మహబూబాబాద్ జిల్లాలో వరదకు పలుచోట్ల దెబ్బతిన్న ట్రాక్‌లు
కొట్టుకుపోయిన సిమెంట్ దిమ్మెలు, కంకరరాళ్లు
రైల్వే సిబ్బంది, అధికారుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదాలు
డోర్నకల్, మహబూబాబాద్, కేసముద్రంలో పలు రైళ్ల నిలిపివేత..
సాక్షి, మహబూబాబాద్/ డోర్నకల్/ మహబూబా బాద్ రూరల్/ కేసముద్రం: మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో నాలుగు చోట్ల రైల్వే లైన్లు దెబ్బతిన్నాయి. వరద తాకిడికి పట్టాల కింద సిమెంట్ దిమ్మెలు, కంకరరాళ్లు, మట్టి కొట్టుకుపోయి ఊయలలా పట్టాలు వేలాడుతున్న విషయాన్ని రైల్వే సిబ్బంది పసిగట్టడం.. అప్రమత్తమైన అధికారులు ఎక్కడిక క్కడ రైళ్లను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
అయోధ్య పెద్దచెరువు కట్ట తెగడంతో..
మహబూబాబాద్ రూరల్ మండలం అయోధ్య పెద్ద చెరువు కట్ట తెగడంతో వరద నీరు ఉధృతంగా తాళ్లపూసపల్లి సమీపంలో రైల్వేట్రాక్ కిందినుంచి వెళ్లింది. దీంతో కొత్తగా వేస్తున్న విజయవాడ– సికింద్రాబాద్ లైన్‌తోపాటు, పాత లైన్ల కింద ఉన్న మట్టి, కంకర రాళ్లతోపాటు, సిమెంట్ దిమ్మెలు కూడా కొట్టుకుపోయాయి. దీంతో ఆరు నుంచి పది అడుగుల మేరకు గొయ్యిపడి పట్టాలు గాలిలో వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. అదేవిధంగా కేసముద్రం విలేజీ పెద్ద చెరువు, దామర చెరువు, ఇంటికన్నె చెరువుల వరదతో ఇంటికన్నె, కేసముద్రం మధ్యలో వరద తీవ్రత పెరిగి ట్రాక్ అడుగు భాగం అంతా కొట్టుకుపోయింది. దీంతో ఇంటికన్నె–కేసముద్రం మధ్య 200 మీటర్ల మేర, తాళ్లపూసపల్లి–మహబూబాబాద్ మధ్యలో ఒక చోట 50 మీటర్లు, మరోచోట 10 మీటర్ల మేరకు పట్టాల కింద మట్టి కొట్టుకుపోయి ట్రాక్ తీవ్రంగా దెబ్బతిన్నది. అదేవిధంగా నెక్కొండ– వరంగల్ మధ్య రెండు మీటర్ల మేర గొయ్యి పడింది.
వేలాది మంది ప్రయాణికులతో ఉక్కిరి బిక్కిరి
ట్రాక్‌లు దెబ్బతిన్న విషయాన్ని ముందుగానే గుర్తించిన అధికారులు కేసముద్రంలో సంఘమిత్ర రెండు రైళ్లు, మహబూబాబాద్‌లో సింహపురి, మచిలీపట్నం, డోర్నకల్‌లో పద్మావతి, అప్, డౌన్ రెండు గౌతమి రైళ్లు నిలిపి వేయడంతో సుమారు పదివేలకు పైగా ప్రయాణికులు ఒక్కసారిగా మూడు స్టేషన్‌లలో దిగారు. రైళ్లు ఎప్పుడు వెళ్తాయో తెలియకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. కొందరు ప్రైవేట్ వాహనాలలో వెళ్లగా, మరికొందరు లాడ్జీలు తీసుకొని ఉన్నారు. ఎటూ వెళ్లలేని వారు స్టేషన్లలోనే ఉండటంతో మహబూబాబాద్, కేసముద్రం, డోర్నకల్ ప్రాంతాల ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు వారికి పండ్లు, బిస్కెట్లు, టిఫిన్, మధ్యాహ్న భోజనం, మంచినీరు, మందులు అందజేశారు.
సార్లకు సమాచారం ఇచ్చాను..
నేను కేసముద్రం– ఇంటికన్నె లైన్‌లోని 550 ఆర్‌ఏ ఎఫ్‌టీ వద్ద ఉన్నా. పైనుంచి వరద పెరిగింది. అప్ప టికే నా వద్దకు వచ్చిన పెట్రోలింగ్ టీమ్‌తో మాట్లాడి విషయం ముందుగా ఎస్‌ఎస్‌ఏ శ్రీనివాస్‌కు, తర్వాత రాజమౌళికి ఇచ్చాం. ట్రైన్ల వేగం తగ్గించారు. తర్వాత కూడా వరద పెరగడంతో కాషన్ ఆర్డన్ ఇవ్వాలని కోరాం. – మోహన్, ట్రాక్‌మన్, ఇంటికన్నె
వారిద్దరి సమాచారంతో రైళ్లు ఆపేశాం
గతంలో జరిగిన వరద అనుభవాల దృష్ట్యా రైల్వే లైన్లకు ఇబ్బందులు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక వాచ్‌మెన్లను పెట్టాం. ట్రాక్‌మన్ సమాచారంతో అప్రమత్తమై రోడ్డు మార్గంలో నేను 575 రైల్వే ఎఫెక్టెడ్ ట్యాంక్ వద్దకు వెళ్లాను. అప్పటికే పరిస్థితి విషమించింది. వరద పెరిగింది. విషయాన్ని పై అధికారులకు చేరవేశా. దీంతో ఎక్కడి రైళ్లు అక్కడ ఆపేశారు. – రాజమౌళి, సీనియర్ రైల్వే సెక్షన్ ఇంజనీర్
ప్రమాద స్థాయి గమనించాను
నేను తాళ్లపూసపల్లి– కేసముద్రం లైన్‌లోని 575 ట్యాంకు వద్ద ఉన్నా. సాయంత్రంనుంచి గంట గంటకూ వరద ఉధృతి పెరుగుతోంది. ప్రమాద స్థాయికి చేరుతుందని గమనించి రాత్రి 12 గంటల సమయంలోనే మా ఎస్‌ఎస్‌ఈ రాజమౌళికి చెప్పా. గస్తీ వాళ్లకు సమాచారం ఇచ్చి ఆయన వచ్చారు. రైళ్లు ఆపేశాం. – జగదీశ్, ట్రాక్‌మన్, తాళ్లపూసపల్లి
Comments
Please login to add a commentAdd a comment