పట్టుదల + ప్రణాళిక =సివిల్స్ విజయం | Civil Services Examination | Sakshi
Sakshi News home page

పట్టుదల + ప్రణాళిక =సివిల్స్ విజయం

Published Thu, Jul 9 2015 2:10 AM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM

Civil Services Examination

 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.. ఏటా లక్షల మంది పోటీ పడుతున్న ఈ పరీక్షలో ఎంపికయ్యేది సుమారు 1200 మంది మాత్రమే. వారిలో ఒక్కరిగా నిలవాలంటే కఠోర శ్రమ, పట్టుదల తప్పనిసరి. ఒక్కోసారి ఏళ్ల తరబడి ప్రిపరేషన్ కొనసాగించాల్సి వస్తుంది. ఈ క్రమంలో మూడు సార్లు మధ్యలోనే అపజయం ఎదురైనా పట్టుదలతో నాలుగో ప్రయత్నంలో 66వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు గుంటూరుకు చెందిన మైలవరపు కృష్ణ తేజ. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి, మహిళా సాధికారత, అందరికీ నాణ్యమైన విద్య లక్ష్యంగా దేశానికి తన సేవలు అందిస్తానంటున్న కృష్ణతేజ సక్సెస్ స్టోరీ ఆయన మాటల్లోనే..
 
 మాది గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట. నాన్న శివానంద కుమార్ హోల్‌సేల్ వ్యాపారి. అమ్మ భువనేశ్వరి గృహిణి. పదోతరగతి వరకు స్థానిక పాఠశాలలోనే విద్యనభ్యసించాను. గుంటూరులోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్మీ డియెట్ పూర్తి చేశాను. నర్సారావుపేటలోని ఇంజనీరింగ్ కళాశాల నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాను. చిన్నప్పటి నుంచి నాకు సివిల్స్‌పై ఆసక్తి. దాంతో 2010లో సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించాను. దానికోసమే హైదరాబాద్ వచ్చా. చదివింది ఇంజనీరింగే అయినా జాగ్రఫీ అంటే నాకు ఆసక్తి. సివిల్స్‌లో దాన్నే ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నా. ఆర్‌సీరెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లోనూ జాగ్రఫీ ఫ్యాకల్టీగా చేరాను. రెండేళ్లుగా ఆ సంస్థలోనే సివిల్స్ అభ్యర్థులకూ ఆ సబ్జెక్టును బోధిస్తున్నాను.
 
 ముందుకంటే మెరుగైన ప్రిపరేషన్!
 గతంలో మూడుసార్లు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాసినప్పటికీ మెయిన్స్ దశలోనే వెనుదిరిగాను. అయినా నిరుత్సాహ పడకుండా నాలుగోసారి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నా. రోజుకు సుమారు 9 గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాను. క్రమం తప్పకుండా తెలుగు, ఇంగ్లిష్ పేపర్లు చదివాను. ప్రతిరోజూ కొంత సబ్జెక్టును లక్ష్యంగా నిర్దేశించుకున్నా. వీలైనన్ని ఎక్కువ రాత పరీక్షలు రాశా. ప్రతిభను అంచనా వేసుకుని విశ్లేషించుకున్నా. ఇవన్నీ నాలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించాయి. సిలబస్‌ను పూర్తిగా ఆస్వాదిస్తూ మెరుగ్గా ప్రిపరేషన్ కొనసాగించాను. యోగా చేయడం ద్వారా ఒత్తిడి, అలసట నుంచి బయటపడ్డాను.
 
 చదివిన పుస్తకాలు:
 మెయిన్స్‌లో ఆప్షనల్ సబ్జెక్టు జాగ్రఫీ కోసం కుల్లర్, మాజిద్ హుస్సేన్, జి.సి. లియాంగ్ తదితర పుస్తకాలను చదివాను. జాగ్రఫీ ఆప్షనల్ ఎంచుకున్న వారికి ముఖ్యంగా అట్లాస్‌పై అవగాహన తప్పనిసరి.
 
 స్ఫూర్తి, ప్రోత్సాహం:
 సివిల్ సర్వీసెస్‌లో అడుగుపెట్టేందుకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి వేలూరు నరేంద్రనాథ్ నాకు స్ఫూర్తి. నా గురువు బీజేబీ కృపాదానం, ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ అధికారిణి మల్లవరపు బాలలత సబ్జెక్టు సందేహాలను తీర్చడంతోపాటు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ప్రోత్సహించేవారు. ‘దేశంలోని అత్యున్నత పోటీ పరీక్షలో గెలుపొందడానికి ఈ రోజు ఏం చేశాను’ అని రోజూ పడుకునే ముందు ప్రశ్నించుకోవాలని వారు సూచించిన సలహా నిత్యం నా కర్తవ్యాన్ని గుర్తుచేసేది.
 
 ఇంటర్వ్యూ సాగిందిలా!
 ఎలాంటి ఒత్తిడిలేని, సానుకూల వాతావరణంలో దాదాపు అరగంటసేపు ఇంటర్వ్యూ సాగింది. ఐదుగురు సభ్యులున్న మన్‌బీర్‌సింగ్ బోర్డు ఇంటర్వ్యూ నిర్వహించింది. విభిన్న అంశాలపై లోతుగా ప్రశ్నలు అడిగారు. ఒక్కోదానిపై వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు అడగడం ద్వారా ఆయా అంశా ల్లో నా పరిజ్ఞానం ఎంతో పరీక్షించారు. కేవలం మేక్ ఇన్ ఇండియాపైనే సుమారు 7 ప్రశ్నలు అడిగారు. అన్ని ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలిచ్చాను.
 
 అడిగిన ప్రశ్నలు:
 జీఎస్‌టీ (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) అంటే ఏమిటి? కేంద్ర ప్రభుత్వాలు ఈ విషయంలో రాష్ట్రాలను ఎలా పరిరక్షించాలని నువ్వు అనుకుంటున్నావు?
 లీ క్యుయాంగ్ హ్యూ ఎవరు? సింగపూర్‌లో ఆయన చేసిన పబ్లిక్ పాలసీని వివరించు? ఆయన విధానాలను నువ్వు సమ్మతిస్తావా?
 
 పొగాకు పంటను నిషేధించడాన్ని నువ్వు సమ్మతిస్తావా? గుంటూరులో పొగాకు పండించడం సమంజసమేనా?
 మహిళ సాధికారత అంటే ఏంటి? ఉద్యోగినులకు ఉన్న బాధ్యతలు ఏంటి? పిల్లలను బేబీకేర్ సెంటర్లలో ఉంచి తల్లి ఉద్యోగాలకు వెళ్లడం ఎంత వరకు సమంజసం?
 మేక్ ఇన్ ఇండియా అంటే ఏమిటి? దాన్ని ఏ విధంగా సక్సెస్ చేయగలవు?
 
 ఎవరికైనా సాధ్యమే!
 సివిల్స్ చాలా కష్టసాధ్యమైన పరీక్ష. కానీ అసాధ్యం కాదు. కష్టపడి చదివితే సాధారణ విద్యార్థులు సైతం విజేతలుగా నిలవొచ్చు. సివిల్స్ సిలబస్ సముద్రంలా విస్తృతమైంది. అంతా చదివేయాలని తొందరపడొద్దు. ఎందుకంటే అన్ని సబ్జెక్టుల్లో ఎవరూ వంద శాతం మాస్టర్ కాలేరు. టెక్నిక్స్ తెలుసుకుని చదవాలి. కోచింగ్ తీసుకుంటే చాలా వరకు శ్రమ తగ్గుతుంది. విస్తృతమైన సబ్జెక్టుపై అవగాహన ఏర్పడుతుంది. తెలుగు మీడియంలో సివిల్స్‌కు సన్నద్ధమయ్యేవారు ముందు నుంచే సొంత నోట్సును ప్రిపేర్ చేసుకోవాలి. మార్కెట్‌లో మెటీరియల్ అందుబాటులో ఉండే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ తదితర ఆప్షనల్స్‌ను ఎంచుకోవడం మంచిది.  
 
 లక్ష్యం:
 సోషల్ సర్వీస్‌పై నాకు ముందునుంచీ ఆసక్తి ఎక్కువ. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి, మహిళా సాధికారత, అందరికీ నాణ్యమైన విద్య లక్ష్యంగా పనిచేస్తాను.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement