సర్కారు ఇవ్వనంటోంది
కళాశాల పొమ్మంటోంది
ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థుల అవస్థలు
తణుకు కల్చరల్/ఏలూరు సిటీ :
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో సర్కారు నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. తక్షణమే ఫీజులు చెల్లించాలంటూ కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తుండటతో ఏంచేయాలో తెలియక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మానసికంగా నలిగిపోతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై 5 నెలలు గడుస్తున్నా నేటికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. కనీసం ఆన్‌లైన్‌లో పంపించిన దరఖాస్తులను సైతం పరిశీలించిన పాపాన పోలేదు. దరఖాస్తులను స్వీకరించి, కళాశాల స్థాయిలో పరిశీలించి.. ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి.. విద్యార్థుల ఖాతాల్లోకి ఫీజు సొమ్ములు జమ అయ్యేసరికి పుణ్యకాలం గడిచిపోయేలా ఉంది. జిల్లాలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి లక్షకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేయగా, రూ.100 కోట్ల వరకు నిధులు చెల్లించాల్సి ఉంది.
ఆన్‌లైన్ కష్టాలు
ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించడంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ జిల్లాల్లో చదువుకున్న విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాల విషయంలో చుక్కెదురవుతోంది. జిల్లాలో విలీనమైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని విద్యార్థులు సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు పొందే విషయంలో అన్యాయానికి గురవుతున్నారు. స్థానికత అంశంపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోకుండా కాలయాపన చేయటంతో వేలాది విద్యార్థులు నష్టపోతున్నారు. మరోవైపు రేషన్‌కార్డు, ఆధార్ కార్డు సమస్యలు వేధిస్తున్నాయి. దరఖాస్తు చేసిన విద్యార్థుల రేషన్‌కార్డుల్లో సమాచారం అన్‌లైన్‌లో లేకపోవటం, వారి తల్లిదండ్రుల పేర్లు సరిపోలకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. తల్లి లేదా తండ్రి చనిపోయిన విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వీటితోపాటు విద్యార్థుల వేలిముద్రలు సాంకేతిక కారణాలతో మ్యాచ్ కాకపోవటం వంటివి వేధిస్తున్నాయి.
దరఖాస్తు చేసేందుకూ వీల్లేదు
ఎస్సీ విద్యార్థులకు సాంఘిక సంక్షేమ శాఖ ఉపకార వేతనాలు మంజూరు చేస్తోంది. జిల్లాలో కొత్తగా చేరిన ఎస్సీ విద్యార్థులు 12,801 మంది ఉంటే కేవలం 3,987 మంది దరఖాస్తులు మాత్రమే ఆన్‌లైన్ అయ్యాయి. 201617 విద్యా సంవత్సరంలో రెన్యువల్ విద్యార్థులు 15,076 మంది ఉంటే 12,595 మంది దరఖాస్తులు మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదయ్యాయి. మిగిలిన విద్యార్థులంతా రేషన్‌కార్డు, ఆధార్ తదితర సమస్యల కారణంగా దరఖాస్తు చేసేందుకు కష్టాలు పడుతున్నారు.
ఈబీసీ విద్యార్థులకూ అన్యాయం
మరోవైపు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈబీసీ) విద్యార్థులకూ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. 201516 విద్యాసంవత్సరానికి సంబంధించి 24,538 మంది ఈబీసీ విద్యార్థులు ఉండగా, 16,863 మందికి కొంతమేర చెల్లించారు. వీరిలోనూ 4వేల మందికి గత ఏడాది బకాయిలు చెల్లిస్తే, మిగిలిన వారికి మూడోవంతు మాత్రమే ఫీజులు మంజూరు చేశారు. ఈ ఏడాది 14,598 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు.
బీసీ సంక్షేమ శాఖ పరిధిలో..
బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 201516 విద్యా సంవత్సరానికి సంబంధించి 51,327 మంది ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది కొత్త విద్యార్థుల్లో కేవలం 7,956 మంది మాత్రమే దరఖాస్తు చేయటం గమనార్హం. బీసీ విద్యార్థులకు ఏడాదికి రూ.48 కోట్ల వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ రూపంలో మంజూరు చేయాల్సి ఉండగా, ఆ మొత్తాలు అందక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
ముఖ్యమంత్రిని పదిసార్లు కలిసినా..
మా కుమార్తె రవళికి ఫీజు రీయంబర్స్‌మెంట్ అందని విషయాన్ని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దృష్టికి తీసుకెళ్లాను. ఆయన సూచన మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పదిసార్లు కలిశాం. విజయవాడ, వెలగపూడి వెళ్లి సీఎంను క్యాంప్‌కార్యాలయాలల్లో కలసి వినతిపత్రాలు ఇచ్చాం. ఇప్పటికీ సానుకూల ఉత్తర్వులు రాలేదు. ఫీజులు కడితేనే మా అమ్మాయిని నవంబర్ 8నుంచి జరిగే పరీక్షకు రమ్మంటున్నారు. మా కుటుంబానికి జీవనాధారమైన రోల్డ్‌గోల్డ్ దుకాణాన్ని అమ్మకానికి పెట్టినా ప్రయోజనం లేకపోయింది. బిడ్డ భవిష్యత్ ఏమవుతుందోనని ఆందోళనగా వుంది.
ఆకుల రాజేశ్వరి, రవళి తల్లి, తణుకు
పేద విద్యార్థులను ఆదుకోవాలి
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నమ్ముకుని ఉన్నత విద్యాసంస్థల్లో చేరిన వేలాది మంది విద్యార్థులు ఆ సొమ్ము అందక అవస్థలు పడుతున్నారు. భవిష్యత్‌పై బెంగపడుతున్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పేద విద్యార్థులందరికీ అమలు చేయాలి. అందుకు బడ్జెట్‌లో తగిన నిధులను కేటాయించాలి.
అంబటి వీరరాఘవులు, వైఎస్ సేవాదళ్ నాయకుడు, తణుకు