెక్స్‌లో ఉద్యోగుల మెరుపు సమ్మె కారణంగా భారీగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. కేటీపీఎస్ ఓఅండ్‌ఎం, 5, 6 దశల్లోని మొత్తం 11 యూనిట్లలో 1,720 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుండగా ఆదివారం రాత్రికి సమ్మె కారణంగా 515 మెగావాట్లకు పడిపోయింది.  ఇది ఇలానే కొనసాగితే మరో 24 గంటల్లో పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి నిలిచి పోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కర్మాగారంలో పనిచేసే సిబ్బంది లేక విద్యుదుత్పత్తి క్రమేణా పడిపోతోంది. 6వ దశలోని 500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 11వ యూనిట్ తొలుత ట్రిప్ కావడంతో విద్యుదుత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.

5వ దశలో 9వ యూనిట్‌లో 250 మెగావాట్లకు గాను 95 మెగావాట్లు, 10వ యూనిట్‌లో 250 మెగావా ట్లకు గాను 120 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి వస్తోంది. ఓఅండ్‌ఎం పరిధిలో మొత్తం 720 మెగావాట్ల సామర్థ్యం ఉండగా అందులో గత శనివారం 8వ యూనిట్‌లోని 120 మెగావాట్లను వార్షిక మరమ్మతుల కోసం షట్‌డౌన్ చేశారు. దీంతో  ప్రస్తుతం 600 మెగావాట్లు ఉత్పత్తి అవుతుండగా సమ్మె కారణంగా ఇక్కడ బొగ్గు లెవల్ పడిపోవడంతో 375 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే అవుతున్నట్లు అధికారులు తెలి పారు. అయితే సమ్మె ఇలానే కొనసాగితే పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement