దేశ వ్యాప్తంగా లక్షల మంది పోటీపడే ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియకు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ తదితర అత్యున్నత సర్వీసుల్లో పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ.. ఇలా మూడంచెల్లో వడపోత ఉంటుంది. తొలి దశ ప్రిలిమినరీకి యూపీఎస్‌సీ క్యాలెండర్ ప్రకారం- మే 16న నోటిఫికేషన్ వెలువడనుంది. ఇప్పటికే ఏళ్లుగా ప్రిపరేషన్ సాగిస్తున్న అభ్యర్థులతోపాటు తాజా గ్రాడ్యుయేట్లు సైతం గురిపెట్టిన సివిల్స్‌లో విజయానికి నిపుణులు అందిస్తున్న సలహాలు.. సూచనలు..
ప్రాథమిక అంశాలపై పట్టు.. వర్తమాన వ్యవహారాలపై అవగాహన.. తులనాత్మక అధ్యయనం.. విశ్లేషణాత్మక దృక్పథం.. ఇవీ సివిల్స్ ఔత్సాహికులకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలన్నది నిపుణుల మాట! పరీక్షకు సంబంధించి న సిలబస్‌లోని అంశాల కాన్సెప్ట్స్ మొదలు వాటికి సంబంధించిన సమకాలీన పరిణామాల వరకు అన్నిటిపై సమగ్ర అవగాహన పెంచుకుంటూ శాస్త్రీయంగా అడుగులు వేయాలి. అప్పుడే విజయం దరిచేరుతుందని నిపుణులు చెబుతున్నారు.
సిలబస్ అధ్యయనం
సివిల్స్ ఔత్సాహిక అభ్యర్థులు ప్రిపరేషన్‌లో భాగంగా మొదట చేయాల్సిన పని సిలబస్ అధ్యయనం. నిర్దేశిత సిలబస్‌ను ఆసాంతం క్షుణ్నంగా పరిశీలించాలి. ముఖ్యంగా మొదటిసారి పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది చాలా అవసరం. సిలబస్ పరిశీలన ద్వారా తమకు అవగాహన ఉన్న అంశాలేవి? పూర్తిస్థాయిలో దృష్టిసారించాల్సిన అంశాలేవి? అనేది తెలుస్తుంది. ఇది ప్రిపరేషన్‌కు ఎంతగానో ఉపకరిస్తుంది. ఇప్పటికే పరీక్షకు హాజరై విఫలమై, మరోసారి ప్రయత్నిస్తున్న అభ్యర్థులు కూడా సిలబస్‌ను పరిశీలించాలి. గత పరీక్షల్లో తమ ప్రదర్శనను బేరీజు వేసుకోవాలి. సిలబస్‌లో ఏ అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు సరిగా సమాధానాలు ఇవ్వలేకపోయారో గుర్తించాలి. తాజా ప్రిపరేషన్‌లో వాటికి కొంత అధిక సమయం కేటాయించాలి. సిలబస్ పరిశీలన ఆధారంగా అవగాహన లేని అంశాలను లోతుగా అధ్యయనం చేసే విషయంలో ఒక అంచనాకు రావాలి.
ఆందోళన అనవసరం
సివిల్స్ పరీక్షలో సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ.. ఇలా అన్ని నేపథ్యాల అంశాలు ఉంటాయి. దీంతో పరీక్షకు పోటీపడే ప్రతి అభ్యర్థి తమ అకడమిక్ నేపథ్యానికి సంబంధంలేని అంశాల్లో కొంత ఆందోళన చెందుతుంటారు. ఉదాహరణకు ఆర్ట్స్ విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ; సైన్స్ విద్యార్థులు జనరల్ నాలెడ్జ్‌లోని పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీలకు ప్రిపరేషన్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సిలబస్‌లో పేర్కొన్న అంశాలన్నీ గ్రాడ్యుయేషన్ స్థాయిలోనే ఉంటున్నాయి. కాబట్టి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో తమ అకడమిక్ నేపథ్యం లేని అంశాలకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలి. రోజుకు పది నుంచి పన్నెండు గంటల పాటు ప్రిపరేషన్ సాగించే అభ్యర్థులు తమకు పరిచయం లేని అంశాలకు కనీసం మూడు గంటలు కేటాయించాలి.
గత ప్రశ్నపత్రాల పరిశీలన
సివిల్స్ ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చే మరో సాధనం.. గత ప్రశ్నపత్రాల పరిశీలన. దీని ద్వారా ప్రధానంగా ప్రశ్నల శైలి అర్థమవుతుంది. సివిల్స్ పరీక్షలో ఇటీవల కాలంలో నేరుగా వస్తున్న ప్రశ్నలు తగ్గాయి. పరోక్ష లేదా విశ్లేషణాత్మక దృక్పథాన్ని, నిర్దిష్ట అంశంలో పూర్తిస్థాయి పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నలు వస్తున్నాయి. ఈ క్రమంలో స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలు, అసెర్షన్ అండ్ రీజన్ ప్రశ్నలకు వెయిటేజీ పెరుగుతోంది.
ఉదాహరణకు..
Which of the following is/are the function/ functions of the cabinet Secretariat?
1) Preparation of agenda for cabinet meetings
2) Secretarial assistance to Cabinet committees
3) Allocation of financial resources to the ministers
Select the correct answers using the code given below
a) 1 b) 2 and 3 only
c) 1 and 2 only d) 1, 2 and 3
Ans: c
ఈ ప్రశ్నను పరిశీలిస్తే కేబినెట్ సెక్రటేరియట్ స్వరూపంతోపాటు విధులు గురించి పూర్తిస్థాయి అవగాహన ఉంటేనే సమాధానం ఇవ్వగలరు. కాబట్టి గత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా ఒక అంశం నుంచి ఎన్ని కోణాల్లో ప్రశ్నలు ఎదురుకావొచ్చో తెలుస్తుంది. దాని ఆధారంగా ప్రిపరేషన్‌లో అనుసరించాల్సిన వ్యూహాలను రూపొందించుకోవాలి.
మెటీరియల్ ఎంపిక
సివిల్స్ విజయంలో మెటీరియల్ ఎంపికది ఎంతో కీలక పాత్ర. ప్రస్తుతం ఒక సబ్జెక్ట్‌కు సంబంధించి పదుల సంఖ్య లో పుస్తకాలు, వెబ్ రిసోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఆయా పుస్తకాలను ఎంపిక చేసుకునే ముందు సిలబస్‌లోని అన్ని అంశాలు ఉన్నాయా? లేవా? ఉంటే నిర్దిష్ట అంశంపై అన్ని కోణాల్లో సమాచారం ఉందా? అనేది పరిశీలించాలి. సమగ్ర సమాచారం ఉన్న మెటీరియల్‌నే ఎంపిక చేసుకోవాలి. ఆయా అంశాలపై విశ్లేషణాత్మక సమాచారం ఉన్న పుస్తకాలను ఎంచుకోవాలి. ఫలితంగా ప్రిలిమ్స్‌కు సమాంతరంగా మెయిన్స్‌కు సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది. గైడ్లు, ప్రశ్న-సమాధానం తరహా పుస్తకాలకు ప్రాధాన్యమివ్వడం సరికాదు.
ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్
ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ రెండు దశల రాత పరీక్షల్లో (ప్రిలిమ్స్, మెయిన్స్) అభ్యర్థులకు కలిసొచ్చే అంశం పరీక్ష విధానం. మెయిన్ ఎగ్జామినేషన్‌లో రెండు పేపర్లుగా ఉండే ఒక ఆప్షనల్ సబ్జెక్ట్, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ సబ్జెక్ట్‌లు మినహా మిగతా అన్ని విభాగాలు కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలోనూ ఉమ్మడి అంశాలే. దీన్ని అభ్యర్థులు తమకు అనుకూలంగా మలచుకోవాలి. ఒక అంశాన్ని విశ్లేషణాత్మకంగా, డిస్క్రిప్టివ్ విధానంలో చదివితే ఒకే సమయంలో ప్రిలిమ్స్, మెయిన్స్ రెండిటికీ సన్నద్ధత లభిస్తుంది.
సమకాలీన అంశాలతో..
సివిల్స్ ఔత్సాహిక అభ్యర్థులు ప్రాథమిక (కాన్సెప్ట్స్) అంశాలను సమకాలీన (కాంటెంపరరీ) పరిణామాలతో బేరీజు వేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. గత కొన్నేళ్లుగా సివిల్స్ ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. సమకాలీనంగా చోటు చేసుకున్న అంశాల నేపథ్యంపై అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటున్నాయి. ఉదాహరణకు పార్లమెంట్ ఏదైనా రాజ్యంగ సవరణ చేస్తే రాజ్యాంగంలో ప్రకరణల సవరణకు పార్లమెంటుకున్న అధికారాలు, తాజా సవరణ ఏ ప్రకరణ పరిధిలోనిది లేదా ఇది ఎన్నో సవరణ వంటి ప్రశ్నలు ఎదురుకావచ్చు.
అంతర్గత సంబంధం
సివిల్స్ ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులు అనుసరించాల్సిన మరో వ్యూహం అంతర్గత సంబంధం ఉన్న సబ్జెక్ట్‌లు లేదా అంశాలను గుర్తించి తులనాత్మక అధ్యయనం సాగించడం. ప్రస్తుత సిలబస్ ప్రకారం ఎకానమీ-పాలిటీ, జాగ్రఫీ-ఎన్విరాన్‌మెంట్-బయో డైవర్సిటీ అంశాలు అంతర్గత సంబంధం ఉన్నవిగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఎఫ్‌డీఐల బిల్లు ఎకానమీ పరిధిలోకి రాగా.. దాని ఆమోద ప్రక్రియ పాలిటీ పరిధిలోకి వస్తుంది. ఇలాంటి వాటిని గుర్తించి చదివితే అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉంటుంది.
ప్రతి సబ్జెక్ట్‌కు సమప్రాధాన్యం
సివిల్స్ పరీక్షల శైలిని పరిశీలిస్తే ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు పరీక్షల్లో పేర్కొన్న ప్రతి సబ్జెక్ట్‌కు సమ ప్రాధాన్యం కనిపిస్తోంది. కొంతమంది అభ్యర్థులు తమకు ఇష్టంగా అనిపించిన లేదా సులువుగా భావించిన సబ్జెక్ట్‌లకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఈ విధానం సరికాదు. ప్రిపరేషన్ సమయంలో అన్ని అంశాలను చదివేలా సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి.
ప్రస్తుత సమయంలో ఇలా
సివిల్ సర్వీసెస్-2015 ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు 23న, మెయిన్ ఎగ్జామినేషన్స్ డిసెంబర్ 18 నుంచి జరగనున్నాయి. అభ్యర్థులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా టైంమేనేజ్‌మెంట్ పాటిం చాలి. జూన్ 30వరకు ప్రిలిమ్స్, మెయిన్స్‌లకు ఉమ్మడి ప్రిపరేషన్ సాగించాలి. జూలై నుంచి పూర్తిగా ప్రిలిమినరీ పరీక్ష కు కేటాయించాలి. జూలై నుంచి ఆగస్ట్ 10 మధ్యలో కనీసం మూడు, నాలుగు మోడల్ టెస్ట్‌లు లేదా గ్రాండ్ టెస్ట్‌లకు హాజరై తమ బలాలు, బలహీనతలు బేరీజు వేసుకోవాలి.
ప్రిలిమ్స్ రెండో పేపర్
సివిల్స్ ప్రిలిమ్స్‌లోని రెండో పేపర్ (సీ-శాట్) విషయంలో అభ్యర్థులు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ఇది మ్యాథ్స్ నేపథ్యం ఉన్నవారికే అనుకూలంగా ఉందని, ఫలితంగా తమ విజయావకాశాలు తగ్గిపోతున్నాయని నాన్-మ్యాథ్స్ అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి పదో తరగతి వరకు మ్యాథమెటిక్స్‌లో మెరుగ్గా ఉన్న అభ్యర్థులు సులభంగానే ఈ పేపర్‌లోని న్యూమరికల్ ఎబిలిటీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వొచ్చు అనేది నిపుణుల అభిప్రాయం. అదే విధంగా ఒక సమస్యను పరిశీలించడం, దాన్ని వాస్తవ ప్రభావాన్ని అంచనా వేయగలిగే సామర్థ్యాల ఆధారంగా డెసిషన్ మేకింగ్ విభాగం ప్రశ్నలకు కూడా సులువుగా సమాధానాలు గుర్తించవచ్చు
ఆందోళన వీడితే
విజయానికి చేరువగా
సివిల్స్ ఔత్సాహిక అభ్యర్థులు ముందుగా ఈ పరీక్షకు లక్షల మంది పోటీ పడతారని, తాము వారికి సరితూగగలమా అనే ఆందోళనతో ఉంటారు. ముందుగా దీన్ని వదులుకుంటే మానసికంగా విజయానికి చేరువ అయినట్లే. ప్రిలిమ్స్‌లో విజయానికి పుస్తకాల ఎంపిక ఎంతో కీలకం. ఈ విషయంలోనూ జాగ్రత్త వహించాలి. సరైన పుస్తకాలను ఎంపిక చేసుకోవాలి. ఇందుకోసం సీనియర్లు, సబ్జెక్ట్ నిపుణుల సలహాలు తీసుకోవాలి. ప్రిపరేషన్ పరంగా తులనాత్మక అధ్యయనం అలవర్చుకోవడం ఎంతో ప్రధానం. ఫలితంగా విభిన్న అంశాలపై అవగాహన లభిస్తుంది. ప్రస్తుత సమయంలో తాజా అభ్యర్థులు రెండు నెలలు మాత్రం ప్రిలిమ్స్, మెయిన్స్ ఉమ్మడి ప్రిపరేషన్ సాగించి తర్వాత పూర్తిగా ప్రిలిమినరీకి కేటాయించడం ద్వారా సత్ఫలితాలు ఆశించొచ్చు.
- మహ్మద్ ముషరగ్ అలీ ఫరూకీ,
సివిల్స్-2014 విజేత (జాతీయ ర్యాంకు 80).
సిలబస్‌లోని అన్ని అంశాలపైనా దృష్టిసారించాలి
సాధారణంగా అభ్యర్థులు చేసే పొరపాటు ముఖ్యమైనవి ఏమిటి? ప్రాధాన్యం లేనివి ఏమిటి? అని ఆలోచించడం! కానీ, పోటీ పరీక్షల్లో ముఖ్యంగా సివిల్స్ వంటి అత్యున్నత పరీక్షకు సన్నద్ధత క్రమంలో ఇంపార్టెంట్, నాన్-ఇంపార్టెంట్ అని ఆలోచించే ధోరణి ఏమాత్రం సరికాదు. సిలబస్‌లో పేర్కొన్న అన్ని అంశాలు కవర్ అయ్యేలా అధ్యయనం చేయాలి. ప్రతి యూనిట్‌ను కనీసం మూడుసార్లు చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. అన్ని అంశాల్లో మాస్టర్స్ కాలేకపోయినా వాటి ప్రాథమిక విషయాలను ఒంటబట్టించుకుంటే విజయావకాశాలు పెరుగుతాయి.
- శ్రీరంగం శ్రీరామ్,
శ్రీరామ్స్ ఐఏఎస్, న్యూఢిల్లీ.
సివిల్స్ సమరానికి సన్నద్ధమవ్వండిలా..
Published Thu, May 14 2015 5:11 AM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM
Advertisement