‘సబ్‌ప్లాన్’ మురుగుతోంది! | AP to launch six new schemes for SC/ST | Sakshi
Sakshi News home page

‘సబ్‌ప్లాన్’ మురుగుతోంది!

Published Mon, Dec 29 2014 2:12 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

‘సబ్‌ప్లాన్’ మురుగుతోంది! - Sakshi

‘సబ్‌ప్లాన్’ మురుగుతోంది!

ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం
3 నెలల్లోగా నిధులు వ్యయం చేయకపోతే రూ. 4,421 కోట్లు మురిగినట్లే
కేటాయింపులే అరకొర.. అవీ ఖర్చు చేయరు!
దళిత, గిరిజనుల అభ్యున్నతి లక్ష్యం ఉత్తుత్తి మాటలే
ఉప ప్రణాళిక కేటాయింపుల్లో ఖర్చు నామమాత్రమే
సర్కారు తాజా సమీక్షలో వెల్లడైన చేదు నిజాలు

సాక్షి, హైదరాబాద్: దళితులు, గిరిజనుల జీవనప్రమాణాలు పెంచే ఉద్దేశంతో ప్రత్యేకంగా చట్టం తెచ్చి చేపట్టిన ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలుపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తోంది. వాస్తవ అవసరాలకు తగ్గట్లు కేటాయింపులే చేయకపోగా.. కేటాయించిన నిధులను కూడా ఖర్చుపెట్టకుండా మురగబెడుతున్న తీరు.. ఆ వర్గాలపై సర్కారు ప్రేమ ఏ పాటిదో తేట తెల్లం చేస్తోంది. ఆర్థిక సంవత్సరం ముప్పావు వంతు ముగిసిపోయినప్పటికీ.. ఎస్సీ ఉప ప్రణాళికలో కనీసం 30 శాతం కూడా ఖర్చుచేయలేదు. ఇక ఎస్టీ ఉప ప్రణాళిక విషయంలో వ్యయం మరింత దిగజారిపోయింది. కేటాయించిన అరకొర నిధుల్లో కేవలం 18 శాతం మాత్రమే ఖర్చు చేశారు. ఇక మిగిలివున్న మూడు నెలల కాలంలో మిగతా 70, 80 శాతం నిధుల్లో ఏ మాత్రం ఖర్చు పెడతారో ఊహించుకోవచ్చు.
 
కేటాయింపుల్లోనే తగ్గిపోయిన ఉపప్రణాళికలు...

చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ సమయంలోనే ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలకు వీలైనంత మేర నిధుల కేటాయింపు తగ్గించాలనే ఆలోచనతోనే రాష్ట్ర వార్షిక ప్రణాళికను కేవలం రూ. 26,670 కోట్లకే పరిమితం చేసింది. వార్షిక ప్రణాళిక తగ్గిపోవడంతో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికల వాటా కూడా తగ్గిపోయింది. అయితే.. చేసిన అరకొర కేటాయింపులను ఖర్చు చేయటంలోనూ అలవిమాలిన నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది.

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తున్నా ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలు తీరుపై సమీక్షించడానికి సమయం దొరకలేదు. అధికారులు సమీక్ష కోసం అనేక సార్లు కోరినప్పటికీ ఆఖరికి శనివారం నాడు సమయం ఇచ్చి సమీక్షించారు. ఈ సమీక్షలో వెల్లడైన వాస్తవాలు.. దళిత, గిరిజన, బడుగు వర్గాల సంక్షేమంపై ప్రభుత్వ తీవ్ర అలసత్వాన్ని బట్టబయలు చేస్తోంది. ఆ వర్గాల అభ్యున్నతే తమ లక్ష్యం అంటూ బయట చేసుకుంటున్న ప్రచారానికి, వారికోసం చేపట్టిన ప్రణాళిక అమలుకు మధ్య పొంతనలేని తనం స్పష్టంగా కనిపిస్తోంది.
 
కేటాయించిన నిధులైనా ఖర్చుచేయరు...

ఎస్సీ ఉపప్రణాళిక కోసం బడ్జెట్‌లో 4,574 కోట్ల రూపాయలు కేటాయించగా ఇప్పటివరకు కేవలం 1,340 కోట్ల రూపాయలు మాత్రమే వ్యయం చేశారు. అంటే మొత్తం కేటాయింపుల్లో ఇది కేవలం 29.3 శాతం మాత్రమే. దళితుల కోసం కేటాయించిన నిధుల్లో నూటికి 30 రూపాయలు కూడా ఖర్చు పెట్టని దుస్థితి. ఎస్సీ ఉప ప్రణాళిక కేటాయింపుల్లో రూ. 3,234 కోట్లను మూడు నెలల్లో ఖర్చు చేయాలి. లేదంటే ఆ నిధులన్నీ ఎస్సీ వర్గాల ప్రయోజనం చేకూర్చకుం డానే మురిగిపోతాయి.
ఇదే తరహాలో ఎస్టీ ఉప ప్రణాళిక కోసం బడ్జెట్‌లో రూ. 1,500 కోట్లు కేటాయించారు. కానీ ఇప్పటి వరకు చేసిన వ్యయం కేవలం రూ. 273 కోట్లు మాత్రమే. అంటే ఇది వాస్తవ కేటాయింపుల్లో కేవలం 18.2 శాతం మాత్రమే. గిరిజనుల కోసం కేటాయించిన నిధుల్లో నూటికి 18 రూపాయల 20 పైసలు మాత్రమే ఖర్చు చేశారు. ఎస్టీ ఉప ప్రణాళిక కేటాయింపుల్లో మిగతా రూ. 1,187 కోట్లను వచ్చే మార్చి నెలాఖరులోగా ఖర్చు చేయకపోతే ఆ నిధులన్నీ మురిగిపోనున్నాయి.
ఇక బీసీ సంక్షేమానికి బడ్జెట్‌లో రూ. 1,460 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు కేవలం రూ. 979 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక వ్యయంకన్నా కాస్త మెరుగుగా కనిపిస్తున్నప్పటికీ.. ఇది కూడా మొత్తం నిధుల్లో 67 శాతం మాత్రమే. అంటే నూటికి రూ.67  మాత్రమే ఖర్చు చేశారు. కేటాయింపుల్లో మిగతా రూ. 481 నిధులను వచ్చే ఏడాది మార్చి లోగా వ్యయం చేయకుంటే  మురిగిపోతాయి.
 
ఎస్టీ జనాభా 5.53 శాతం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఖమ్మం జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలైన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడంతో గిరిజనుల జనాభా శాతం స్వల్పంగా పెరగనుంది. ఆ మండలాలు లేకుం డా అయితే ఎస్టీ జనాభా 5.33 శాతం ఉండగా ఆ మండాలను కలిపిన తరువాత ఎస్టీ జనాభా 5.53 శాతానికి పెరిగింది.
 
రూ. 4,421 కోట్లు మురిగిపోవాల్సిందేనా?
మొత్తం మీద.. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అనేది కేటాయింపులకే పరిమితమైంది తప్ప వాస్తవ ఖర్చు మాత్రం అంతంతమాత్రమేనని తేలింది. కేటాయించిన నిధుల్ని ఎంతో ప్రాధాన్యతతో వ్యయం చేయాల్సిన చోట నిర్లక్ష్యం, ఉదాసీనత రాజ్యమేలుతోందని సమీక్షలో వెల్లడయింది. ఇదే సమీక్ష రెండు, మూడు నెలల క్రితమే చేసి ఉంటే వ్యయంలో ఎంతో కొంత కదలిక వచ్చేదని అధికార యంత్రాంగమే వ్యాఖ్యానిస్తోంది. మరో మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. అంటే వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు ఉప ప్రణాళికలకు కేటాయించిన నిధులను ఖర్చు చేయలేకపోతే ఆ నిధులన్నీ మురిగిపోతాయి. అదే జరిగితే ఏకంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చేరాల్సిన 4,421 కోట్ల రూపాయలు మురిగిపోనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement