ఉప ప్రణాళికపై దొంగ దెబ్బ | The thief blow to the sub-plan | Sakshi
Sakshi News home page

ఉప ప్రణాళికపై దొంగ దెబ్బ

Published Mon, Feb 9 2015 4:43 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

The thief blow to the sub-plan

  • అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులకు ఎసరు
  • అసలే ప్రణాళిక వ్యయం తగ్గింపు.. అందులోనూ భారీ కోత
  • ప్రణాళిక వ్యయం రూ.26 వేల కోట్ల నుంచి రూ.18 వేల కోట్లకు
  • ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో రూ.1,944 కోట్లు కోత
  • సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా వ్యయాన్ని భారీగా తగ్గించడంతో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల కేటాయింపుల్లో కోతలు పడ్డాయి. ప్రణాళికా వ్యయంలో ఎస్సీ ఉప ప్రణాళికకు 17.10 శాతం, ఎస్టీ ఉప ప్రణాళికకు 5.33 శాతం కేటాయిస్తారు. బడ్జెట్‌లో ప్రణాళిక వ్యయాన్ని ప్రభుత్వం రూ.26,672 కోట్లకు పరిమితం చేయటంతో మొదట్లోనే ఉప ప్రణాళికల నిధుల కేటాయింపులు తగ్గిపోయాయి.

    ఇప్పుడు ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా ఉప ప్రణాళికను దొంగ దెబ్బతీసింది. శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రణాళికా పద్దు కింద చేసిన కేటాయింపులను ప్రణాళికేతర పద్దు కిందకు మార్చేసింది. ప్రణాళికా వ్యయంలో రైతుల రుణమాఫీకి కేటాయించిన రూ.4000 కోట్లను ప్రణాళికేతర పద్దులోకి మార్చేసింది. పరిశ్రమల రాయితీల నిధులను కూడా ప్రణాళికా పద్దు నుంచి ప్రణాళికేతర పద్దుకు మార్చింది. ఇంకా కొన్ని రంగాల కేటాయింపులను కూడా ప్రణాళిక పద్దు నుంచి ప్రణాళికేతర పద్దుకు మార్చేయడంతో ప్రణాళికా వ్యయం రూ.18,000 కోట్లకే పరిమితం కానుంది.

    అంటే ప్రణాళిక పద్దు కింద కేటాయించిన సుమారు రూ.8,672 కోట్లను ప్రణాళికేతర పద్దు కిందకు ప్రభుత్వం మార్చివేసింది. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలకు కేటాయింపులకు భారీగా కోత పడనుంది. ప్రణాళికా వ్యయం రూ.26,672 కోట్ల నుంచి రూ.18,000 కోట్లకు పరిమితం కానుండటంతో ఆ మొత్తం నుంచే ఉప ప్రణాళికకు నిధులను పరిమితం చేస్తారు. ప్రణాళిక పద్దు వ్యయం కుదించడంతో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు రూ.1,944 కోట్ల నిధుల కోత పడనుంది.
     
    అరకొర కేటాయింపులు.. ఆపై కోతలు

    ఉప ప్రణాళిక అమలు ఇప్పటికే అంతంతమాత్రంగా ఉంది. తొలుత ప్రణాళిక  కేటాయింపుల ఆధారంగా ఎస్సీ ఉప ప్రణాళికకు రూ.4,560 కోట్లను కేటాయించినా డిసెంబర్ నెలాఖరు వరకు చేసిన వ్యయం కేవలం రూ.1,340 కోట్లే. అలాగే ఎస్టీ ఉప ప్రణాళికకు రూ.1,421 కోట్లు కేటాయించినా డిసెంబర్ చివరి వరకు రూ.273 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. ఇప్పుడు ప్రణాళికా వ్యయాన్ని రూ.18,000 కోట్లకు తగ్గించడంతో ఉప ప్రణాళిక కేటాయింపుల్లో భారీగా కోత పడనుంది. ఎస్సీ ఉప ప్రణాళికకు 17.10 శాతం మేర రూ.1,482 కోట్ల నిధులు తగ్గిపోనున్నాయి. ఎస్టీ ఉప ప్రణాళికకు 5.33 శాతం మేర రూ.462 కోట్ల నిధులు తగ్గిపోనున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement