రద్దు కానున్న యూజీసీ, ఏఐసీటీఈ!
న్యూఢిల్లీ: విద్యా రంగంలో నియంత్రణ సంస్థలైన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ), ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ)లు త్వరలో రద్దు కానున్నాయి. వీటి స్థానంలో ఉన్నత విద్యకు సంబంధించి ఏకైక నియంత్రణ సంస్థను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంపవర్‌మెంట్ రెగ్యులేషన్ ఏజెన్సీ(హెచ్‌ఈఈఆర్‌ఏ–హీరా) పేరిట నూతన వ్యవస్థను ప్రతిపాదించింది.
వేర్వేరు నియంత్రణ సంస్థల అధికార పరిధిపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడంతో పాటు, అనవసర నియంత్రణ నిబంధనలను తగ్గించడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారు. సాంకేతిక, సాంకేతికేతర విద్యా సంస్థలను ఒకే గొడుగు కిందికి తీసుకురావడానికి మానవ వనరుల శాఖ, నీతి ఆయోగ్‌తో కలిసి పనిచేస్తోంది. ప్రతిపాదిత నియంత్రణ సంస్థ, దాని బిల్లుకు సంబంధించిన నమూనాపై కసరత్తు జరుగుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.