కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన జూన్ 2వ తేదీ నుంచి అమల్లోకి రానుండటంతో ఉమ్మడి రాష్ట్ర సర్వర్లు శుక్రవారం మధ్యాహ్నం నుంచే డౌన్ అయ్యాయి. ఫలితంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు స్తంభించాయి. సోమవారం సాయంత్రానికి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సర్వర్ పనిచేసే అవకాశం ఉంది. అయితే మంగళవారం నాటికి పూర్తి స్థాయిలో సర్వర్ అందుబాటులోకి రావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా ట్రెజరీలో ఈనెల 31వ తేదీ వరకు స్కాలర్‌షిప్‌లు, స్టైఫండ్, ఎన్నికల బిల్లులు, పెన్షన్ల బిల్లులు మినహా అన్ని రకాల బిల్లుల మంజూరు నిలిపేశారు.
ఆ తర్వాత ఇక్కడ కూడా అన్ని రకాల సేవలను కొత్త సర్వర్‌తోనే పునరుద్ధరించనున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖలో సర్వర్ డౌన్ కావడంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచే రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. కొత్త సర్వర్ అందుబాటులోకి వచ్చే వరకు ఇదే పరిస్థితి నెలకొననుంది. జిల్లా మొత్తం రోజుకు 600 నుంచి 700 రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా.. సర్వర్ డౌన్ కావడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడనుంది. సర్వర్ కారణంగా మీసేవలు కూడా నిలిచిపోయాయి. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో చోటు చేసుకున్న అంతరాయం కారణంగా విద్యార్థులు, రైతులు, వివిధ వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజుకు కనీసం 3వేల నుంచి 4వేల సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో జారీ అవుతుండగా.. నాలుగు రోజుల పాటు సేవలు స్తంభించనున్నాయి. వాణిజ్య పన్నులు, రవాణా శాఖల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
సర్వర్ డౌన్
Published Sat, May 31 2014 2:31 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement
Advertisement