నూనెపల్లె, న్యూస్‌లైన్: ఎస్సీ విద్యార్థులకు ఉచితంగా సాంకేతిక విద్య అందించాలనే లక్ష్యం నెరవేరే పరిస్థితి లేకుండా పోతోంది. నంద్యాలలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతంలో జీఎంఆర్‌పీ (గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్) కళాశాల ఏర్పాటు చేసేందుకు పంపిన ప్రతిపాదనలు అమలుకు నోచుకోవడం లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కళాశాల ఏర్పాటుపై ఇంత వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జిల్లాలో ఆరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. ఇందులో ఎస్టీలకు, ముస్లింలతో పాటు ఇతర కులాల వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రత్యేక కాలేజీలున్నాయి.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో భాగంగా నంద్యాలలో ఎస్సీలకు మాత్రమే మోడల్ స్థాయిలో కళాశాల ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు కోరారు. రాష్ట్ర కమిషనర్ ఆఫ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ద్వారా న్యూ ఢిల్లీలోని ఏఐసీటీఈ (ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్)కి ఈ మేరకు అవసరమైన ప్రతిపాదనలు పంపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తలెత్తే ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కళాశాలకు అనుమతులు నిలిపివేసినట్లు తెలుస్తోంది.
విద్యార్థులకుండే బెనిఫిట్స్ ఇవే: జీఎంఆర్‌పీ కళాశాలకు గ్రీన్‌సిగ్నల్ వచ్చి కాలేజీలో విద్యార్థులకు సీటు వస్తే మూడేళ్ల పాటు పాలిటెక్నిక్ విద్య ఉచితంగా అందుతుంది.
ప్రత్యేక హాస్టల్ వసతి, రుచికరమైన భోజనం, పుస్తకాలు, దుస్తులతో పాటు కాస్మొటిక్ చార్జీలు, ప్రత్యేక మెనూ ఇలా ఎన్నో సౌకర్యాలు, సదుపాయాలుంటాయి.
కళాశాలలో వివిధ బ్రాంచ్‌ల్లో 120మందికి చేరేందుకు అవకాశం ఉంటుంది.