భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రైలు రవాణా స్తంభించింది. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షంతో హైదరాబాద్-గుంటూరు మధ్య నడికుడి మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే విజయవాడలో రూట్ రిలే ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ ఆధునీకరణ పనుల దృష్ట్యా ఒకవైపు రైళ్ల రాకపోకలపై నియంత్రణ కొనసాగుతుండగా.. తాజాగా గుంటూరు-సత్తెనపల్లి మార్గంలో రైల్వేట్రాక్ దెబ్బతినడంతో గురువా రం ఒక్కరోజే 40కి పైగా రైళ్లు రద్దయ్యాయి. ఈ మార్గంలో చాలాప్రాంతాల్లో వరదనీరు పట్టాల మీదుగా ప్రవహిస్తుండటంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. 7 చోట్ల రైలు మార్గాలు దెబ్బతిన్నట్టు గుర్తించి ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపేసింది. సత్తెనపల్లి-రెడ్డిగూడెం, రెడ్డిగూడెం-బెల్లంకొండ, బెల్లంకొండ-పిడుగురాళ్ల, పిడుగురాళ్ల-తుమ్మలచెరువు స్టేషన్ల మధ్య ఏడు చోట్ల ట్రాక్ కింద మట్టికొట్టుకుపోయింది. అప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉన్న రైళ్లను సమీపంలోని స్టేషన్లలో నిలిపేసి ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం లేకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. మిగతా రైళ్లను రద్దు చేసింది. అయితే రైళ్లు రద్దయినట్టు సమాచారం తెలియకపోవడంతో సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లలో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాశారు.