♦ టెన్త్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వర్తించని మినహాయింపు
♦ అడ్డగోలు నిబంధన.. గత్యంతరం లేక చెల్లిస్తున్న విద్యార్థులు
♦ రూ. 20 వేల వార్షికాదాయం ఎవరికైనా ఉందా?
♦ 4 లక్షల మంది విద్యార్థులకు అంద ని ప్రయోజనం
సాక్షి, హైదరాబాద్: టెన్త్ పరీక్షల ఫీజు మినహాయింపు అందని ద్రాక్షగా మారుతోంది. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వాలు ఏటా పేరుకే ఫీజు మినహాయింపును ప్రకటిస్తున్నాయి. అమలు చేయలేని నిబంధన విధిస్తూ విద్యార్థులెవరికీ మినహాయింపు వర్తించకుండా చేస్తున్నాయి. టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఫీజు మినహాయింపు వర్తిస్తుందని ఏటా ప్రకటించడం, అడ్డగోలు నిబంధన విధించి అమలుకు నోచుకోకుండా చేయడం రివాజుగా మారింది. దీంతో దాదాపు 4 లక్షల మంది నిరుపేదలకు ప్రయోజనం చేకూరడం లేదు.
రాష్ట్రంలో ఏ పథకాన్నైనా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి ప్రభుత్వం వర్తింపజేస్తోంది. ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో గరిష్టంగా రూ.లక్ష, పట్టణాల్లో రూ.లక్షన్నర వార్షికాదాయం ఉన్న వారు అర్హులని చెబుతోంది. కానీ టెన్త్ పరీక్ష ఫీజు మినహాయింపు పొందాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 20 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 24 వేలకు మించకూడదని చెబుతోంది. అనేక సంవత్సరాలుగా ఇదే తంతు కొనసాగుతోంది. ఈసారీ అదే జరిగింది.
2016 మార్చిలో జరిగే పరీక్షలకు హాజరయ్యే వారు ఈనెల 26 నుంచి ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. ఇందులోనూ అదే నిబంధనను విధించి అమలుచేయాలని ఆదేశించింది. దీంతో పరీక్షలకు హాజరుకానున్న 6 లక్షల మంది విద్యార్థుల్లో దాదాపు 4 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఈ మినహాయింపు వర్తించే అవకాశం లేకుండాపోయింది. అయితే రాష్ట్రంలో రూ. 24 వేలలోపు మాత్రమే వార్షికాదాయం కలిగిన కుటుం బాలు ఉన్నాయా? గ్రామాల్లో రోజువారీ కూలీ పని చేసే వారి వార్షికాదాయం కూడా (రోజుకు సగటున రూ. 100 చొప్పున లెక్కిం చినా) అధమంగా రూ. 30 వేల పైనే ఉంటోంది.
అలాంటప్పుడు రూ. 20 వేలు, 24 వేల వార్షికాదాయం నిబంధన విధించడం ఎంత మేరకు సబబు. అశాస్త్రీయమైన ఈ నిబంధనను మార్చకుండా ఎందుకు కొనసాగిస్తున్నారో అంతుచిక్కని ప్రశ్నగానే మిగులుతోంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోనైనా ఈ నిబంధనను మార్చి రూ.లక్షలోపు వార్షికాదాయం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పరీక్ష ఫీజు మినహాయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
పేరుకే పరీక్ష ఫీజు మినహాయింపు
Published Tue, Oct 20 2015 3:37 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM
Advertisement
Advertisement