⇒ బీసీ–ఈ కులాల సామాజిక స్థితులపై అధ్యయనం
⇒ 10 నుంచి 14 వరకు పర్యటనలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: బీసీ కమిషన్ తొలిసారిగా క్షేత్రస్థాయిలో పర్యటించి బీసీ కులాల తీరును అధ్యయనం చేయనుంది. ఇందులో భాగంగా తొలుత ‘బీసీ–ఈ’కులాల ఆర్థిక, సామాజిక స్థితిగతులను పరిశీలించనుంది. ఈ మేరకు పర్యటన షెడ్యూల్‌ను బీసీ సంక్షేమ శాఖ కమిషనర్, కమిషన్ సభ్య కార్యదర్శి జీడీ అరుణ జిల్లా కలెక్టర్లకు పంపారు. కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, ఈడిగ ఆంజనేయగౌడ్, జూలూరు గౌరీశంకర్‌లు రోజుకు రెండు జిల్లాల చొప్పున ఈనెల 10 నుంచి 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారు.
సర్వే నమూనాలు సిద్ధం..
బీసీ–ఈ కులాల తీరుపై అధ్యయనానికి ప్రత్యేక నమూనా పట్టిక (ప్రొఫార్మా)ను కమిషన్ రూపొందించింది. బీసీ–ఈలు అత్యధికంగా ఉన్న ప్రాంతాలు, గ్రామాల వివరాలను ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు తెలియజేయాలని కలెక్టర్లను కమిషన్ ఆదేశించింది. హిందీ, ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ బాషల్లో రూపొందించిన ఈ ప్రొఫార్మాను ప్రతి జిల్లాకు పంపింది. ఇందులో సామాజిక పరిస్థితులు, విద్య సౌకర్యాలు, ఉపాధి అవకాశాలు, జీవన స్థితిగతులు తెలుసుకునేలా ప్రశ్నావళి ఉంది. అలాగే ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారనేది కూడా ఉంది. ప్రతి జిల్లాకు కనీసం 500 సర్వే పత్రాలు పూర్తిచేసి ఈ నెల 15 నాటికి బీసీ కమిషన్ కార్యాలయానికి పంపించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. ఈ సర్వే పత్రాలను క్రోఢీకరించి వారి అవసరాలను ప్రభుత్వానికి కమిషన్ నివేదించనుంది.
జిల్లాల పర్యటనకు బీసీ కమిషన్
Published Wed, Mar 8 2017 3:42 AM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM
Advertisement
Advertisement