స్తంభించిన రైలు రవాణా | Stoped the some of rail transport | Sakshi
Sakshi News home page

స్తంభించిన రైలు రవాణా

Published Fri, Sep 23 2016 4:03 AM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM

స్తంభించిన రైలు రవాణా

స్తంభించిన రైలు రవాణా

- భారీ వర్షాలతో గుంటూరు-సత్తెనపల్లి మార్గంలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్
- నడికుడి మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
- ఏడు చోట్ల ట్రాక్‌లపైకి నీళ్లు.. రైల్వే లైన్‌కు గండ్లు
- పలు రైళ్ల రద్దు.. కాజీపేట, గుంతకల్ మీదుగా కొన్ని మళ్లింపు
- ఇంటర్ లాకింగ్ ఆధునీకరణతో ఇప్పటికే విజయవాడ వైపు రైళ్ల నియంత్రణ
 
 సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రైలు రవాణా స్తంభించింది. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షంతో హైదరాబాద్-గుంటూరు మధ్య నడికుడి మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే విజయవాడలో రూట్ రిలే ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ ఆధునీకరణ పనుల  దృష్ట్యా ఒకవైపు రైళ్ల రాకపోకలపై నియంత్రణ కొనసాగుతుండగా.. తాజాగా గుంటూరు-సత్తెనపల్లి మార్గంలో రైల్వేట్రాక్ దెబ్బతినడంతో గురువా రం ఒక్కరోజే 40కి పైగా రైళ్లు రద్దయ్యాయి. ఈ మార్గంలో చాలాప్రాంతాల్లో వరదనీరు పట్టాల మీదుగా ప్రవహిస్తుండటంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. 7 చోట్ల రైలు మార్గాలు దెబ్బతిన్నట్టు గుర్తించి ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపేసింది. సత్తెనపల్లి-రెడ్డిగూడెం, రెడ్డిగూడెం-బెల్లంకొండ, బెల్లంకొండ-పిడుగురాళ్ల, పిడుగురాళ్ల-తుమ్మలచెరువు స్టేషన్ల మధ్య ఏడు చోట్ల ట్రాక్ కింద మట్టికొట్టుకుపోయింది. అప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉన్న రైళ్లను సమీపంలోని స్టేషన్లలో నిలిపేసి ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం లేకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. మిగతా రైళ్లను రద్దు చేసింది. అయితే రైళ్లు రద్దయినట్టు సమాచారం తెలియకపోవడంతో సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లలో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాశారు.

 పలు రైళ్లు రద్దు.. కొన్ని మళ్లింపు..
 ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, గుంటూరు-వికారాబాద్ పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లను నిలిపేయటంతో వాటిల్లోని ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. అయితే వారికి రైల్వే సిబ్బంది భోజనం, మంచినీళ్లను అందించారు. గురువారం నడికుడి మార్గంలో ప్రయాణించాల్సిన సికింద్రాబాద్-గూడూరు సింహపురి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్, వికారాబాద్-గుంటూరు పల్నాడు ఎక్స్‌ప్రెస్, కాచిగూడ-రేపల్లె ప్యాసింజర్ రైలు, రేపల్లె-సికింద్రాబాద్ ప్యాసింజర్(ఒకవైపు), గుంటూరు-మాచర్ల రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్-రేపల్లె ప్యాసింజర్‌ను మిర్యాలగూడ వరకే నడిపారు. హైదరాబాద్-చెన్నై, సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైళ్లను కాజీపేట, విజయవాడ మీదుగా మళ్లించారు.

 శుక్రవారం పలు రైళ్ల రద్దు..
 తాత్కాలికంగా కొన్ని చోట్ల ట్రాక్‌ను పునరుద్ధరించినా వాన తెరిపినివ్వకపోవడంతో ఫలితం లేకుండా పోయింది. శుక్ర, శనివారాల్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో శుక్రవారం కూడా పలు రైళ్లను రద్దు చేసి మిగతావాటిని దారి మళ్లించారు. సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను రెండు వైపులా రద్దు చేశారు. తిరుపతి-ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్‌ప్రెస్, ఆదిలాబాద్-నాందేడ్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-విజయవాడ ఎక్స్‌ప్రెస్, కాచిగూడ-గుంటూరు డబుల్‌డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రెండు వైపులా, సికింద్రాబాద్-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రెండు వైపులా, మాచర్ల-భీమవరం ఎక్స్‌ప్రెస్, గుంటూరు-మాచెర్ల ప్యాసింజర్, మాచెర్ల-నడికుడి ప్యాసింజర్, కాచిగూడ-మిర్యాలగూడ ప్యాసింజర్ రెండు వైపులా, కాచిగూడ-రేపల్లె ప్యాసింజర్, రేపల్లె-సికింద్రాబాద్ ప్యాసింజర్ రెండు వైపులా, మిర్యాలగూడ-పిడుగురాళ్ల ప్యాసింజర్, గుంటూరు-మాచర్ల, మాచర్ల-గుంటూరు ప్యాసింజర్లను రద్దు చేశారు. గుంటూరు-సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రెండు వైపులా ట్రిప్పులను, సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్ రెండువైపులా ట్రిప్పులను విజయవాడ బల్బ్ క్యాబిన్ స్టేషన్, కాజీపేట మీదుగా, చెన్నై సెంట్రల్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ రెండువైపులా, సికింద్రాబాద్-తిరుపతి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లను గుంతకల్ స్టేషన్  మార్గం మీదుగా మళ్లించారు. తిరువనంతపురం-హైదరాబాద్ శబరి ఎక్స్‌ప్రెస్ రెండువైపులా ట్రిప్పులను రేణిగుంట, తిరుపతి, గుంతకల్ మార్గం గుండా మళ్లించారు.
 
 రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లు
 ► గుంటూరు స్టేషన్: 9701379072, 0863-2222014
 ► గుంటూరు సెంట్రల్ కంట్రోల్: 9701379073, 1072
 ► మిర్యాలగూడ రైల్వే స్టేషన్: 7093998715
 ► విజయవాడ రైల్వే స్టేషన్: 0866-2575038
 ► సికింద్రాబాద్ స్టేషన్: 27700868, 27786170, 27786539
 
 అనుక్షణం అప్రమత్త్తం
 భారీ వర్షాలతో పరిస్థితిని అనుక్షణం పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉన్నాం. నడికుడి మార్గంలో 7 చోట్ల రైల్వేలైన్‌కు గండ్లు పడటంతో అప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉన్న రైళ్లను స్టేషన్లలో నిలిపివేయటంతోపాటు మిగతా వాటిని రద్దుచేసి కొన్నింటిని దారిమళ్లించాం. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా భోజన, మంచినీటి సదుపాయం కల్పించాం. ట్రాక్ పునరుద్ధరణకు సిబ్బంది రంగంలోకి దిగారు. ఏపీ ప్రభుత్వంతో సంప్రదిస్తూ చర్యలు తీసుకుంటున్నాం. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి  ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేస్తున్నాం.
 - జీఎం రవీంద్రగుప్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement