అప్పుచేసి పప్పుకూడు!
కర్నూలు నగరంలోని దామోదరం సంజీవయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో మొత్తం 450 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో సుమారు 230 మందికి రోజూ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఇందుకోసం నెలకు రూ.34,500 ఖర్చు అవుతోంది. భోజనం తయారు చేస్తున్న ప్రతిభ ఏజెన్సీకి మూడు నెలల బిల్లు రూ.1,03,500 బకాయి
ఉంది. కనీసం వంట గది కూడా లేకపోవడంతో ఆరుబయటే భోజనం తయారు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉంటే.. మారుమూల ప్రాంతాల్లో భోజనం తయారీ ఏ రీతిన ఉంటుందో తెలియజేస్తోంది.
కర్నూలు(విద్య):ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెంచడంతో పాటు పౌష్టికాహారం అందించేందుకు ఉద్దేశించి మధ్యాహ్న భోజన పథకం అభాసుపాలవుతోంది. వంట ఏజెన్సీలకు మూడు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పు చేసి పప్పు కూడా అందించలేక చేతులెత్తేస్తున్నారు.
లోటు బడ్జెట్‌ను చూపుతూ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. జిల్లాలోని 2,924 ప్రభుత్వ, బాల కార్మిక, ఎయిడెడ్, మోడల్ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం నిర్వహణకు 2,930 ఏజెన్సీలను ఏర్పాటు చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెంచాలనే ఉద్దేశంతో 2003లో అప్పటి యూపీఏ ప్రభుత్వం 1 నుంచి 7 తరగతుల విద్యార్థులను ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు.
2008లో 8వ తరగతి.. 2008-09 విద్యా సంవత్సరంలో 9, 10 తరగతుల విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. విద్యా శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 1 నుంచి 5 తరగతుల విద్యార్థులు 2,44,919.. 6 నుంచి 8 తరగతుల విద్యార్థులు 1,22,381.. 9 నుంచి 10 తరగతుల విద్యార్థులు 65వేల మంది ఉన్నారు. ప్రభుత్వం 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు నెలకు రూ.2కోట్లు.. 9, 10 తరగతుల విద్యార్థులకు రూ.50 లక్షలు ఖర్చు చేస్తోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు నెలలో బడ్జెట్ కేటాయింపులు చేసినా.. గత మూడు నెలలుగా ఏజెన్సీలకు రూ.7కోట్ల బకాయి పడింది. ఈ పరిస్థితుల్లో కొన్ని వంట ఏజెన్సీలు అప్పు చేసి విద్యార్థుల ఆకలి తీరుస్తున్నాయి. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు ప్రభుత్వం ఇస్తున్న మొత్తం గిట్టుబాటు కాకపోయినా నిర్వాహకులు అతికష్టంపై నెట్టుకొస్తున్నారు.
ఆరుబయటే వంట
జిల్లాలోని 2,924 స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తుండగా.. 780 స్కూళ్లకు మాత్రమే వంట గదులు ఉన్నాయి. వీటిలోనూ వందకు పైగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతం 142 స్కూళ్లలో వంటగదుల నిర్మాణం వివిధ దశలో ఉంది.
ఇటీవల కొత్తగా 282 స్కూళ్లలో వంట గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. గతంలో నిర్మాణ వ్యయం రూ.75వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.1.50లక్షలకు పెంచి బాధ్యతలను గృహ నిర్మాణ శాఖకు అప్పగించారు. అయితే పనులు మొదలు కాకపోవడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో నిర్వాహకులు ఆరుబయటే వంట చేస్తుండటం విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. వంట పాత్రలు కూడా 2010లో కేవలం 2వేల స్కూళ్లకు మాత్రమే అందించడం గమనార్హం.
కొరవడిన పర్యవేక్షణ
మధ్యాహ్న భోజనం అమలులో అధికారుల పర్యవేక్షణ కొరవడింది. మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందించే ముందు రోజుకొకరు చొప్పున ఉపాధ్యాయులు భోజనం చేయాల్సి ఉంది. అయితే నిర్వాహకులు ఆయా స్కూళ్ల హెచ్‌ఎంలతో కుమ్మక్కై మెనూకు మంగళం పాడుతున్నారు. ఈ కారణంగా చాలా మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం ఇళ్ల నుంచే తెచ్చుకుంటున్నారు. ధరలు పెరిగాయనే సాకుతో వారంలో రెండు రోజులు గుడ్లు అందించాల్సి ఉండగా.. ఒక్క రోజుతోనే సరిపెడుతున్నారు.స్కూళ్లలో కనీసం తాగునీటి వసతి కూడా లేకపోవడంతో విద్యార్థులకు ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది.
పెరిగిన ధరలను పరిగణనలోకి తీసుకోవాలి
ప్రస్తుతం పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో మధ్యాహ్న భోజనం నాణ్యతతో అందించలేకపోతున్నాం. ప్రభుత్వం ఆకాశాన్ని అంటుతున్న ధరలను పరిగణనలోకి తీసుకోవాలి. ఏజెన్సీలకు ఇస్తున్న రూ.1000 వేతనం ఏ మూలకు సరిపోవడం లేదు. బిల్లులు కూడా ప్రతి నెలా సక్రమంగా చెల్లించాలి.
- మరియమ్మ, వంట ఏజెన్సీ నిర్వాహకురాలు, గూడూరు జెడ్పీ హైస్కూల్
మూడు నెలలుగా బిల్లుల్లేవు
మూడు నెలలుగా మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించలేదు. వడ్డీలకు తెచ్చి కూరగాయలు, పప్పు, నూనె కొనుగోలు చేస్తున్నాం. నెలనెలా బిల్లులు ఇస్తేనే నాణ్యమైన భోజనం అందివ్వగలం. ప్రతి నెలా ఎంఈఓ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. సారోళ్లు కూడా ఏమీ చేయలేమంటున్నారు.
- సందమ్మ,
ముడుమాల హైస్కూల్ ఏజెన్సీ, సి.బెళగల్
బిల్లుల సమస్యలకు త్వరలో పరిష్కారం
ఏజెన్సీలకు మూడు నెలల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇటీవల ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు తెలిసింది. అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. సమస్య త్వరలోనే పరిష్కారమవుతుంది. వంట గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. బిల్లులు అందలేదనే కారణంగా భోజనంలో నాణ్యత తగ్గిస్తే ఊరుకోం. అక్రమాలకు పాల్పడిస్తే సహించేది లేదు.
- డి.వి.సుప్రకాష్, డీఈఓ
మిథ్యాహ్న భోజనం
Published Mon, Dec 8 2014 2:21 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement