Cancellations
-
పాపం పసివాళ్లు!
ఒక్క ఉగ్రవాద దాడి రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీయడమే గాక తల్లీబిడ్డలను విడదీస్తోంది. భార్యాభర్తలను వేరు చేస్తోంది. విభజన కాలం నాటి ఉది్వగ్న పరిస్థితులను తలపిస్తోంది. పహల్గాంలో ఉగ్రదాడి తరువాత పాక్ వీసాలను రద్దు చేయడం తెలిసిందే. దాంతో ఇక్కడి పాకిస్తానీలంతా వెనుదిరుగుతున్నారు. భారత వీసాలున్న పలువురు మహిళలు మాత్రం తమ కుటుంబంతో పాటు పాక్ వెళ్లలేకపోతున్నారు. పాక్ వీసాలున్న వారి పిల్లలేమో వెళ్లక తప్పని పరిస్థితి! తల్లులను విడిచి వెళ్లలేక వారు పడుతున్న బాధ వర్ణనాతీతం! ‘‘‘తల్లి లేకుండా పిల్లలెలా ఉంటారు ప్రధాని మోదీ జోక్యం చేసుకుని తల్లులను పిల్లల దగ్గరకు చేర్చాలి’’ అని ఆ కుటుంబాలు వేడుకుంటున్నాయి.పిల్లలు విలవిల్లాడుతున్నారుగత నెలలో కరాచీ నుంచి భారత్‌కు వచ్చిన మరో కుటుంబానిదీ ఇదే పరిస్థితి. తల్లికి భారత పౌరసత్వం ఉండగా పిల్లలు పాకిస్తాన్ జాతీయులు. ‘‘అమ్మను వదిలి వెళ్లడం బాధగా ఉంది. అమ్మ మాతోపాటు పాక్ రావడానికి అనుమతించాలని మోదీని వేడుకుంటున్నా’’ అంటూ అల్యాన్ అనే బాలుడు అభ్యర్థించాడు. ‘‘మేం గత నెల కరాచీ నుంచి భారత్ వచ్చాం. నా భార్య నబీలాను ఇక్కడే వదిలి తిరిగి వెళ్లాలివస్తోంది. పిల్లలు విలవిల్లాడుతున్నారు. ఈ టెర్రరిస్టులు మా కుటుంబాన్ని వేరు చేశారు. అందుకు మూల్యం చెల్లించుకుంటారు’’ అని అల్యాన్ తండ్రి మహ్మద్ ఇర్ఫాన్ వాపోయారు. భార్య షర్మిన్, కూతుళ్లతో కలిసి వచ్చిన మహ్మద్ ఇమ్రాన్‌దీ ఇదే పరిస్థితి. ‘‘షర్మిన్‌కు భారత పాస్‌పోర్టుంది. దాంతో మాతో పాక్ వచ్చేందుకు అనుమతించడం లేదు. మోదీ మాకు సాయం చేయాలి’’ అని ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అమ్మమ్మను చూడ్డానికి వచ్చి.. అమ్మను వదిలేసి.. ఆదివారం పంజాబ్‌లోని అటారీ సరిహద్దులో విషాద పరిస్థితులు నెలకొన్నాయి. తల్లిని వీడి వెళ్తున్న 11 ఏళ్ల జైనబ్, 8 ఏళ్ల జెనీష్ కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘నానీని కలవడానికి వచ్చాం. కానీ ఇప్పుడు అమ్మ మాతో రాలేకపోతోంది. నేను, చెల్లి మాత్రమే వెళ్లిపోతున్నాం. అమ్మను వదిలి వెళ్లాలన్న ఆలోచనకే నా గుండె బద్దలవుతోంది’’ అంటూ జైనాబ్ విలపిస్తోంది. వారి తండ్రి పాకిస్తానీ. తల్లిది ఢిల్లీ. పిల్లలిద్దరికీ పాకిస్తాన్ పాస్‌పోర్టుండగా తల్లికి భారత్ పాస్‌పోర్టుంది. ఢిల్లీలో అమ్మమ్మను చూడ్డానికి గత నెలలో వచ్చారు. తమలాంటి అమాయకులను ఇబ్బంది పెట్టిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని జైనాబ్ కోరుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాకిస్తాన్ పౌరులకు 14 కేటగిరీల వీసాలు రద్దు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ పౌరులకు ఇచ్చిన 14 కేటగిరీల వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ శుక్రవారం వెల్లడించింది. పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంచేసింది. ఇందులో బిజినెస్, కాన్ఫరెన్స్, విజిటర్ వంటి వీసాలు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు సమాచారం చేరవేసింది. పాకిస్తాన్ జాతీయులకు జారీ చేసిన లాంగ్‌టర్మ్, దౌత్య, అధికారిక వీసాలకు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది. సార్క్ వీసాలు కలిగినవారంతా ఈ నెల 26వ తేదీలోగా దేశం విడిచివెళ్లిపోవాలని ఆదేశించింది. బిజినెస్, ఫిలిం, జర్నలిస్టు, ట్రాన్సిట్, స్టూడెంట్, గ్రూప్ టూరిస్టు వంటి వీసాలు పొందినవారు ఈ నెల 27వ తేదీలోగా ఇండియాను వీడాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. పాకిస్తాన్‌లోని మైనార్టీలకు ఇచ్చిన బృంద యాత్రికుల వీసాలను సైతం రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక మెడికల్ వీసాలపై ఇండియాకు వచ్చినవారు ఈ నెల 29వ తేదీలోగా స్వదేశానికి వెళ్లిపోవాలని కేంద్ర హోంశాఖ తేల్చిచెప్పింది. -
రద్దు కానున్న యూజీసీ, ఏఐసీటీఈ!
న్యూఢిల్లీ: విద్యా రంగంలో నియంత్రణ సంస్థలైన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ), ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ)లు త్వరలో రద్దు కానున్నాయి. వీటి స్థానంలో ఉన్నత విద్యకు సంబంధించి ఏకైక నియంత్రణ సంస్థను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ రెగ్యులేషన్ ఏజెన్సీ(హెచ్ఈఈఆర్ఏ–హీరా) పేరిట నూతన వ్యవస్థను ప్రతిపాదించింది. వేర్వేరు నియంత్రణ సంస్థల అధికార పరిధిపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడంతో పాటు, అనవసర నియంత్రణ నిబంధనలను తగ్గించడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారు. సాంకేతిక, సాంకేతికేతర విద్యా సంస్థలను ఒకే గొడుగు కిందికి తీసుకురావడానికి మానవ వనరుల శాఖ, నీతి ఆయోగ్‌తో కలిసి పనిచేస్తోంది. ప్రతిపాదిత నియంత్రణ సంస్థ, దాని బిల్లుకు సంబంధించిన నమూనాపై కసరత్తు జరుగుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
స్తంభించిన రైలు రవాణా
-
స్తంభించిన రైలు రవాణా
- భారీ వర్షాలతో గుంటూరు-సత్తెనపల్లి మార్గంలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ - నడికుడి మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం - ఏడు చోట్ల ట్రాక్‌లపైకి నీళ్లు.. రైల్వే లైన్‌కు గండ్లు - పలు రైళ్ల రద్దు.. కాజీపేట, గుంతకల్ మీదుగా కొన్ని మళ్లింపు - ఇంటర్ లాకింగ్ ఆధునీకరణతో ఇప్పటికే విజయవాడ వైపు రైళ్ల నియంత్రణ సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రైలు రవాణా స్తంభించింది. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షంతో హైదరాబాద్-గుంటూరు మధ్య నడికుడి మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే విజయవాడలో రూట్ రిలే ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ ఆధునీకరణ పనుల దృష్ట్యా ఒకవైపు రైళ్ల రాకపోకలపై నియంత్రణ కొనసాగుతుండగా.. తాజాగా గుంటూరు-సత్తెనపల్లి మార్గంలో రైల్వేట్రాక్ దెబ్బతినడంతో గురువా రం ఒక్కరోజే 40కి పైగా రైళ్లు రద్దయ్యాయి. ఈ మార్గంలో చాలాప్రాంతాల్లో వరదనీరు పట్టాల మీదుగా ప్రవహిస్తుండటంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. 7 చోట్ల రైలు మార్గాలు దెబ్బతిన్నట్టు గుర్తించి ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపేసింది. సత్తెనపల్లి-రెడ్డిగూడెం, రెడ్డిగూడెం-బెల్లంకొండ, బెల్లంకొండ-పిడుగురాళ్ల, పిడుగురాళ్ల-తుమ్మలచెరువు స్టేషన్ల మధ్య ఏడు చోట్ల ట్రాక్ కింద మట్టికొట్టుకుపోయింది. అప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉన్న రైళ్లను సమీపంలోని స్టేషన్లలో నిలిపేసి ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం లేకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. మిగతా రైళ్లను రద్దు చేసింది. అయితే రైళ్లు రద్దయినట్టు సమాచారం తెలియకపోవడంతో సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లలో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాశారు. పలు రైళ్లు రద్దు.. కొన్ని మళ్లింపు.. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, గుంటూరు-వికారాబాద్ పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లను నిలిపేయటంతో వాటిల్లోని ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. అయితే వారికి రైల్వే సిబ్బంది భోజనం, మంచినీళ్లను అందించారు. గురువారం నడికుడి మార్గంలో ప్రయాణించాల్సిన సికింద్రాబాద్-గూడూరు సింహపురి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్, వికారాబాద్-గుంటూరు పల్నాడు ఎక్స్‌ప్రెస్, కాచిగూడ-రేపల్లె ప్యాసింజర్ రైలు, రేపల్లె-సికింద్రాబాద్ ప్యాసింజర్(ఒకవైపు), గుంటూరు-మాచర్ల రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్-రేపల్లె ప్యాసింజర్‌ను మిర్యాలగూడ వరకే నడిపారు. హైదరాబాద్-చెన్నై, సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైళ్లను కాజీపేట, విజయవాడ మీదుగా మళ్లించారు. శుక్రవారం పలు రైళ్ల రద్దు.. తాత్కాలికంగా కొన్ని చోట్ల ట్రాక్‌ను పునరుద్ధరించినా వాన తెరిపినివ్వకపోవడంతో ఫలితం లేకుండా పోయింది. శుక్ర, శనివారాల్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో శుక్రవారం కూడా పలు రైళ్లను రద్దు చేసి మిగతావాటిని దారి మళ్లించారు. సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను రెండు వైపులా రద్దు చేశారు. తిరుపతి-ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్‌ప్రెస్, ఆదిలాబాద్-నాందేడ్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-విజయవాడ ఎక్స్‌ప్రెస్, కాచిగూడ-గుంటూరు డబుల్‌డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రెండు వైపులా, సికింద్రాబాద్-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రెండు వైపులా, మాచర్ల-భీమవరం ఎక్స్‌ప్రెస్, గుంటూరు-మాచెర్ల ప్యాసింజర్, మాచెర్ల-నడికుడి ప్యాసింజర్, కాచిగూడ-మిర్యాలగూడ ప్యాసింజర్ రెండు వైపులా, కాచిగూడ-రేపల్లె ప్యాసింజర్, రేపల్లె-సికింద్రాబాద్ ప్యాసింజర్ రెండు వైపులా, మిర్యాలగూడ-పిడుగురాళ్ల ప్యాసింజర్, గుంటూరు-మాచర్ల, మాచర్ల-గుంటూరు ప్యాసింజర్లను రద్దు చేశారు. గుంటూరు-సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రెండు వైపులా ట్రిప్పులను, సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్ రెండువైపులా ట్రిప్పులను విజయవాడ బల్బ్ క్యాబిన్ స్టేషన్, కాజీపేట మీదుగా, చెన్నై సెంట్రల్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ రెండువైపులా, సికింద్రాబాద్-తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లను గుంతకల్ స్టేషన్ మార్గం మీదుగా మళ్లించారు. తిరువనంతపురం-హైదరాబాద్ శబరి ఎక్స్‌ప్రెస్ రెండువైపులా ట్రిప్పులను రేణిగుంట, తిరుపతి, గుంతకల్ మార్గం గుండా మళ్లించారు. రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లు ► గుంటూరు స్టేషన్: 9701379072, 0863-2222014 ► గుంటూరు సెంట్రల్ కంట్రోల్: 9701379073, 1072 ► మిర్యాలగూడ రైల్వే స్టేషన్: 7093998715 ► విజయవాడ రైల్వే స్టేషన్: 0866-2575038 ► సికింద్రాబాద్ స్టేషన్: 27700868, 27786170, 27786539 అనుక్షణం అప్రమత్త్తం భారీ వర్షాలతో పరిస్థితిని అనుక్షణం పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉన్నాం. నడికుడి మార్గంలో 7 చోట్ల రైల్వేలైన్‌కు గండ్లు పడటంతో అప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉన్న రైళ్లను స్టేషన్లలో నిలిపివేయటంతోపాటు మిగతా వాటిని రద్దుచేసి కొన్నింటిని దారిమళ్లించాం. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా భోజన, మంచినీటి సదుపాయం కల్పించాం. ట్రాక్ పునరుద్ధరణకు సిబ్బంది రంగంలోకి దిగారు. ఏపీ ప్రభుత్వంతో సంప్రదిస్తూ చర్యలు తీసుకుంటున్నాం. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేస్తున్నాం. - జీఎం రవీంద్రగుప్తా -
భారీ వర్షాలు : పలు రైళ్లు రద్దు
గుంటూరు : జిల్లాలో భారీ వర్షాల కారణంగా పలు రైళ్ల రాకపోకలు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గురువారం ప్రకటించింది. అలాగే పలు రైళ్లు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వివిధ రైళ్లు దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. గుంటూరు - మాచర్ల - గుంటూరు ప్యాసింజర్ రద్దు నడికుడి - మాచర్ల - నడికుడి ప్యాసింజర్ రద్దు సికింద్రాబాద్ - గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ పాక్షికంగా రద్దు. ఆదిలాబాద్ - తిరుపతి - ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్‌ప్రెస్ పాక్షికంగా రద్దు రేపల్లె - సికింద్రాబాద్ - రేపల్లె ప్యాసింజర్ రద్దు తిరువనంతపురం - హైదరాబాద్ శబరి ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు తిరువనంతపురం - గోరఖ్‌పూర్ రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు హైదరాబాద్ - తిరువనంతపురం శబరి ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు -
తెలంగాణలో రద్దుల పర్వం మొదలు!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రద్దుల పర్వం మొదలైంది. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న అనేక నిర్ణయాలను ఈ ప్రభుత్వం తిరగదోడుతోంది. ఆ ప్రభుత్వం వివిధ సంస్థలకు, సొసైటీలకు మంజూరు చేసిన భూములను తిరిగి తీసుకుంటోంది. ఉమ్మడి వాసన వచ్చే ప్రతిదాన్ని రద్దు చేసుకుంటూ పోతోంది. ఉమ్మడిరాష్ట్రంలో ఉన్న భూదాన్ ట్రస్ట్‌ను కూడా తెలంగాణ ప్రభుత్వం ఈరోజు రద్దు చేసింది. త్వరలో తెలంగాణకు కొత్త బోర్డు ఏర్పాటు చేయనున్నారు. ఈ విధంగా ఇంకా అనే సంస్థలను, నిర్ణయాలను రద్దు చేసే అవకాశం ఉంది.