civils training
-
పోలీసుల పిల్లలకు ఉచితంగా సివిల్స్ కోచింగ్
అనంతపురం క్రైం: పోలీసుల పిల్లలు సివిల్స్, గ్రూప్స్‌లో ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో లైబ్రరీ కమ్ స్టడీ సెంటర్ ఏర్పాటైంది. దీన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప.. పెనుకొండ సబ్ కలెక్టర్ మల్లారపు నవీన్, రాష్ట్ర గ్రేహౌండ్స్ విభాగం అసాల్ట్ కమాండర్ కొమ్మి శివకిషోర్, ఐఏఎస్ అధికారిణి ధాత్రిరెడ్డితో కలసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫక్కీరప్ప మాట్లాడుతూ.. పోలీసుల పిల్లలు ఏదో ఒక ఉన్నత ఉద్యోగం సాధించాలనే ఆశయంతో ఆధునిక సౌకర్యాలతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. సివిల్ సర్వీసెస్, గ్రూప్ –1 ఉద్యోగాలు సాధించేందుకు ఈ లైబ్రరీ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఢిల్లీ, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లకుండానే పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ పొందవచ్చన్నారు. ఇందులో ఉండే పుస్తకాలను డిజిటల్ విధానంలో కూడా చదువుకునేలా సెంట్రలైజ్డ్ సర్వర్‌తో 15 కంప్యూటర్లను సిద్ధం చేశామన్నారు. 50 మంది విద్యార్థులు కూర్చునేలా డిజిటల్ క్లాస్ రూమ్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఢిల్లీలోని వాజీరాం లాంటి ప్రముఖ కోచింగ్ సెంటర్ల ద్వారా ప్రత్యక్ష తరగతులను నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వచ్చే నెల 6 నుంచి ఈ క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు. రౌండ్ ద క్లాక్ లైబ్రరీ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. మొదట పోలీసు కుటుంబాల పిల్లలకు ప్రాధాన్యతనిస్తామని వివరించారు. భవిష్యత్తులో నిరుపేద అభ్యర్థులకు అవకాశం కల్పిస్తామన్నారు. అలాగే రాబోయే రోజుల్లో రెసిడెన్షియల్ కోచింగ్ అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు.. నాగేంద్రుడు, రామమోహన్‌రావు, హనుమంతు, డీఎస్పీలు.. వీరరాఘవరెడ్డి, చైతన్య, ఉమామహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో సివిల్ సర్వీసెస్‌పై నిర్వహించిన వర్క్‌షాపులో అధికారులు తమ అనుభవాలను అభ్యర్థులతో పంచుకున్నారు. నిర్దిష్ట ప్రణాళికతో సన్నద్ధమవ్వాలి నిర్ధిష్ట ప్రణాళికతో సివిల్స్‌కు సన్నద్ధమవ్వాలి. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారికి సరైన గైడెన్స్ తప్పనిసరి. సరైన గైడెన్స్ ఉంటే ఎలాంటి తప్పులు లేకుండా లక్ష్యం సాధించవచ్చు. – మల్లారపు నవీన్, సబ్ కలెక్టర్, పెనుకొండ సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి సివిల్స్ సాధించాలనుకునేవారు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి. మొదటిసారే మంచి ర్యాంకు సాధించాలన్న సంకల్పంతో ముందుకెళ్లాలి. – ధాత్రిరెడ్డి, ఐఏఎస్ గొప్ప అవకాశం మా నాన్న హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. మా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఢిల్లీ, హైదరాబాద్ వెళ్లి శిక్షణ పొందాలంటే కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో అనంతపురంలోనే లైబ్రరీ కమ్ స్టడీ సెంటర్ ఏర్పాటు మాకు గొప్ప అవకాశాన్ని ఇస్తోంది. – మాధవి, బీటెక్ గ్రాడ్యుయేట్, అనంతపురం భవిష్యత్తుకు బంగారు బాట పోలీసుల పిల్లల భవిష్యత్తుకు ఎస్పీ బంగారు బాటలు వేశారు. సివిల్స్‌కు శిక్షణ పొందే అవకాశాన్ని జిల్లాలోనే కల్పించడం చాలా గొప్ప విషయం. – సాకే త్రిలోక్‌నాథ్, పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యుడు -
మేం చెప్పిందే ‘సెంటర్’
సాక్షి, అమరావతి: పేద విద్యార్థులు సైతం సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నెగ్గేందుకు ఉచితంగా శిక్షణ ఇప్పించాలన్న ప్రభుత్వ సంకల్పం మసకబారుతోంది. కోచింగ్ సెంటర్ల ఎంపికలో గోల్మాల్ చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో 17 కోచింగ్ సెంటర్లను ఎంపిక చేయగా, ఈసారి వీటితోపాటు కొత్తగా మరో మూడు కేంద్రాలను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి కార్యాయలం(సీఎంవో) ఆదేశించింది. దీంతో మొత్తం 20 కోచింగ్ సెంటర్లను ఎంపిక చేశారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతల పైరవీలు ఫలించినట్లు సమాచారం. తాము సూచించిన కేంద్రాలనే ఎంపిక చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చి, అనుకున్నది సాధించినట్లు తెలుస్తోంది. సివిల్స్ శిక్షణ నిమిత్తం ప్రభుత్వం ఇచ్చే నిధులను దిగమింగడానికి ప్రయత్నిస్తున్నట్లు విమర్శలున్నాయి. అర్హులైన విద్యార్థులకు సివిల్స్ శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన కోచింగ్ సెంటర్ల ఎంపిక కోసం ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన నాలుగు కమిటీలను నియమించింది. ఈ కమిటీలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల డైరెక్టర్లు, కాపు కార్పొరేషన్ ఎండీ నేతృత్వం వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య నగరాలతోపాటు హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లోని కోచింగ్ సెంటర్లను ఈ కమిటీలు పరిశీలించాయి. 17 సెంటర్లను ఎంపిక చేశాయి. ఈ మేరకు ప్రభుత్వానికి తమ నివేదికను అందజేశాయి. అనంతరం మరో 3 కోచింగ్ సెంటర్లను చేర్చాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో 20 కోచింగ్ సెంటర్లను అధికారులు ఎంపిక చేశారు. మొత్తం 20 సెంటర్లలో చాలావరకు అధికార పార్టీ నేతలకు బాగా కావాల్సినవేనని ప్రభుత్వ ఉన్నతాధికారి పేర్కొన్నారు. నాలుగు నెలలు వృథా సివిల్స్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి జూన్ నెలాఖరున పోటీ పరీక్ష నిర్వహించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కమిటీలు, తనిఖీలు అంటూ కాలయాపన చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి, అస్మదీయ కోచింగ్ సెంటర్లను ఎంపిక చేశారు. నాలుగు నెలల సమయం వృథా అయిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే జూన్‌లో సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు జరుగుతాయని, పరీక్షలకు సిద్ధం కావడానికి ఈ గడువు సరిపోదని వాపోతున్నారు. కోచింగ్ ఫీజు విద్యార్థులకు ఖాతాలకు.. సివిల్స్ కోచింగ్ ఫీజును నేరుగా కోచింగ్ కేంద్రాలకు ఇవ్వకుండా, విద్యార్థుల బ్యాంకు ఖాతాలకే బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం జీవో విడుదల చేసింది. కోచింగ్ సెంటర్లను 3 విభాగాలుగా విభజించారు. ఏడాదికి ప్రతి విద్యార్థికి కోచింగ్ ఫీజు కింద మొదటి విభాగం కేంద్రానికి రూ.1.30 లక్షలు, రెండో విభాగం కేంద్రానికి రూ.1.15 లక్షలు, మూడో విభాగం కేంద్రానికి రూ.లక్ష చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని నెలనెలా విద్యార్థుల ఖాతాకు జమ చేస్తారు. జ్ఞానభూమి వెబ్సైట్ ద్వారా విద్యార్థులకు ట్యూషన్ ఫీజుతోపాటు మెయింటెనెన్స్ ఫీజు జమ అవుతుంది. ట్యూషన్ ఫీజును విద్యార్థులు కోచింగ్ సెంటర్లకు చెల్లించాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ ఫీజు నెలకు రూ.10,000, ఢిల్లీలో కోచింగ్ తీసుకునే వారికి రూ.12,000 ఇస్తారు. రవాణా ఖర్చుల కింద రూ.2,000 అందజేస్తారు. నేటి నుంచి కౌన్సెలింగ్ సివిల్స్ ఉచిత కోచింగ్‌కు ఎంపికైన అభ్యర్థులు ప్రభుత్వం కేటాయించిన కోచింగ్ సెంటర్లలో నేటి నుంచి జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. జ్ఞానభూమి వెబ్సైట్ ద్వారా ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం.రామారావు తెలిపారు. -
తమిళనాడు తరహాలో సివిల్స్ శిక్షణ
బీసీ స్టడీ సర్కిళ్లను తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయం సాక్షి, హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు సత్తా చాటేలా రాష్ర్ట బీసీ ఎంప్లాయబిలిటీ స్కిల్ డెవలప్మెంట్, ట్రైనింగ్ సెంటర్ (బీసీ స్టడీసర్కిల్స్)ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా తమిళనాడులోని బీసీ స్టడీసర్కిళ్ల ద్వారా సివిల్స్ పరీక్షలకు ఇస్తున్న శిక్షణ, విధానాలను ఇక్కడ కూడా అమలు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా అక్కడి విధానాలు అధ్యయనం చేసేందుకు ఈ నెల 7,8న హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల బీసీ స్టడీ సర్కిళ్ల డెరైక్టర్లు చెన్నైకి వెళ్లనున్నారు. అక్కడ ప్రత్యేక క్యాంపస్‌లో హాస్టల్, ఇతర సౌకర్యాలతో 320 మందికి 6 నెలల పాటు ప్రిలిమ్స్, 200 మందికి 4 నెలల పాటు మెయిన్స్ శిక్షణ అందజేస్తున్నారు. అంతేకాకుండా మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారికి ఢిల్లీలోని తమిళనాడు హౌజ్‌లో 15 రోజుల పాటు ఇంటర్వ్యూ విధానంపై ఇంటెన్సివ్ కోచింగ్ ఇస్తున్నారు. బీసీ స్టడీసర్కిళ్లలో ప్రవేశానికి బీసీలకు 66 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 14 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఇప్పటికే ఈ స్టడీసర్కిళ్లలో ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 10 ఆఖరి తేదీ కాగా, ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష నిర్వహించనున్నారు. ఎంపికైన వారికి ఈ నెల 28 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభిస్తారు. సివిల్స్ ప్రిలిమ్స్‌కు మొత్తం 140 మందికి శిక్షణనిస్తారు. అందులో హైదరాబాద్‌లో 60 మందికి, వరంగల్‌లో 40 మందికి, కరీంనగర్లో 40 మందికి కోచింగ్ ఇస్తారు.