11 నుంచి దశలవారీగా కొత్త గురుకులాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 103 ఎస్సీ గురుకుల పాఠశాలలు ఈ నెల 11 నుంచి దశలవారీగా ప్రారంభం కానున్నాయి. ఆ తరువాత పది పదిహేను రోజుల్లో అన్నింటినీ ప్రారంభించాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాలకు చెందిన మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు వారికి అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి ఈ పాఠశాలలను ఆరంభిస్తారు. వీటిల్లో తొలుత ఐదు, అనంతరం ఆరో తరగతి విద్యాబోధనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 8 వేల మందికి 5వ తరగతిలో ప్రవేశానికి సీట్లు కేటాయించారు. తరగతులను ప్రస్తుతం తాత్కాలిక భవనాల్లో నిర్వహించి, రెండు మూడు నెలల వ్యవధిలో కొత్త భవనాల్లోకి వాటిని తరలించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అలాగే షెడ్యూల్డ్ కులాల కోసం ఏర్పాటు చేయనున్న 30 మహిళా డిగ్రీ కాలేజీలను ఈ నెలాఖరులోగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
పదిలోగా పార్ట్‌టైమ్ నియామకాలు...
కొత్త గురుకులాలకు అవసరమైన శాశ్వత అధ్యాపకులు, సిబ్బందిని టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. అయితే నోటిఫికేషన్ ఇచ్చి ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక పూర్తిచేసేందుకు కనీసం ఆరు మాసాల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో అప్పటివరకు ఈ స్కూళ్లలో విద్యా బోధనకు పార్ట్‌టైమ్, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పోస్టులు భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాత పరీక్ష కూడా నిర్వహించారు. ఈ నెల 10 లోగా సదరు స్కూళ్లలో పార్ట్‌టైమ్, ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయుల నియామకాన్ని పూర్తిచేయనున్నట్లు ఎస్సీ గురుకులాల సొసైటీ వర్గాల సమాచారం. ఇక డిగ్రీ కాలేజీల్లో ఈ నెల 20 కల్లా పార్ట్‌టైమ్, ఔట్‌సోర్సింగ్ లెక్చరర్ల భర్తీ పూర్తి చేస్తారు. ఒక్కో డిగ్రీ కాలేజీకి 20-25 మంది లెక్చరర్లు అవసరమని అంచనా.
ఒక్కొక్కటిగా...
మరోవైపు 71 మైనారిటీ గురుకుల పాఠశాలలు ఇప్పటికే ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. 50 ఎస్టీ గురుకుల పాఠశాలలకు సంబంధించిన పోస్టులు, బడ్జెట్ కేటాయింపుపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి. ఈ విద్యాసంవత్సరం నుంచే 50 బీసీ గురుకులాల ప్రారంభంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ పాఠశాలలను ఎక్కడెక్కడ నెలకొల్పాలి, అవసరమైన టీచర్లు, సిబ్బంది వంటి అంశాలపై బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలను తయారు చేస్తోంది. వీటిపై ప్రభుత్వ ఆమోదముద్రపడగానే పోస్టుల భర్తీ, పాఠశాలల ఏర్పాటుకు చర్యలు చేపడతారు.