ktps employees
-
ఆధునీకరణ ఆందోళన
పాల్వంచ: కేటీపీఎస్ 5వ దశ కర్మాగారంలో ఆధునీకరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో కరోనా వైరస్ భయం పట్టుకుంది. బీహెచ్ఈఎల్ కంపెనీ ఆధ్వర్యంలో రూ.100 కోట్లతో కర్మాగారంలోని 9,10 యూనిట్లను ఆధునీకరించనున్నారు. ఇందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లు, టెక్నీషియన్లు సుమారు 300 మంది రానున్నారు. వారంతా విమాన ప్రయాణాలు, రైళ్లు, ఇతర వాహనాల్లో ఇక్కడికి చేరుకోనున్నారు. 50 రోజులపాటు పనులు జరుగుతాయి. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల వారు ఇక్కడికి వస్తుండడంతో కేటీపీఎస్ ఉద్యోగులు, పట్టణ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్థికభారం పడుతుందని.. కర్మాగారాల్లోని ప్రతి యూనిట్ లైఫ్ టైం 25 ఏళ్లు ఉంటుంది. ఈ క్రమంలో 15 ఏళ్లు దాటిన అనంతరం పునఃరుద్ధరణ, ఆధునీకరణ(రెన్నోవేషన్ అండ్ మోడర్నైజేషన్–ఆర్‌అండ్‌ఎం) పనులు చేపడతారు. ఈ పనులు సకాలంలో చేపట్టకపోతే అనుకున్న స్థాయిలో విద్యుదుత్పత్తి రాదు. బొగ్గు వినియోగం కూడా పెరుగుతుంది. ఫలితంగా జెన్కో సంస్థకు ఆర్థిక భారం పడుతుంది. అయితే 9,10 ఈ యూనిట్లు అందుబాటులోకి వచ్చి 22 ఏళ్లు అవుతోంది. దీంతో యాజమాన్యం ఆధునీకరణ పనులకు మొగ్గు చూపింది. సోమవారం నుంచి పనులు చేపట్టాలని యోచించగా, బాయిలర్ ట్యూబ్ లీకేజీ కారణంగా 250 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 9వ యూనిట్లో ఉత్పత్తిని నిలిపి వేసి గత గురువారం నుంచే ప్రారంభించారు. కర్మాగారంలో కంట్రోల్ అండ్ ఇనుస్ట్రమెంటేషన్ (సీఅండ్ఐ)కి రూ.70 కోట్లు, ఎయిర్ హీటర్లకు రూ.20కోట్లు, ఇతర పనులకు రూ.10 కోట్ల చొప్పున మొత్తం రూ.100 కోట్లుకేటాయించారు. అవసరమైన మెటీరియల్‌ను వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించి కర్మాగారంలో నిల్వ ఉంచారు. పలు రాష్ట్రాల నుంచి టెక్నీషియన్లు... ఆధునీకరణ పనుల చేసేందుకు పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, హరిద్వార్ తదితర ప్రాంతాలకు చెందిన టెక్నీషియన్లు, ఇంజనీర్లు విమాన, రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో రానున్నారు. వీరంతా నేటి నుంచి దఫదఫాలుగా చేరుకుంటారు. వారికి వసతి సౌకర్యంతోపాటు క్యాంటీన్లలో భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. సుమారు రెండు నెలలపాటు జరిగే ఈ పనుల్లో స్థానిక కేటీపీఎస్ ఉద్యోగులు, ఇంజనీర్లతో కలిసి పని చేస్తారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారితో కలిసి పనిచేయాలంటే స్థానిక ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో కూడా వీరి రాకపోకలు ఉంటాయి. ఈ క్రమంలో పట్టణ ప్రజల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఆధునీకరణ పనులను మరికొంత కాలం వాయిదా వేయాలని ఉద్యోగ సంఘాల నేతలు, కార్మికులు కోరుతున్నారు. 9,10 యూనిట్లు ప్రస్తుతం రికార్డ్ స్థాయిలో ఉత్పత్తి అందిస్తున్నాయని, 9వ యూనిట్ 100 రోజులపాటు నిరంతరాయంగా విద్యుదుత్పత్తి సాధించి రికార్డ్ సృష్టించిందని చెబుతున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని పనుల నిర్వహణపై యాజమాన్యం పునరాలోచించాలని కోరుతున్నారు. కాగా ఇప్పటికే పనులు మూడుసార్లు వాయిదాపడ్డాయని, ఇంకా వాయిదా వేయలేమనే రీతిలో జెన్కో యాజమాన్యం వ్యవహరిస్తోంది. రక్షణ చర్యలు తీసుకుంటాం కేటీపీఎస్ 5వ దశ నిర్మించి 22 సంవత్సరాలు పూర్తికావొస్తోంది. ఈ తరుణంలో పునఃరుద్ధరణ, ఆధునీకరణ పనులను రూ.100 కోట్లతో బీహెచ్ఈఎల్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టాం. విద్యుత్ అవసరాలు కీలకం కానున్న క్రమంలో ఆధునీకరణ పనులు చేయాల్సి వస్తోంది. కరోనా వైరస్ నియంత్రణకు రక్షణ చర్యలు తీసుకుంటాం.–కె.రవీంద్ర కుమార్, కేటీపీఎస్ 5,6 దశల సీఈ -
రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: కేటీపీఎస్ ఉద్యోగులు
సాక్షి, ఖమ్మం(పాల్వంచ) : టీఎస్ జెన్కో, ట్రాన్స్ కో సీఎండీ డి.ప్రభాకర్ రావుపై కాంగ్రెస్ ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల విద్యుత్ ఉద్యోగులు, కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. శుక్రవారం కేటీపీఎస్ అంబేడ్కర్ సెంటర్లో టీఎస్ పీఈజెఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఇంజనీర్లు, కార్మిక, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జిలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీఎండీకి రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణాను మిగులు విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంగా నిలబెట్టడంతో సీఎండీ కృషి చేశారని అన్నారు. కానీ..రేవంత్ రెడ్డి సీఎండీ ముడుపులు తీసుకున్నారని వ్యాఖ్య చేయడం సరికాదని తెలిపారు. కార్యక్రమంలో పీఈఏ నాయకులు పీవీ.రావు, ఉమామహేశ్వరరావు, టీవీఈఏ నాయకులు ఎన్.భాస్కర్, ఎస్.సుధీర్, పి.ప్రతాప్, టీఈఈఏ నాయకులు పి.షమీర్, సీహెచ్.శ్రీనివాసరావు, టీఎస్ పీడీఈఏ నాయకులు ఎన్.అశోక్ కుమార్, వైవీ.రావు, టీఆర్వీకేఎస్ నాయకులు కట్టా మల్లికార్జున్‌రావు, 1104 నాయకులు పి.సుధీర్, కోటేశ్వరరావు, 1535 రాష్ట్ర అధ్యక్షులు ఎంఏ.వజీర్, 327 నాయకులు మాజీద్, బీఎంఎస్ నాయకులు జి.వేణుగోపాల్, ఓసీ ఎంప్లాయిస్ నాయకులు పి.కోటేశ్వరరావు, కె.రవీందర్, సందుపట్ల శ్రీనివాస రెడ్డి, ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ నాయకులు పి.రాజేశ్వరరావు, అకౌంట్స్, స్టాఫ్ నాయకులు సీహెచ్.శ్రీనివాస రెడ్డి, హెచ్ 142 నాయకులు కెవి.రామారావు తదితరులు పాల్గొన్నారు. కేటీపీఎస్ సెంట్రల్ ఆఫీస్‌లో.. నిరసన కార్యాక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డీవైసీసీఏ.సోని రావు, ఎస్ఏఓ హరిత, సార, రంగాచారి, చెరుకు అశోక్, ఎండీ.సాధిక్, రెడ్డిరాజుల రమేష్, గుండా సాంబశివరావు, ప్రకాష్, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. -
పీఆర్సీ కోసం... కేటీపీఎస్ ఉద్యోగుల సమ్మె
పాల్వంచ, న్యూస్‌లైన్ : విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటనలో జాప్యాన్ని నిరసిస్తూ కేటీపీఎస్ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. గత 21నే పీఆర్సీకి సంబంధించిన జీవో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఆలస్యం అవుతోంది. అయితే గతంలోనే విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధం కాగా.. రాష్ట్ర విభజనతో నిమిత్తం లేకుండా మే 21న జీవో విడుదల చేస్తామని ఏపీ జెన్కో ఎండీ హామీ ఇవ్వడంతో వారి నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు ఆ హామీ నెరవేరేలా లేకపోవడంతో సమ్మెబాట పట్టారు. పలు సంఘాల నాయకులు ఏకమై కేటీపీఎస్ పరిధిలోని ఓఅండ్ఎం 5, 6 దశల కర్మాగారాల ఎదుట ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల నుంచే ఆందోళనకు దిగారు.మొదటి షిఫ్ట్ కార్మికులు విధులకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో మధ్యాహ్నం చీఫ్ ఇంజనీర్ సిద్దయ్య ధర్నా వద్దకు వచ్చి సమ్మెతో విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడుతుందని, తక్షణం విధుల్లోకి రావాలని, మిగితా కార్మికులను లోనికి అనుమతించాలని నాయకులను కోరారు. అయితే వారు దానికి అంగీకరించకుండా పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, ఈపీఎఫ్‌ను జీపీఎఫ్‌గా మార్చాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఎస్పీఎఫ్ కమాండెంట్జమీల్పాషా ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని గేట్లు తెరవడంతో పాటు అక్కడ ఆందోళన చేయవద్దని, పక్కకు వెళ్లాలని చెప్పడంతో ఉద్యోగులకు - పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సీఈ గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సిద్దయ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉద్యోగ సంఘాల మధ్య ఘర్షణ... సమ్మె విరమించి విధులకు రావాలని ఎస్ఈలు ఆనందం, బిచ్చన్న కోరడంతో ఆందోళనకు దూరంగా ఉన్న తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు టి.ప్రవీణ్ కుమార్, వెంకటేషం, కట్టా మల్లికార్జున్ త దితరులు విధులకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో వారిని జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. ఈ సమయంలో వారి మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. రాత్రి షిఫ్ట్ సిబ్బందితోనే యూనిట్ల నిర్వహణ శనివారం రాత్రి విధులకు వెళ్లిన ఉద్యోగులు, కార్మికులు ఉదయం డ్యూటీ దిగాల్సి ఉండగా అధికారులు ఆదివారం కూడా వారితోనే పనులు చేయించారు. సిబ్బందికి అవసరమైన టిఫిన్, భోజనం, ఇతర సౌకర్యాలను అక్కడే కల్పించారు. కొన్ని మార్గాల ద్వారా కొంత మేరకు కార్మికులను లోనికి తీసుకెళ్లి యూనిట్లు పడిపోకుండా చర్య తీసుకోగలిగారు. సీఈలు, ఎస్ఈలు కర్మాగారాల్లోనే ఉండి విద్యుదుత్పత్తిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. సమ్మెకు 1104 యూనియన్ నాయకులు కె.కోటేశ్వరరావు, సునీల్ రెడ్డి, 327 నాయకులు పి.వి.కోటేశ్వరరావు, 1535 నాయకులు లీవెన్, అంబాల శ్రీను, హెచ్ 67 నాయకులు ఎం.రమేష్, తెలంగాణ విద్యుత్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి భాస్కర్, ఏఈస్ అసోసియేషన్ నాయకులు అన్వర్‌బాషా తదితరులు నాయకత్వం వహించారు. విద్యుదుత్పత్తికి భారీగా గండి.. పాల్వంచ : రాష్ట్రానికి వెలుగులు పంచే కేటీపీఎస్ కాంప్లెక్స్‌లో ఉద్యోగుల మెరుపు సమ్మె కారణంగా భారీగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. కేటీపీఎస్ ఓఅండ్ఎం, 5, 6 దశల్లోని మొత్తం 11 యూనిట్లలో 1,720 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుండగా ఆదివారం రాత్రికి సమ్మె కారణంగా 515 మెగావాట్లకు పడిపోయింది. ఇది ఇలానే కొనసాగితే మరో 24 గంటల్లో పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి నిలిచి పోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కర్మాగారంలో పనిచేసే సిబ్బంది లేక విద్యుదుత్పత్తి క్రమేణా పడిపోతోంది. 6వ దశలోని 500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 11వ యూనిట్ తొలుత ట్రిప్ కావడంతో విద్యుదుత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. 5వ దశలో 9వ యూనిట్లో 250 మెగావాట్లకు గాను 95 మెగావాట్లు, 10వ యూనిట్లో 250 మెగావా ట్లకు గాను 120 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి వస్తోంది. ఓఅండ్ఎం పరిధిలో మొత్తం 720 మెగావాట్ల సామర్థ్యం ఉండగా అందులో గత శనివారం 8వ యూనిట్‌లోని 120 మెగావాట్లను వార్షిక మరమ్మతుల కోసం షట్‌డౌన్ చేశారు. దీంతో ప్రస్తుతం 600 మెగావాట్లు ఉత్పత్తి అవుతుండగా సమ్మె కారణంగా ఇక్కడ బొగ్గు లెవల్ పడిపోవడంతో 375 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే అవుతున్నట్లు అధికారులు తెలి పారు. అయితే సమ్మె ఇలానే కొనసాగితే పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.