► బీసీ అధికారుల నిర్లక్ష్య ఫలితం
► రూ.172 కోట్లు విడుదల
► సుమారు రూ.90 కోట్లే ఖర్చు
► సాంకేతిక సమస్యతో నిలిచిన ప్రక్రియ
► విద్యార్థులకు ఇక్కట్లు
కరీంనగర్ సిటీ: బీసీ సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యం జిల్లాలో విద్యార్థులకు శాపంలా పరిణమించింది. ఏళ్ల తరబడి రోడ్లెక్కి ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం విడుదల చేసిన స్కాలర్‌షిప్, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ నిధులను అధికారులు సకాలంలో ఖర్చుచేయకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికొస్తోంది. స్కాలర్‌షిప్, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ కింద జిల్లా బీసీ సంక్షేమ శాఖకు రూ.172 కోట్లను ప్రభుత్వం గత మే 8న విడుదల చేసింది. ఇందులో 2014-15 ఫ్రెష్, 2015-16 సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థుల రెన్యువల్, ఫ్రెష్ ఫీజులున్నాయి. బకాయిలు విడుదల చేయాలనే ఒత్తిడితో ఎట్టకేలకు కేసీఆర్ ప్రభుత్వం మొత్తం ఏకకాలంలో విడుదల చేసింది.
దీంతో విద్యార్థులు, కళాశాలలు ఊపిరి పీల్చుకున్నాయి. కాని ప్రభుత్వం విడుదల చేసిన నిధులను విద్యార్థుల, కళాశాలల ఖాతాలకు మళ్లించాల్సిన సంక్షేమశాఖ అధికారులు విపరీత జాప్యంచేశారు. దాదాపు నెలరోజుల సమయంలో సుమారు రూ.90 కోట్లు మాత్రమే ఖాతాల్లో వే సినట్లు సమాచారం. ఇందుకు సంబంధిత బిల్లులు చేసే అధికారులకు అవగాహన లేకపోవడం కొంత కాగా, కావాలని జాప్యం చేస్తున్నారనే అనుమానాలూ ఉన్నాయి. ఇదే సమయంలో ట్రెజరీ నుంచి బ్యాంక్‌లకు వెళ్లాల్సిన ఆన్‌లైన్ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే ఇది నిజంగా సాంకేతిక సమస్య కాదని, ప్రభుత్వం విధించిన అనధికార ఫ్రీజింగ్‌లో భాగమేననే పలు సంఘాలు పేర్కొంటున్నాయి. ఏదేమైనా సమస్యను రెండు రోజుల్లో సరిచేస్తామని అధికారులు చెబుతున్నా బిల్లులకు సంబంధించి బీసీ సంక్షేమ శాఖ అధికారులు చేస్తున్న జాప్యంతో మరెన్ని సమస్యలు వస్తాయో అనే ఆందోళనను విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం నిధులు విడుదల చేసినా, సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులు, కళాశాలలు ఫీజుల కోసం మళ్లీ ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే, కళాశాలలతో ‘ఒప్పందాలు’ పూర్తి కాకపోవడంతో కావాలనే బిల్లుల్లో జాప్యం చేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఏదేమైనా మొత్తం ఫీజు బకాయిలు వచ్చినందున జాప్యం చేయకుండా సకాలంలో చెల్లించాలని విద్యార్థులు కోరుతున్నారు. ‘బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన స్కాలర్‌షిప్, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ నిధులు ఖాతాల్లో వేసే ప్రక్రియ సర్వర్ సమస్యతో తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇప్పటికే మాకు వచ్చిన బిల్లులు దాదాపుగా ఖాతాల్లో వేశాం. ఒకట్రెండు రోజుల్లో సాంకేతిక సమస్యను సరిచేసి,ప్రక్రియను ప్రారంభిస్తాం’ అని డీటీవో శ్రీనివాస్ తెలిపారు.
ఫీజులు పెండింగ్
Published Fri, Jun 10 2016 1:47 AM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM
Advertisement