ఐఎఫ్‌ఎస్ ఎగ్జామ్..మెయిన్స్‌లో మెరుపులకు..
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్.. సివిల్ సర్వీసెస్ తర్వాత అత్యంత ప్రాధాన్యం కలిగిన పరీక్ష. అటవీ శాఖలో డివిజనల్ స్థాయి అధికారి హోదాతో కెరీర్ ప్రారంభించేందుకు మార్గం. ఇటీవల ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమినరీ ఫలితాలు వెల్లడయ్యాయి. మెయిన్ పరీక్షలు నవంబర్ 12 నుంచి జరగనున్నాయి.ఈ క్రమంలో మెయిన్‌లో విజయం సాధించి, తుదిదశ ఇంటర్వ్యూకు చేరుకునేందుకు వ్యూహాలు..
ప్రస్తుతం ఐఎఫ్‌ఎస్ మెయిన్ ఎగ్జామినేషన్‌లో రెండు ఆప్షనల్ సబ్జెక్టులకు సంబంధించిన నాలుగు పేపర్లు (ఒక్కో సబ్జెక్ట్‌లో రెండు పేపర్లు) రాయాల్సి ఉంటుంది. సాధారణంగా ఔత్సాహిక అభ్యర్థులు ఒక ఆప్షనల్‌ను తమ అకడమిక్ నేపథ్యం నుంచి ఎంపిక చేసుకుంటారు. మరో ఆప్షనల్ పూర్తిగా కొత్త సబ్జెక్టు. యూపీఎస్సీ నిబంధన కూడా ఇదే రీతిలో ఉంది. ఒకే స్వరూపం ఉండే సబ్జెక్ట్‌లనే రెండు ఆప్షనల్స్‌గా తీసుకోకూడదని నిబంధన విధించింది. ఉదాహరణకు అగ్రికల్చర్ సబ్జెక్ట్‌ను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకున్న అభ్యర్థులు రెండో ఆప్షనల్‌గా అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌ను ఎంపిక చేసుకునేందుకు వీల్లేదు. అదే విధంగా బీటెక్ అర్హతతో పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు రెండు ఆప్షనల్స్‌ను ఇంజనీరింగ్ నేపథ్యం సబ్జెక్టుల నుంచి ఎంపిక చేసుకోకూడదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని, అభ్యర్థులు ముందుగా తమ అకడమిక్ నేపథ్యానికి సంబంధంలేని, కొత్తగా ఎంపిక చేసుకున్న సబ్జెక్టుతో మెయిన్స్ ప్రిపరేషన్ ప్రారంభించాలి.
అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో..
అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో అప్లికేషన్ ఓరియెంటేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. సబ్జెక్టుకు సంబంధించిన బేసిక్స్, కాన్సెప్టులపై పట్టు సాధిస్తూనే వాటిని వాస్తవ పరిస్థితుల్లో అన్వయించే విధంగా నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ముఖ్యంగా జియాలజీ, సివిల్ ఇంజనీరింగ్, జువాలజీ సబ్జెక్టులను ఆప్షనల్స్‌గా ఎంపిక చేసుకున్న వారికి ఇది అత్యంత ఆవశ్యకం. ఆయా రంగాల్లో తాజా పరిణామాల గురించి తెలుసుకుంటూ వాటికి సబ్జెక్టు నేపథ్యాన్ని అన్వయించే నైపుణ్యంతో ముందుకు సాగాలి.
ఫ్లో చార్ట్స్, పై చార్ట్స్, డయాగ్రమ్స్...
ప్రిపరేషన్ సమయంలో అభ్యర్థులు తాము చదివే అంశాలను ఫ్లో చార్ట్స్, పై చార్ట్స్, డయాగ్రమ్స్ రూపంలో షార్ట్‌కట్ మెథడ్‌లో సొంత నోట్స్ రూపొందించుకోవాలి. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్, జువాలజీ, బోటనీ సబ్జెక్టులకు ఇది ఎంతో ఉపకరిస్తుంది. రివిజన్ పరంగా సమయం ఆదా అవుతుంది.
జీకే.. జనరల్‌గా...
ఐఎఫ్‌ఎస్ మెయిన్ ఎగ్జామినేషన్‌లో అభ్యర్థులు బాగా దృష్టిసారించాల్సిన పేపర్ జనరల్ నాలెడ్జ్. ఇందులో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ తదితర కోర్ సబ్జెక్టుల నుంచి కాంటెంపరరీ అంశాల వరకు అన్నింటిపైనా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు ఆయా సబ్జెక్టులకు సంబంధించి బేసిక్స్‌పై అవగాహన ఏర్పరచుకుంటూ.. ప్రస్తుతం సంబంధిత విభాగాల్లో జరుగుతున్న పరిణామాలను విశ్లేషించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి.
రైటింగ్ ప్రాక్టీస్..
ప్రిపరేషన్ పరంగా అనుసరించాల్సిన మరో వ్యూహం రైటింగ్ ప్రాక్టీస్. అభ్యర్థులు ప్రతిరోజూ ఒక సబ్జెక్ట్‌కు సంబంధించి ఒక అంశాన్ని చదవడం పూర్తిచేశాక.. దాన్ని ‘ప్రశ్న - సమాధానం’ కోణంలో స్వయంగా విశ్లేషిస్తూ రాయాలి. దీనివల్ల తాము ఆ అంశానికి సంబంధించి ఏ స్థాయిలో ప్రిపరేషన్ సాగించామో తెలుస్తుంది.
అన్ని సబ్జెక్టులకు సమయం కేటాయించేలా...
ప్రిపరేషన్ సమయంలో అన్ని సబ్జెక్టులకు సమయం కేటాయించేలా టైం టేబుల్ రూపొందించుకోవాలి. కనీసం రోజుకు పది గంటలు చదవాలి. అక్టోబర్ చివరి వారం నాటికి సబ్జెక్ట్స్ ప్రిపరేషన్ పూర్తి చేసుకుని.. తర్వాత రివిజన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
సివిల్స్ మెయిన్స్‌కు కూడా
అర్హత లభిస్తే...
సివిల్ సర్వీసెస్, ఐఎఫ్‌ఎస్ రెండింటికీ ప్రిలిమ్స్ పరీక్ష ఒకటే ఉంటుంది. ఈ క్రమంలో అధిక శాతం మంది అభ్యర్థులు ఐఎఫ్‌ఎస్‌తోపాటు సివిల్స్ వైపు కూడా దృష్టి పెడుతున్నారు. ఐఎఫ్‌ఎస్‌తోపాటు సివిల్స్ మెయిన్స్‌కు సైతం అర్హత సాధించిన అభ్యర్థులు.. ప్రస్తుత సమయాన్ని పూర్తిగా ఐఎఫ్‌ఎస్ ప్రిపరేషన్‌కే కేటాయించాలి. ఆప్షనల్ పరంగా రెండు పరీక్షలకు ఒకే సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకున్న అభ్యర్థులు.. రెండు పరీక్షల సిలబస్‌ను బేరీజు వేసుకుంటూ ప్రిపరేషన్ సాగిస్తే ఫలవంతంగా ఉంటుంది.