
సీఎంను సన్మానిస్తున్న మంత్రి శంకరనారాయణ, ఎమ్మెల్యే జోగి రమేష్ తదితరులు
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడాలేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు, వీటిలో 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటుగా బీసీ వర్గాల అభ్యున్నతికి శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రత్యేక బిల్లులు తెచ్చిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులు మంగళవారం అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదని, ఇది ఏపీ రాజకీయాల్లో ఓ సువర్ణాధ్యాయం అని వారు కొనియాడారు.
బిల్లులు అసెంబ్లీలో ఆమోదించిన ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగినదన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న ఈ తరుణంలో సమాజంలోని అట్టడుగున ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి శ్రమిస్తున్న యువ నాయకుడు జగన్ అంటూ వారు అభినందనలతో ముంచెత్తారు. ముఖ్యమంత్రిని శాలువాలు, కిరీటంతో వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ, ఎమ్మెల్యేలు జోగి రమేశ్, కారుమూరి నాగేశ్వరరావు, విడదల రజని, ధనలక్ష్మి, అనంతపురం బీసీ నేత మీసాల రంగన్న ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment