స్టడీ సర్కిళ్లకు కొత్త రూపు
♦ రాష్ట్ర సర్కారు నిర్ణయం
♦ నిరుద్యోగ అభ్యర్థులకు నిపుణులతో పక్కాగా శిక్షణ
♦ వీడియో బోధన, డిజిటల్ క్లాసులతో ఆధునిక హంగులు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం వివిధ సంక్షేమ శాఖల పరిధిలో నడుస్తున్న స్టడీసర్కిళ్లకు కొత్తరూపునివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏదో మొక్కుబడిగా ఆయా పోటీపరీక్షలకు శిక్షణనిచ్చేలా కాకుండా వాటి ద్వారా అణగారిన వర్గాలకు కచ్చితమైన ప్రయోజనం కలిగేలా ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ స్టడీసర్కిళ్ల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి, ఆయా రంగాల్లో నైపుణ్యాల మెరుగుదలకు చర్యలు చేపట్టనుంది. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టడీసర్కిళ్ల ద్వారా ఆయా పోటీపరీక్షలకు శిక్షణను అందిస్తున్నా ఆశించిన మేర ఫలితాలు రావడం లేదు.
ఈ స్టడీసర్కిళ్ల ద్వారా యూపీఎస్సీ (సివిల్స్ ప్రిలిమ్స్) మొదలుకుని పలు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు శిక్షణనిస్తున్నారు. అయితే పలు అంశాల్లో అధ్యాపకుల కొరత, అభ్యర్థులకు కంప్యూటర్లు, ఇంటర్నెట్ తదితర ఆధునిక సౌకర్యాలు, రిఫరెన్స్ బుక్స్ వంటివి స్టడీసర్కిళ్లలో అందుబాటులో లేకపోవడం పెద్ద లోటుగా మారింది. ఈ నేపథ్యంలో సివిల్స్‌తో పాటు ఉన్నతస్థాయి ఉద్యోగాలకు శిక్షణనిస్తున్న ప్రైవేట్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు అందిస్తున్న స్థాయిలో అధునాతన సదుపాయాలను కల్పించాలని నిర్ణయించింది. ప్రైవేట్ సంస్థల కంటే ఒక అడుగు ముందుకేసి వీడియోకాన్ఫరెన్స్ పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా ఒకేవిధమైన శిక్షణను అందించాలని యోచిస్తోంది.
ఇకపై బ్యాచ్‌ల వారీగా తరగతులు
నిరుద్యోగ అభ్యర్థులు సివిల్స్‌లో ర్యాంకులు సాధించి సత్తా చాటేలా చేయాలని బీసీ సంక్షేమశాఖ కార్యాచరణను రూపొందిస్తోంది. ఉదయం, సాయంత్రం పలు బ్యాచ్‌లుగా తరగతులను నిర్వహించనుంది. విద్యార్థుల సంఖ్యనూ 500కు పెంచాలని యోచిస్తోంది. ఐటీ, వెబ్‌డిజైన్, కాడ్ వంటివాటిలో శిక్షణనివ్వనుంది.
ఎస్టీ స్టడీసర్కిళ్లలో డిజిటల్ తరగతులు
డిజిటల్ క్లాస్‌రూమ్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఎస్టీ సంక్షేమశాఖ ప్రణాళికలు రూపొందించింది. ఎస్టీ స్టడీసర్కిళ్లకు విడిగా గవర్నింగ్‌బాడీని ఏర్పాటుచేసి, రిటైర్డ్ ఐఏఎస్, ప్రస్తుత సివిల్ సర్వీసెస్ అధికారులతో శిక్షణను అందించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 5 జిల్లాల్లో ఎస్సీ స్టడీసర్కిళ్లు ఉండగా, ఈ ఏడాది మరో 5 జిల్లాల్లో వాటిని ప్రారంభించనున్నారు.