ఉప ప్రణాళికలకు గుడ్‌బై!
► వీటి స్థానంలో కొత్తగా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి
► బడ్జెట్ పద్దుల మార్పు నేపథ్యంలో సర్కారు నిర్ణయం
►ఎస్సీ, ఎస్టీ కమిటీలకు కొత్త పథకాల రూపకల్పన బాధ్యత
సాక్షి, హైదరాబాద్: దళితులు, గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక (సబ్‌ప్లాన్ )లకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలుకుతోంది. తాజాగా 2017–18 రాష్ట్ర బడ్జెట్ పద్దుల మార్పు నేపథ్యంలో సబ్‌ప్లాన్ అమలు సాధ్యం కాదని భావించిన సర్కారు ఈమేరకు నిర్ణయించింది. ఇప్పటివరకు రాష్ట్ర బడ్జెట్‌లో ప్రణాళిక, ప్రణాళికేతర పద్ధతుల్లో పద్దులను ప్రవేశపెట్టేది. ప్రస్తుతం ప్రణాళిక, ప్రణాళికేతర పద్ధతులను రద్దు చేస్తూ వాటి స్థానంలో రెవెన్యూ వ్యయం(రెవెన్యూ ఎక్స్‌పెండీచర్), మూలధన వ్యయం(క్యాపిటల్ ఎక్స్‌పెండీచర్) పద్ధతుల్లో బడ్జెట్‌ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. దీంతో ప్రణాళిక కేటగిరీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక గందరగోళంలో పడింది.
ఈక్రమంలో దళితులు, గిరిజనుల అభివృద్ధికి విఘాతం కలుగుతుందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సబ్‌ప్లాన్ స్థానంలో ప్రత్యేక అభివృద్ధి నిధి పేరిట సరికొత్త కార్యక్రమాలను తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో కొత్తగా ఎస్సీ, ఎస్టీ కమిటీలు ఏర్పాటు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సబ్‌ప్లాన్ లో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను పరిశీలించి వాటిలో కొనసాగించాల్సిన, కొత్తగా చేపట్టాల్సిన వాటిపై పూర్తిస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కమిటీలకు ఆదేశాలు జారీ చేశారు.
రెండు విభాగాలకు ‘ప్రత్యేక అభివృద్ధి నిధి...
ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికల స్థానంలో కొత్తగా ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. సబ్‌ప్లాన్ కు కేటాయించిన నిధులకంటే ఎక్కువ మొత్తంలో ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద కేటాయించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ఎస్సీ కమిటీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అధ్యక్షతన ఏర్పాౖటెన ఎస్టీ కమిటీలు కార్యాచరణకు ఉపక్రమించాయి. సబ్‌ప్లాన్ లో అమలు చేస్తున్న కార్యక్రమాలను సమీక్షిస్తూ వీటిలో కొత్తగా చేపట్టాల్సిన పథకాలపైనా పరిశీలన మొదలుపెట్టాయి.
ఇందులో భాగంగా సోమవారం ఈ రెండు కమిటీలు ప్రత్యేంగా సమావేశమయ్యాయి. సామాజిక భద్రత పథకాలు, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు, విద్య, వైద్యం వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని ప్రణాళికలు తయారు చేయనున్నాయి. వీటిని త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాల నాటికి తుది నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనున్నాయి.
సబ్‌ప్లాన్ –2013 చట్టానికి సవరణలు...
ఇప్పటివరకు అమల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ట్టబద్ధమైనవి. ఈమేరకు 2013లో అప్పటి ప్రభుత్వం ఉభయసభల్లో చర్చించి చట్టబద్ధత కల్పించాయి. కాగా, ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీలు చట్టంలో చేపట్టాల్సిన సవరణలపై సూచనలు చేయాల్సి ఉంటుంది. ఈ కమిటీలు ఇచ్చే నివేదిక ఆధారంగా బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో చర్చించిన తర్వాత ప్రభుత్వం ఉప ప్రణాళిక చట్టానికి సవరణలు చేయనుంది.
ఆ రెండు శాఖలే కీలకం...
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉప ప్రణాళికలకు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు కేంద్రంగా ఉన్నప్పటికీ... కార్యక్రమాలకు కే టాయించే నిధులు పలు శాఖల ద్వారా ఖర్చు చేసేవారు. ఈ క్రమంలో శాఖల మధ్య సమన్వయం కొరవడడంతో లక్ష్యసాధన వెనుకబడుతూ వచ్చింది. ఈ క్రమంలో కొత్తగా అమ లు చేయనున్న ప్రత్యేక అభివృద్ధి నిధితో చేపట్టే కార్యక్రమాలకు ఇకపై ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారానే ఖర్చు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు.