సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిజమైన సామాజిక విప్లవానికి నాంది పలుకుతూ రాష్ట్ర శాసనసభ నూతన అధ్యాయాన్ని లిఖించింది. బడుగు, బలహీన వర్గాలు, మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి మార్గం సుగమం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక బిల్లులను మంగళవారం ఆమోదించింది. సామాజిక న్యాయ స్ఫూర్తిని ప్రతిఫలింపజేస్తూ రాజ్యాంగ లక్ష్యాల సాధన దిశగా గొప్ప ముందడుగు వేసింది. రాష్ట్రంలో శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేసే బిల్లుతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అన్ని నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు, నామినేషన్లపై ఇచ్చే అన్ని పనులు, సర్వీస్ కాంట్రాక్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు, మహిళలకు నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు, నామినేషన్లపై ఇచ్చే పనులు, సర్వీస్ కాంట్రాక్టుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లులను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లుల లక్ష్యాలు, ఉద్దేశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ మంగళవారం శాసనసభకు వివరించారు. అనంతరం ఈ బిల్లులపై మంత్రులు, సభ్యులు కూలంకుషంగా చర్చించారు. ఈ బిల్లులతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, మహిళల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ ప్రశంసించారు. రాష్ట్రంలో నూతన సామాజిక విప్లవానికి తెరతీస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని సభ్యులు కొనియాడారు. అనంతరం సభ ఈ బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఇది సుదినం..
కొత్త చరిత్రకు తెరతీస్తూ కీలకమైన బిల్లులను ఆమోదించడం ద్వారా శాసనసభ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకువచ్చింది. ఎన్నో ఏళ్ల వివక్షకు ముగింపు పలుకుతూ ఆ వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయంగా న్యాయమైన అవకాశాలను కల్పించేందుకు రాచబాట పరిచింది. బడుగు, బలహీన వర్గాల కష్టాలను పాదయాత్రలో చూసి చలించిన ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఆ వర్గాల సర్వతోముఖాభివృద్ధికి విప్లవాత్మకమైన ముందడుగు వేశారు. బీసీల హక్కుల పరిరక్షణకు చట్టబద్ధత కల్పిస్తూ శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు బిల్లును శాసనసభ ఆమోదించింది. దాంతో బీసీలు తమ హక్కులకు భంగం వాటిల్లినా, వివక్షకు గురైనా ఆశ్రయించడానికి వారికి ఓ చట్టబద్ధ వేదిక లభించింది. బీసీ జాబితాలో కొత్త కులాల చేర్పు, తొలగింపులను పరిశీలించేందుకు ఓ వ్యవస్థ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. న్యాయాధికారాలు కలిగి ఉండే బీసీ కమిషన్ ఆ వర్గాల హక్కుల పరిరక్షణకు పెద్ద దిక్కుగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజకీయ, ఆర్థిక అభ్యున్నతికి చట్టబద్దత కల్పించింది. అన్ని నామినేటెడ్ పదవుల్లోనూ 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును శాసనసభ ఆమోదించింది. దాంతో కార్పొరేషన్ చైర్మన్లు, మార్కెట్ కమిటీలు, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో సగం బడుగు, బలహీన వర్గాలకు దక్కనున్నాయి. అదే విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు నామినేషన్లపై ఇచ్చే అన్ని పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును కూడా శాసనసభ ఆమోదించింది. దాంతో ఆ వర్గాలు ఆర్థికంగా స్వావలంబన సాధనకు మార్గం సుగమమైంది. ఆకాశంలో సగం.. అవనిలో సగం ఉన్న మహిళలకు అవకాశాల్లోనూ సగం కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయానికి ఆమోద ముద్ర వేసింది. అన్ని నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ బిల్లును శాసనసభ ఆమోదించింది. దాంతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నామినేటెడ్ పదవుల్లో మహిళలకు సగభాగం హక్కు దక్కింది. నామినేషన్లపై ఇచ్చే అన్ని పనుల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆమోదించింది. ఈ నేపథ్యంలో బడుగు, బలహీన వర్గాలు, మహిళల అభ్యున్నతికి దోహదం చేసేకీలక బిల్లులపై చర్చను ప్రతిపక్ష పార్టీ టీడీపీ బహిష్కరించడం విస్మయపరిచింది.
ఆద్యంతం అడ్డుకునేందుకే యత్నం
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలతో పాటు మహిళలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ అధికారం కల్పించే కీలక బిల్లులపై అసెంబ్లీలో చర్చను అడ్డుకోడానికి ప్రతిపక్ష టీడీపీ శతథా యత్నించింది. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు బిల్లు ఉద్దేశాలను మంత్రి శంకర నారాయణ అసెంబ్లీలో వివరిస్తుండగా టీడీపీ సభ్యులు తీవ్ర స్థాయిలో అంతరాయం సృష్టించారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. కొందరు ఏకంగా స్పీకర్ పోడియం మీదకు చేరి నినాదాలు చేశారు. బడుగు, బలహీన వర్గాలు, మహిళల సంక్షేమం, సాధికారికత కోసం కీలక బిల్లులపై చర్చకు సహకరించాలని ప్రభుత్వం తరఫున మంత్రి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ టీడీపీ సభ్యులు ఏమాత్రం వినిపించుకోలేదు. మంత్రి శంకర నారాయణ ప్రసంగిస్తున్నంతసేపు నినాదాలు చేస్తునే ఉన్నారు. టీడీపీ సభ్యుల అరుపులు, కేకల మధ్యే డిప్యూటీ స్పీకర్ కొన రఘుపతి బిల్లులపై చర్చను కొనసాగించాల్సి వచ్చింది. తమ స్థానాల్లో కూర్చొని చర్చకు సహకరించాల్సిందిగా డిప్యూటీ స్పీకర్ చేసిన విజ్ఞప్తిని కూడా టీడీపీ ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. బిల్లుపై చర్చలో పాల్గొంటూ ఎమ్మెల్యేలు వేణుగోపాల్, కరణం ధర్మశ్రీ మాట్లాడుతున్నంతసేపూ టీడీపీ సభ్యులు వారి ప్రసంగానికి అడ్డుతగిలేందుకు ప్రయత్నిస్తునే ఉన్నారు. అయినప్పటికీ డిప్యూటీ స్పీకర్ నిబద్ధతతో చర్చను కొనసాగించారు. చివరికి ఎమ్మెల్యే పార్థసారథి ప్రసంగిస్తుండగా చంద్రబాబు, టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. బడుగు, బలహీన వర్గాలు, మహిళలకు అన్ని విధాలా మేలు చేకూర్చే విషయంలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.
అంబేడ్కర్ స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న సీఎం
చట్టసభల్లో బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ అంబేడ్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 366ను పొందుపరిచారు. ఆయన స్ఫూర్తితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నామినేటెడ్ పదవులు, నామినేషన్లపై ఇచ్చే పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు.
– పీడిక రాజన్న దొర, ఎమ్మెల్యే, సాలూరు
బీసీల సాధికారికతను అడ్డుకునేందుకు టీడీపీ కుట్ర
బీసీలకు సాధికారికత చేకూర్చే చరిత్రాత్మక బిల్లులను అడ్డుకోవడానికి చంద్రబాబు, ఆయన బృందం సభకు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నిస్తోండటం సబబు కాదు. వైఎస్ జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న అక్కసుతో సభా వ్యవహారాలను అడ్డుకుంటున్నారు. బీసీలకు శాశ్వత కమిషన్ ఏర్పాటైతే తమ సమస్యలను నోరు విప్పి చెప్పుకోలేని స్థితిలో ఉన్న బీసీల విషయాలను సుమోటో కేసులుగా స్వీకరించే వెసులుబాటు లభిస్తుంది.
– చెల్లుబోయిన వేణుగోపాల్, ఎమ్మెల్యే, రామచంద్రాపురం
ఇలాంటి సీఎం కావాలని అందరూ కోరుకుంటున్నారు
గత ప్రభుత్వం మైనార్టీలను ఓటు బ్యాంకుగానే చూసింది. కానీ మైనార్టీల సంక్షేమానికి చిత్తశుద్ధితో పని చేయడం ఎలాగో సీఎం వైఎస్ జగన్ చేసి చూపించారు. వారి పురోభివృద్ధికి ఏకంగా చట్టం తీసుకువస్తున్నారు. అలాంటి సీఎం కావాలని అన్ని రాష్ట్రాల ప్రజలూ కోరుకుంటున్నారు.
– ముస్తఫా, ఎమ్మెల్యే, గుంటూరు ఈస్ట్
టీడీపీ ఓర్వలేకపోతోంది..
దేశ చరిత్రలోనే తొలిసారిగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, నామినేషన్లపై ఇచ్చే పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. దీన్ని చూసి ప్రతిపక్ష టీడీపీ ఓర్వలేకపోతోంది. ఇంతటి చరిత్రాత్మక సమయంలో సభలో ఉండకుండా వెళ్లిపోవడం చంద్రబాబు అహంకారానికి నిదర్శనం. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే ఆయన తన పాలనలో బీసీలను అన్ని విధాలుగా మోసం చేశారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ బీసీలకు న్యాయం చేస్తుంటే కూడా చూడలేకపోతుండటం టీడీపీ నైజాన్ని బయటపెడుతోంది.
– అనిల్ కుమార్ యాదవ్, నీటి పారుదల శాఖ మంత్రి
ఈ ఘనత సీఎం జగన్‌దే
ఆకాశంలో సగం.. అవనిలో సగం.. అని మహిళల గురించి అందరూ అంటుంటారు. మహిళలకు నిజంగా అవకాశల్లో సగం ఇచ్చి సీఎం వైఎస్ జగన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రిగా గిరిజన మహిళ, హోం మంత్రిగా ఎస్సీ మహిళకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అన్ని నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేషన్లపై ఇచ్చే అన్ని పనుల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. టీడీపీ ప్రభుత్వంలో మహిళలు అవమానాలకు గురయ్యారు. కానీ రాష్ట్రంలో మహిళలను చెల్లిగా, తల్లిగా గౌరవించే మహోన్నత స్వభావం ఉన్న వైఎస్ జగన్ సీఎం కావడం మన అదృష్టం.
– ఆర్కే రోజా, ఎమ్మెల్యే, నగరి
ఇది పండుగ దినం
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇది నిజమైన పండుగ రోజు. రాజకీయ అధికారం, ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అణగారిన వర్గాలకు సామాజిక గౌరవం కల్పించారు.
– కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే, రైల్వేకోడూరు
బీసీల గుండెల్లో సీఎం జగన్ నిలిచిపోతారు
బీసీలు అంటే బ్యాక్ వర్డ్ కాదు బ్యాక్ బోన్ కులాలు అని చాటి చెప్పేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తుంటే చంద్రబాబు సహకరించకపోగా ఆటంకాలు సృష్టిస్తున్నారు. శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి. బీసీ హృదయాలలో జగన్ చిరస్మరణీయునిగా ఉంటారు.
– కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యే, చోడవరం
బీసీల హక్కుల పరిరక్షణకు నాంది
చంద్రబాబు బీసీలకు తీవ్ర ద్రోహం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 550తో రాష్ట్రంలో దాదాపు 500 మంది బీసీ విద్యార్థులు మెడికల్ సీట్లు కోల్పోయారు. చంద్రబాబు పాలనలో రాజధానితో సహా రాష్ట్రమంతటా కుల, మతాల తారతమ్యాలు, కుల వివక్ష విపరీతంగా పెరిగిపోయింది. ఇలాంటి సామాజిక రుగ్మతలను రూపు మాపడానికి సీఎం వైఎస్ జగన్ శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ నియమించాలని నిర్ణయించారు. ఈ కమిషన్‌తో బీసీల హక్కుల పరిరక్షణ సాధ్యపడుతుంది.
– కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే, పెనమలూరు
మరో అంబేడ్కర్, అల్లూరి
అన్ని స్థాయిల్లోని పదవుల్లో బడుగు, బలహీన వర్గాలకు అంబేడ్కర్ చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించారు. ప్రస్తుతం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో అడుగు ముందుకు వేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్లపై పనుల్లోనూ 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఇంతే కాకుండా ఏజెన్సీలో బాక్సైట్ మైనింగ్ చేయబోమని ప్రకటించడం గిరిజనుల్లో సంతోషం కలిగించింది. అందుకే గిరిజనులు వైఎస్ జగన్‌ను మరో అంబేడ్కర్‌గా, మరో అల్లూరిగా కీర్తిస్తున్నారు.
– భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే, పాడేరు
మహిళా సాధికారికత సాకారం
పార్లమెంటులో మహిళా బిల్లు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉంది. కానీ సీఎం వైఎస్ జగన్ తాను అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే అన్ని నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. తద్వారా మహిళా సాధికారికత కలను సాకారం చేశారు.
– జొన్నలగడ్డ పద్మావతి, ఎమ్మెల్యే, శింగనమల
దేశ చరిత్రలో ఇదే తొలిసారి
అసమానతలకు గురవుతున్న అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్లపై ఇచ్చే పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. వైఎస్ జగన్ నామినేషన్లపై ఇచ్చే పనుల్లో బడుగు, బలహీన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా నిజమైన సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు.
– మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే, వేమూరు
సామాజిక న్యాయానికి శ్రీకారం
బడుగు, బలహీన వర్గాలు, మహిళల అభ్యున్నతి, నిజమైన సామాజిక న్యాయం, సమాన హక్కుల కల్పన పట్ల సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధి, నిబద్ధత దేశానికి ఆదర్శప్రాయం. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటుతో బలహీన వర్గాల హక్కులకు చట్టబద్ధమైన రక్షణ లభిస్తుంది. పాత కమిషన్ బిల్లులున్నా అవి సరిగా పని చేయకపోవడంతో నూతన బిల్లును తీసుకువచ్చాం. ఈ కొత్త శాసనం బీసీలలో విశ్వాసం కలిగిస్తుందని విశ్వసిస్తున్నాం. అన్ని స్థాయిల్లోనూ రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించడం ద్వారానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సామాజిక గౌరవం దక్కుతుందనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విధానం. అందుకే ఆ వర్గాలకు అన్ని నామినేటెడ్ పదవుల్లో, అన్ని నామినేటెడ్ పనులు, సర్వీస్ కాంట్రాక్టుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లులను ప్రవేశపెట్టి ఆ వర్గాల ఆర్థిక స్వావలంబన సాధనకు ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇక పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు పురోగతి సాధించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విప్లవాత్మకమైన విధాన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మహిళలకు నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా మహిళా సాధికారికత సాధనకు మార్గం సుగమమవుతుంది.
– ఎం.శంకర నారాయణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి
మహిళల అభ్యున్నతికి విప్లవాత్మక నిర్ణయం
టీడీపీ ప్రభుత్వంలో మహిళలు పూర్తిగా మోసానికి గురయ్యారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామన్న హామీని చంద్రబాబు నెరవేర్చలేదు. సున్నా వడ్డీకి రుణాలను ఇవ్వలేదు. బెల్టు షాపులు రద్దు చేస్తామని చెప్పిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి దిగేనాటికి రాష్ట్రంలో వాటి సంఖ్యను 40 వేలకు పెంచారు. తహశీల్దార్ వనజాక్షి మీద దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యేను అప్పటి సీఎం చంద్రబాబు వెనకేసుకొచ్చారు. అందుకే ఎన్నికల్లో మహిళలు టీడీపీని ఓడించారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మహిళలు బలోపేతం అయ్యేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు.
– పుష్ప శ్రీవాణి, డిప్యూటీ సీఎం
మనసున్న పాలకుడి గొప్ప నిర్ణయం
పదేళ్ల పాటు ప్రజల్లో ఉంటూ వారి కష్టాలు, కన్నీళ్లను దగ్గరి నుంచి చూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం ఇది. మనసున్న పాలకుడి పాలన ఎలా ఉంటుందో ఆయన చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని దేశానికి ఆదర్శంగా నిలిచారు.
– బాలరాజు, ఎమ్మెల్యే, పోలవరం
వైఎస్ జగన్‌కు సెల్యూట్..
ఐదు నెలల క్రితం ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే చేసి చూపిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. విలువలు, విశ్వసనీయత అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజల మనసులో నిలిచిపోతారు. అందుకే బీసీ వర్గాల తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సెల్యూట్ చేస్తున్నా.
– జోగి రమేష్, ఎమ్మెల్యే, పెడన
మహిళల ఆత్మవిశ్వాసం పెంచే మహా విప్లవం
తరతరాలుగా మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలను సరిదిద్దే దిశగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద ముందడుగు వేశారు. మహిళల ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవం పెంచే మహా విప్లవం ఇది. ఈ నిర్ణయం దేశ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలుకుతోంది. ఇందుకు మహిళా లోకం తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
– విడదల రజని, ఎమ్మెల్యే, చిలకలూరిపేట
Comments
Please login to add a commentAdd a comment