52 గంటల్లో డౌన్ రైల్వేలైన్ పనులు పూర్తి... కొనసాగుతున్న అప్ లైన్ పనులు
20కి పైగా జేసీబీలతో పనులు.. శ్రమించిన 900 మంది కార్మీకులు, 250 మంది సూపర్‌వైజర్లు, 400 మంది రైల్వే ఉద్యోగులు
సాక్షి, మహబూబాబాద్: భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లాలో కొట్టుకుపోయిన రైల్వే లైన్ల పనులను రైల్వే అధికారులు, సిబ్బంది, కార్మీకులు శరవేగంగా పూర్తి చేశారు. మొత్తంగా 52 గంటల్లో పనులు పూర్తి చేసి ట్రయల్‌రన్ నడిపించారు. అంతా సవ్యంగా ఉండడంతో బుధవారం మధ్యాహ్నం విజయవాడ– సికింద్రాబాద్ మధ్య నడిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలు కదిలింది.
పగలూ.. రాత్రి తేడా లేకుండా...: వరద ఉధృతి పెరిగి తాళ్లపూసపల్లి– కేసముద్రం రైల్వేలైన్‌లోని 432, 433 కిలోమీటరు మార్కు వద్ద 200 మీటర్ల మేర పట్టాల కింద కంకర, మట్టి, సిమెంట్ దిమ్మెలు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఇంటికన్నె– కేసముద్రం మార్గంలో 418 కిలోమీటర్ రాయి వద్ద 200 మీటర్ల మేర, మరో నాలుగు చోట్ల పాక్షికంగా లైన్లు కూడా దెబ్బతిన్నాయి. దీంతో శనివారం అర్ధరాత్రి 2 గంటల నుంచి రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. ఆదివారం కూడా వరద ఉధృతి తగ్గకపోవడంతో మధ్యాహ్నం 2 గంటల నుంచి కార్మీకులను తీసుకొచ్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
పనులు వేగంగా..: దేశంలోని ప్రధాన పట్టణాలను కలుపుతూ నడిచే రైలుమార్గం దెబ్బతినడంతో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోగా, దీంతో మరమ్మతుల పనుల్లో అధికారులు వేగం పెంచారు. ముందుగా డౌన్‌లైన్ పనులు తాళ్లపూసపల్లి– కేసముద్రం మధ్యలో ఏడు జేసీబీలు, 300 మంది కార్మీకులు, 100 మంది సూపర్‌వైజర్లు, 100 మంది వివిధ కేటగిరీకి చెందిన రైల్వే ఉద్యోగులు ఇలా మొత్తంగా 500 మంది పనిచేశారు.
– ఇంటికన్నె– కేసముద్రం మార్గంలో 13 జేసీబీలు, 150 మంది సూపర్‌వైజర్లు, 300 మంది రైల్వేస్టాఫ్, 550మంది కార్మికులు మొత్తం కలిసి 1000 మందితో పనులు ప్రారంభించారు. పనులకు వరద ప్రవాహం అడ్డురావడంతో బండరాళ్లు, ఇసుక బస్తాలతో వరదను కట్టడి చేసి పనులు వేగవంతం చేసినట్టు అధికారులు తెలిపారు. అయితే అప్‌లైన్ (సికింద్రాబాద్–విజయవాడ) లైన్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి.
ఎట్టకేలకు.. కదిలిన రైళ్లు
రైల్వే ట్రాక్ పనులు పూర్తి కావడంతో ముందుగా తాళ్లపూసపల్లి– మహబూబాబాద్ మధ్య ట్రయల్ రన్‌గా గూడ్సు రైలును నడిపారు. ఇంటికన్నె–కేసముద్రం మధ్య కేసముద్రం రైల్వేస్టేషన్‌లో నిలిచిన సంగమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలును ట్రయల్ రన్‌గా నడిపారు. ఆ తర్వాత నాలుగు గూడ్స్ రైళ్లను అప్‌లైన్‌లో పంపించారు.
ఇక ప్రయాణికులతో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలు మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో కేసముద్రం–ఇంటికన్నె మధ్య 418 కిలోమీటర్ మీదుగా వేగాన్ని తగ్గించి 5 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా నడిపించారు. రైల్వేట్రాక్ మరమ్మతులు చేసిన చోట కొంతవరకు కుంగిపోయింది. కాగా ట్రాక్ కుంగిపోయిన చోట జాకీలతో పైకి లేపి మరమ్మతు పనులు చేశారు. వర్షం కురుస్తున్నా, పనులను మాత్రం ఆపకుండా వేగవంతంగా చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment