వ్యక్తిత్వంలో విజయానికి.. | success of the individual | Sakshi
Sakshi News home page

వ్యక్తిత్వంలో విజయానికి..

Published Sun, Mar 29 2015 11:25 PM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM

వ్యక్తిత్వంలో విజయానికి.. - Sakshi

వ్యక్తిత్వంలో విజయానికి..

సివిల్స్- 2014  పర్సనాలిటీ టెస్ట్
 
సివిల్ సర్వీసెస్ పరీక్షలో ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధిస్తే..లక్షల్లో ఉండే పోటీని తట్టుకొని మలిదశ మెయిన్స్‌కు చేరుకున్నట్లే! మెయిన్స్ మెట్టు కూడా దాటితే అభ్యర్థితో పోటీకి నిలిచిన వారు  లక్షల నుంచి వేలల్లోకి తగ్గినట్లే! చివరి అడుగైన పర్సనాలిటీ టెస్ట్‌లో విజయం సాధిస్తే కల సాకారమైనట్ల్లే!  సివిల్స్-2014 ఇంటర్వ్యూలు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో  కీలకమైన పర్సనాలిటీ టెస్ట్‌లో విజయానికి ఉపయోగపడే మార్గాలు...
 
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మెయిన్‌‌స పరీక్షలు రాసిన అభ్యర్థులు త్వరలో వెలువడనున్న ఫలితాల కోసం ఎదురుచూస్తూ.. మరోవైపు పర్సనాలిటీ టెస్ట్‌కు సిద్ధమవుతున్నారు. రెండు దశల రాత పరీక్షలలో(సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్) విజేతలుగా నిలిచిన అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్ పేరిట యూపీఎస్సీ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌తోపాటు దాదాపు 20 కేంద్ర సర్వీసుల పోస్టుల్లో నియామకానికి నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ)ది కీలక పాత్ర. నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఇంటర్వ్యూ వరకూ.. దాదాపు సంవత్సరానికిపైగా సాగే సివిల్స్ ఎంపిక క్రతువులో విజయం సాధించేందుకు అహోరాత్రులు శ్రమించి ఇంటర్వ్యూ దశకు చేరుకుంటారు. కొంతమంది మొదటిసారే ఇంటర్వ్యూలో విజయం సాధిస్తుండగా.. మరికొందరు చివరి అటెంప్ట్‌లో కానీ గెలుపు గమ్యం చేరుకోలేకపోతున్నారు. వ్యక్తిత్వాన్ని, మానసిక పరిణితిని పరీక్షించే పర్సనాలిటీ టెస్ట్‌లో చిన్నపాటి పొరపాట్లతో అవకాశాలు చేజార్చుకుంటున్నారు. అయితే కొద్దిపాటి మెళకువలతో ఇంటర్వ్యూలో ఉత్తమంగా రాణించి కలలను సాకారం చేసుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.
 
సానుకూల దృక్పథం:

సివిల్స్ ఇంటర్వ్యూలో విజయానికి మొదటి సాధనం.. సానుకూల దృక్పథం. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు, ప్రాంతీయ మీడియంలలో చదివిన అభ్యర్థుల్లో ఆశించిన స్థాయిలో ఆత్మవిశ్వాసం ఉండటంలేదు. మెట్రో నగరాలు, ప్రొఫెషనల్ డిగ్రీ ఉత్తీర్ణులతో పోల్చుకుని ఆందోళన చెందుతున్నారు. ఆత్మన్యూనతకు లోనవుతున్నారు. ఇంటర్వ్యూలో రాణించగలమా? లేదా? అనే సందేహాన్ని విడనాడాలి.ప్రిలిమ్స్‌లో లక్షల పోటీని, మెయిన్‌‌సలో వేలమందిని ఎదుర్కొని 1:2 లేదా 1:2.5 పోటీ వరకు వచ్చాం కదా.. ! అనే ఆత్మస్థైర్యం, సానుకూల వైఖరులను అలవర్చుకోవాలి. స్వతహాగా బిడియస్తులైతే ఇప్పటినుంచే బృంద చర్చల ద్వారా ఆ సమస్యను అధిగమించాలి.
 
పర్సనాలిటీ టెస్ట్.. ఉద్దేశం:

సివిల్స్ ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులు అసలు పర్సనాలిటీ టెస్ట్ ఉద్దేశం ఏంటో తెలుసుకోవడం ముఖ్యం. వాస్తవానికి యూపీఎస్సీ పర్సనాలిటీ టెస్ట్ ప్రధాన ఉద్దేశం.. అభ్యర్థి భావవ్యక్తీకరణ, నిర్వహణ నైపుణ్యం, నిర్ణయాత్మక సామర్థ్యం, ఎదుటివారి అభిప్రాయాలను స్వీకరించగలిగే మనస్తత్వం, సామాజిక సమస్యలపై అవగాహన వంటి లక్షణాలను పరీక్షించడం. ముఖ్యంగా అభ్యర్థులకు భవిష్యత్తు లక్ష్యం గురించి స్పష్టత ఉండాలి. ఇటీవల కాలంలో ఇంజనీరింగ్, మెడికల్ తదితర ప్రొఫెషనల్ కోర్సుల గ్రాడ్యుయేట్లు ఎక్కువగా సివిల్స్ వైపు వస్తున్నారు. దాంతో భవిష్యత్తు లక్ష్యం గురించి అడుగుతున్నారు.

ఓ ఎంఎన్‌సీలో మూడేళ్లుగా పనిచేస్తూ, గతేడాది తొలి అటెంప్ట్‌లోనే ఇంటర్వ్యూ దశకు చేరుకున్న అభ్యర్థిని అడిగిన ప్రశ్న.. ‘మీరు ఎంతో పేరున్న ఇన్‌స్టిట్యూట్‌లో బీటెక్ చదివారు. ప్రస్తుతం లక్షల్లో వార్షిక వేతనం అందుకుంటున్నారు. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ వైపు రావాలనుకోవడానికి కారణం?’ ఈ ప్రశ్న కు ఆ అభ్యర్థి చెప్పిన సమాధానంతో బోర్డ్ సభ్యులు సంతృప్తి చెందలేదు. కారణం.. సివిల్ సర్వీసెస్ ద్వారా సంఘంలో హోదా లభిస్తుందని, ఉన్నత స్థానంలో ఉండొచ్చని చెప్పడమే! అయితే, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు సామాజిక అభ్యున్నతికి దోహదపడేందుకు సమున్నత మార్గంగా సివిల్ సర్వీసెస్ నిలుస్తుందనే భావం వచ్చేలా, తమ వ్యక్తిగత లక్ష్యం కూడా అదే అని బోర్డును ఒప్పించే విధంగా సమాధానం చెప్పాలి.
 
నిర్ణయాత్మకత, సమయస్ఫూర్తి, భావవ్యక్తీకరణ:

 సివిల్స్ పర్సనాలిటీ టెస్ట్‌లో రాణించేందుకు అభ్యర్థులకు ఉండాల్సిన మూడు ప్రధాన లక్షణాలు.. నిర్ణయాత్మక సామర్థ్యం, సమయస్ఫూర్తి, భావ వ్యక్తీకరణ. ప్రజలకు ప్రత్యక్షంగా సేవచేసే ఉద్యోగిగా సివిల్ సర్వెంట్‌కు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే నైపుణ్యం ఎంతో అవసరం. ఉన్నతాధికారుల అనుమతి కోసం వేచి చూడకుండా నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాలు కూడా ఎదురవుతాయి. సరైన నిర్ణయం తీసుకోవడంతోపాటు, స్వీయ నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి సంబంధించి అధికారులను మెప్పించే నేర్పు వంటి లక్షణాలు కూడా కలిగుండాలి. ఈ లక్షణాలు ప్రతిబింబించేలా ఇంటర్వ్యూ సమయంలో వ్యవహరించాలి.

పరిపాలన, నిర్వహణకు సంబంధించి నిర్ణయాత్మక శక్తి, సమయస్ఫూర్తి సివిల్ సర్వెంట్లకు ప్రధాన లక్షణంగా నిలుస్తుంటే.. భావ వ్యక్తీకరణ సామర్థ్యం మరో కీలకమైన అవసరం. తాము చెప్పే విషయం స్పష్టంగా, సూటిగా, ఎలాంటి తడబాటు లేకుండా చెప్పగలగాలి. సంభాషణలో అభ్యర్థి మాట్లాడే పదాలు కూడా ప్రధానమే. అనవసరపు పదాడంబరాల జోలికి వెళ్లకూడదు. సరళమైన భాషలోనే తమ అభిప్రాయాలను చెప్పాలి. ఇంగ్లిష్ దినపత్రికలు లేదా వ్యాసాల్లోని పదాలను వినియోగించాలని భావించడం కూడా సరికాదు. ఎందుకంటే.. అలాంటి వ్యాసాలు లేదా ఎడిటోరియల్స్ రాసేది సంబంధిత రంగంలో నిపుణులని గుర్తించాలి. అభ్యర్థులు ‘నేర్చుకునే’ కోణంలో ఆ స్థాయిలో ముందుకు సాగడం సబబే. కానీ.. కీలకంగా నిలిచే 20 నుంచి 25 నిమిషాలు జరిగే ఇంటర్వ్యూలో ప్రయోగాలు చేయకూడదనేది నిపుణుల అభిప్రాయం.

వాక్చాతుర్యం.. సమతుల్యత:

ఇటీవల కాలంలో సివిల్ సర్వీసెస్ పర్సనాలిటీ టెస్ట్ శైలి మారుతోంది. అభ్యర్థుల బయోడేటా, హాబీలకు సంబంధించిన ప్రశ్నలు నేరుగా అడుగుతుండగా.. మిగతా ప్రశ్నలు చర్చకు దారితీసే విధంగా ఉంటున్నాయి. గతేడాది ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి..

 
ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే ఒక చిన్నపాటి డిబేట్‌కు దారి తీస్తుంది. ఇలాంటి సందర్భాల్లోనే అభ్యర్థుల్లోని వాక్చాతుర్యం, చర్చించే నైపుణ్యం, ఆయా అంశాలపై వారికున్న వాస్తవ అభిప్రాయాలు వెలుగులోకి వస్తాయి. ముఖ్యంగా ‘మీ అభిప్రాయం ఏంటి?’ వంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పు డు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా చక్కటి వాక్పటిమతో ఆకట్టుకునే రీతిలో సమాధానం ఇవ్వాలి. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు, ఆయా విభాగాల్లో అవినీతి తదితర అంశాలపై ప్రశ్నలు ఎదురైనప్పుడు మరింత సమతుల్యత పాటించాలి. నిందాపూర్వకమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం సరికాదు. సమస్యను వివరిస్తూనే పరిష్కార మార్గాలను సూచించే విధంగా స్పందించాలి. అప్పుడే బోర్డ్ సభ్యుల మన్ననలు అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
 
బయోడేటా.. డ్రస్సింగ్.. విషింగ్:

పర్సనాలిటీ టెస్ట్ విషయంలో అభ్యర్థులు తమ బయోడేటాలో పేర్కొన్న అంశాలపైనా కసరత్తు చేయాలి. తద్వారా నాణ్యమైన సమాధానాలు మదిలో నిక్షిప్తం చేసుకుని ఇంటర్వ్యూకు హాజరుకావాలి. చాలామంది చేసే పొరపాటు ‘హాబీ’గా పేర్కొన్న అంశం గురించి లోతైన అవగాహన పెంచుకోకపోవడం! అభ్యర్థి హాబీ గురించి సుదీర్ఘ చర్చ జరిగే సందర్భాలు కూడా ఉంటాయి. ఉదా: సినిమాలు చూడటం ఇష్టం అని పేర్కొంటే.. సినిమాల ఆవిర్భావం నుంచి ఇటీవల ఆస్కార్ విజేతల వరకు ఎలాంటి ప్రశ్నలైనా అడగొచ్చు. డ్రెస్సింగ్.. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్.. సివిల్స్ పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరవుతున్న అభ్యర్థులు గుర్తించాల్సిన అంశమిది. కాబట్టి మొదటగా డ్రెస్సింగ్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. హుందాతనం ఉండాలి తప్ప.. ఆడంబరం పనికిరాదు. పురుష అభ్యర్థులు లేత రంగు షర్ట్‌లు, ముదురు రంగు ప్యాంటులు, షూస్ ధరించడం మంచిది. సూట్ ధరించే విషయంలో ఆయా అభ్యర్థులు తమ అలవాటును బట్టి వ్యవహరించాలి. మహిళా అభ్యర్థులు చీరలు ధరించడం మంచిది. విషింగ్ అంటే.. ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టాక బోర్డ్ సభ్యులను పలకరించే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. సభ్యులందరినీ చూస్తూ అభివందనం చేయడంపై ప్రాక్టీస్ చేయాలి. మన సంప్రదాయం ఉట్టిపడేలా నమస్తే అని సంబోధించడం మేలు.
 
స్వస్థలం మొదలు అన్నిటిపై అవగాహన

సివిల్స్ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ స్వస్థలం నుంచి సమకాలీన పరిణామాల వరకూ.. అన్ని అంశాలపై సమాచార సేకరణ చేసుకోవాలి. తమ స్వస్థలం చారిత్రక ప్రాశస్త్యం కలిగుంటే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం ముఖ్యం. అదే విధంగా అభ్యర్థుల ఇంటిపేర్లు కూడా కొన్ని సందర్భాల్లో చర్చకు దారి తీస్తాయి. అదే ఇంటిపేరు కలిగిన ప్రముఖులు, వారు చేసిన సేవలు వంటి వాటిపైనా ప్రశ్నలు అడిగే అవకాశాలుంటాయి. ఇంటర్వ్యూల శైలి విభిన్నంగా మారుతోంది. ప్రధానంగా అభ్యర్థుల్లోని పాలనాదక్షతను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఏదైనా ఒక సమస్యను ప్రస్తావించి మీరే కలెక్టర్ అయితే ఏం చేస్తారు? వంటివి. అదేవిధంగా ఇటీవల కాలంలో మన దేశం చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలు, వాటి ఉద్దేశాలు వంటి వాటిపైనా దృష్టిసారించాలి. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం గల అభ్యర్థులు.. ఇంటర్వ్యూ అంటే ఆందోళన పోగొట్టుకోవాలి. ఏ బోర్డ్ సభ్యులైనా అభ్యర్థులకు ఆహ్లాదకర వాతావరణం కలిగించేలా వ్యవహరిస్తారు. దీన్ని గమనించి ముందుగా మానసికంగా సంసిద్ధత పొందితే పర్సనాలిటీ టెస్ట్‌లో విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు.
 - ఆర్.సి.రెడ్డి, డెరైక్టర్, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్
 
లక్ష్యంపై ప్రశ్నలకు స్పష్టత

సివిల్స్ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ లక్ష్యంపై స్పష్టతతో ఉండాలి. సివిల్స్ ద్వారా సమాజానికి సేవచేసే అవకాశం లభిస్తుందని ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థుల్లో నూటికి 90 శాతం మంది చెప్పే సమాధానం. అయితే ఇంటర్వ్యూ ఆసాంతం ఇదే ప్రశ్న-సమాధానంపై జరిగే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇంజనీరింగ్, సైన్స్ నేపథ్యం కలిగిన అభ్యర్థులు, ఇప్పటికే పలు ఎంఎన్‌సీల్లో మంచి హోదాల్లో లక్షల వేతనంతో పని చేస్తున్న వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ తరహా అభ్యర్థులు తమ అకడమిక్ నాలెడ్జ్‌ను పరిపాలన విభాగాల్లో అన్వయించేందుకు గల మార్గాలను తెలియజేసే విధంగా నైపుణ్యం పొందాలి. ఇంజనీరింగ్ విద్యార్థులైతే.. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలు, పథకాలను దృష్టిలో పెట్టుకుని డిజిటలైజేషన్ ఆఫ్ ఇండియా, ఐసీటీ వంటి విధానాల ద్వారా అమలు చేస్తున్న పలు పథకాలకు తమ నైపుణ్యాలు ఉపయోగపడతాయనే రీతిలో సమాధానాలు ఇవ్వాలి. ఇక వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఎదురవుతున్న మరో ప్రశ్న.. మీరు సేవే లక్ష్యంగా సివిల్స్‌వైపు రావాలనుకుంటున్నారా?ఎంపిక కాకపోతే ఏం చేస్తారు? దీనికి సమాధానం ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎంపిక కాకపోయినా మరోసారి ప్రయత్నిస్తానని చెప్పడం మంచిది. అంతేతప్ప ఎంపిక కాకపోతే పూర్వ వృత్తికి వెళతాననే సమాధానాలు ప్రతికూల ప్రభావం చూపుతాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఇంటర్వ్యూకు సన్నద్ధం కావాలి.
 - శ్రీరంగం శ్రీరామ్, శ్రీరామ్స్ ఐఏఎస్
 
కరెంట్ అఫైర్స్‌పై పట్టు

సివిల్స్ ఇంటర్వ్యూ అభ్యర్థులు కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించాలి. ముఖ్యంగా కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చోటు చేసుకున్న ముఖ్య పరిణామాలు, అంతర్జాతీయ ఒప్పందాలు; పలు ప్రభుత్వ పథకాలు, వాటి ఉద్దేశం, నేపథ్యం, క్షేత్ర స్థాయిలో అమలు తీరుతెన్నులు, సమస్యలు.. ఇలా అన్ని కోణాల్లో అవగాహన పెంచుకోవాలి. ఈసారి వరల్డ్ కప్ క్రికెట్ గురించి కూడా ప్రశ్నలు అడిగే అవకాశాలున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఎక్కువగా ప్రాంతీయ ప్రాధాన్యత అంశాల్లో భాగంగా రెండు ప్రభుత్వాలు అభివృద్ధి దిశగా తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న పథకాలు, అవి ఆయా రాష్ట్రాల పురోగతికి దోహదం చేసే విధానం, ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన అంశాలు (నీటి పంపిణీ, విద్యుత్ పంపిణీ తదితర)పై పరిజ్ఞానం పొందాలి.
 - వి.గోపాలకృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ
 
మంచి సర్వీస్ రావాలంటే..

సివిల్స్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేసే 20కు పైగా కేంద్ర సర్వీసుల్లో అభ్యర్థులు తమకు నచ్చిన సర్వీస్‌లో స్థానం పొందడానికి పర్సనాలిటీ టెస్ట్‌లో చూపే ప్రతిభ కీలకంగా మారుతోంది. చాలా మంది అభ్యర్థులు మెయిన్స్ రాత పరీక్షలో అధిక మార్కులు సాధించినా, ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు పొందడం వల్ల తుది జాబితాలో నిలుస్తున్నారు. కానీ తమకు నచ్చిన సర్వీస్‌కు ఎంపిక కాలేకపోతున్నారు. దీన్ని గుర్తించి మెయిన్స్‌లో బాగా రాశాం కదా? అనే ధోరణితో ఇంటర్వ్యూ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. పర్సనాలిటీ టెస్ట్‌లో కూడా ఉత్తమంగా రాణించేందుకు కసరత్తు చేయాలి. ఇటీవల కాలంలో ఎథిక్స్, మోరల్ వాల్యూస్ సంబంధిత ప్రశ్నలు ఎక్కువవుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఒక విభాగాధిపతిగా తమ నిబద్ధత, నిజాయతీని ప్రతిబింబించే విధంగా సమాధానాలు ఇచ్చే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ప్రస్తుత సమయంలో మాక్ ఇంటర్వ్యూలకు హాజరవడం ఎంతో మేలు చేస్తుంది.
 - కె.శశాంక, సివిల్స్-2012, ఆల్ ఇండియా ర్యాంకు 16
 
ఆ రోజు వ్యవహరించే శైలే కీలకం


 సివిల్స్ లక్ష్యం దిశగా ఎన్నేళ్లు కష్టపడినా.. ఇంటర్వ్యూ రోజు 25 నుంచి 30 నిమిషాలు పాటు వ్యవహరించే శైలి ఎంతో కీలకం. ఆ సమయాన్ని నిర్మాణాత్మకంగా వినియోగించుకుంటే సానుకూల ఫలితాలు అందుకోవచ్చు. తమ విషయ పరిజ్ఞానం, తమ నైపుణ్యాలను సివిల్ సర్వీసెస్ ద్వారా సమాజ సేవకు ఎలా వినియోగిస్తారో బోర్డ్ సభ్యులను మెప్పించేలా చెప్పగలగాలి. ఇందుకోసం మాక్ ఇంటర్వ్యూలకు హాజరవ్వాలి. తమ పర్సనాలిటీ పరంగా మెరుగుపరచుకోవాల్సిన అంశాలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా అకడమిక్ నేపథ్య సబ్జెక్ట్ నాలెడ్జ్‌ను పునశ్చరణ చేసుకోవాలి. క్రమం తప్పకుండా దినపత్రికలు చదవాలి.
 - కృత్తిక జ్యోత్స్న, సివిల్స్-2013 ఆల్ ఇండియా ర్యాంకు 30
 
మాక్ ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్స్

సివిల్స్ పర్సనాలిటీ టెస్ట్‌లో విజయసాధనకు మాక్ ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్స్ మంచి ఉపకరణాలు. మాక్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులకు డ్రెస్ కోడ్ మొదలు కంటెంట్ పరంగా మెరుపరచుకోవాల్సిన అంశాలపై నిపుణుల సలహాలు లభిస్తాయి. గ్రూప్ డిస్కషన్స్ తో తమకు తెలియని కొత్త విషయాలపై అవగాహన పెంచుకోవచ్చు.
 - జె.కీర్తి, సివిల్స్-2012
 ఆల్ ఇండియా ర్యాంకు 89
 
 సివిల్స్ ఇంటర్వ్యూ- దృష్టి సారించాల్సిన అంశాలు
 
మేక్ ఇన్ ఇండియా స్కీం భూ సేకరణ చట్టంలో మార్పులు జనధన్ యోజన
ఒబామా పర్యటన - భారత్-అమెరికా సంబంధాలపై ప్రభావం
ఇన్సూరెన్స్‌లో ఎఫ్‌డీఐల పెంపు - పర్యవసానాలు
అంతర్జాతీయ ఒప్పందాలు
{పణాళిక సంఘం స్థానంలో నీతి అయోగ్ ఏర్పాటు- ఉద్దేశాలు
అంతర్జాతీయంగా ఆయా దేశాల్లో పెరుగుతున్న అంతర్గత ఉగ్రవాదం- ఇతర దేశాలపై ప్రభావం
శాసన, పరిపాలన వ్యవస్థల్లో తరచుగా న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాల్సి రావడానికి కారణాలు
జాతీయ స్థాయి విద్యా సంస్థల విస్తరణ నిర్ణయం
 
 సివిల్స్ 2012, 2013 పర్సనాలిటీ టెస్ట్ కటాఫ్స్

 
275 మార్కులకు నిర్వహించే సివిల్స్ పర్సనాలిటీ టెస్ట్‌లో 2012, 2013 కటాఫ్స్ వివరాలు..
 సంవత్సరం    జనరల్    ఓబీసీ    ఎస్సీ    ఎస్టీ
 2012           211    208    209    197
 2013          236    229    210    205
 
సివిల్స్ - 2014 ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్:
     
మొత్తం పోస్ట్‌లు - 1291

{పిలిమ్స్‌కు హాజరైంది - 4,51,602
మెయిన్స్‌కు అర్హత సాధించింది - 16,993
ఇంటర్వ్యూకు అర్హత లభించేది - సుమారు 2,500
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement