సాక్షి, అమరావతి: పేద విద్యార్థులు సైతం సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నెగ్గేందుకు ఉచితంగా శిక్షణ ఇప్పించాలన్న ప్రభుత్వ సంకల్పం మసకబారుతోంది. కోచింగ్ సెంటర్ల ఎంపికలో గోల్‌మాల్ చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో 17 కోచింగ్ సెంటర్లను ఎంపిక చేయగా, ఈసారి వీటితోపాటు కొత్తగా మరో మూడు కేంద్రాలను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి కార్యాయలం(సీఎంవో) ఆదేశించింది. దీంతో మొత్తం 20 కోచింగ్ సెంటర్లను ఎంపిక చేశారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతల పైరవీలు ఫలించినట్లు సమాచారం. తాము సూచించిన కేంద్రాలనే ఎంపిక చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చి, అనుకున్నది సాధించినట్లు తెలుస్తోంది.
సివిల్స్ శిక్షణ నిమిత్తం ప్రభుత్వం ఇచ్చే నిధులను దిగమింగడానికి ప్రయత్నిస్తున్నట్లు విమర్శలున్నాయి. అర్హులైన విద్యార్థులకు సివిల్స్ శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన కోచింగ్ సెంటర్ల ఎంపిక కోసం ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన నాలుగు కమిటీలను నియమించింది. ఈ కమిటీలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల డైరెక్టర్లు, కాపు కార్పొరేషన్ ఎండీ నేతృత్వం వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య నగరాలతోపాటు హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లోని కోచింగ్ సెంటర్లను ఈ కమిటీలు పరిశీలించాయి. 17 సెంటర్లను ఎంపిక చేశాయి. ఈ మేరకు ప్రభుత్వానికి తమ నివేదికను అందజేశాయి. అనంతరం మరో 3 కోచింగ్ సెంటర్లను చేర్చాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో 20 కోచింగ్ సెంటర్లను అధికారులు ఎంపిక చేశారు. మొత్తం 20 సెంటర్లలో చాలావరకు అధికార పార్టీ నేతలకు బాగా కావాల్సినవేనని ప్రభుత్వ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
నాలుగు నెలలు వృథా
సివిల్స్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి జూన్ నెలాఖరున పోటీ పరీక్ష నిర్వహించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కమిటీలు, తనిఖీలు అంటూ కాలయాపన చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి, అస్మదీయ కోచింగ్ సెంటర్లను ఎంపిక చేశారు. నాలుగు నెలల సమయం వృథా అయిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే జూన్‌లో సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు జరుగుతాయని, పరీక్షలకు సిద్ధం కావడానికి ఈ గడువు సరిపోదని వాపోతున్నారు.
కోచింగ్ ఫీజు విద్యార్థులకు ఖాతాలకు..
సివిల్స్ కోచింగ్ ఫీజును నేరుగా కోచింగ్ కేంద్రాలకు ఇవ్వకుండా, విద్యార్థుల బ్యాంకు ఖాతాలకే బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం జీవో విడుదల చేసింది. కోచింగ్ సెంటర్లను 3 విభాగాలుగా విభజించారు. ఏడాదికి ప్రతి విద్యార్థికి కోచింగ్ ఫీజు కింద మొదటి విభాగం కేంద్రానికి రూ.1.30 లక్షలు, రెండో విభాగం కేంద్రానికి రూ.1.15 లక్షలు, మూడో విభాగం కేంద్రానికి రూ.లక్ష చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని నెలనెలా విద్యార్థుల ఖాతాకు జమ చేస్తారు. జ్ఞానభూమి వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులకు ట్యూషన్ ఫీజుతోపాటు మెయింటెనెన్స్ ఫీజు జమ అవుతుంది. ట్యూషన్ ఫీజును విద్యార్థులు కోచింగ్ సెంటర్లకు చెల్లించాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ ఫీజు నెలకు రూ.10,000, ఢిల్లీలో కోచింగ్ తీసుకునే వారికి రూ.12,000 ఇస్తారు. రవాణా ఖర్చుల కింద రూ.2,000 అందజేస్తారు.
నేటి నుంచి కౌన్సెలింగ్
సివిల్స్ ఉచిత కోచింగ్‌కు ఎంపికైన అభ్యర్థులు ప్రభుత్వం కేటాయించిన కోచింగ్ సెంటర్లలో నేటి నుంచి జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. జ్ఞానభూమి వెబ్‌సైట్ ద్వారా ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం.రామారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment