సివిల్స్ అర్హత నిబంధనలు మారనున్నాయా? | Terms of eligible Civils | Sakshi
Sakshi News home page

సివిల్స్ అర్హత నిబంధనలు మారనున్నాయా?

Published Thu, Nov 20 2014 12:18 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

సివిల్స్ అర్హత నిబంధనలు మారనున్నాయా? - Sakshi

సివిల్స్ అర్హత నిబంధనలు మారనున్నాయా?

ఐఏఎస్.. ఐపీఎస్.. ఐఎఫ్‌ఎస్ వంటి అత్యున్నత సర్వీసుల ఎంపిక నిబంధనలు  మారనున్నాయా..! లక్షల మంది అభ్యర్థుల ఆశలు.. అడియాశలు కానున్నాయా?  సివిల్స్ స్వప్నం.. స్వప్నంగానే మిగిలిపోనుందా?! పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ వెబ్‌సైట్‌లో ప్రచురించిన విషయాలు.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. రెండో పాలన సంస్కరణల సంఘం.. సివిల్ సర్వీసెస్ పరీక్షకు సంబంధించి గరిష్ట వయోపరిమితి, అటెంప్ట్‌ల కుదింపు వంటి సిఫార్సులను చేసింది. వీటిని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు మీడియాలో వస్తున్న కథనాలు దేశ వ్యాప్తంగా లక్షల మంది అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
 
 రెండో ఏఆర్‌సీ సిఫార్సులు.. ప్రభుత్వ నిర్ణయాలు
 వయో పరిమితి:
 ఏఆర్‌సీ సిఫార్సులు: పరీక్ష జరిగే సంవత్సరంలో ఆగస్ట్ ఒకటో తేదీ నాటికి జనరల్ కేటగిరీ అభ్యర్థులు 21 నుంచి 25 ఏళ్లు; ఓబీసీ అభ్యర్థులు 21 నుంచి 28 ఏళ్లు; ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులు 21 నుంచి 29 ఏళ్ల మధ్యలో ఉండాలి.
 
 ప్రభుత్వ నిర్ణయం: జనరల్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ట వయో పరిమితి 26 ఏళ్లకు పెంచింది. ఓబీసీ అభ్యర్థులు 21 నుంచి 28 ఏళ్లు; ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులు 21 నుంచి 29 ఏళ్ల మధ్యలో ఉండాలి.. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకు మాత్రం అన్ని కేటగిరీల్లో రెండేళ్ల సడలింపు ఇవ్వాలని నిర్ణయించింది.
 
 అటెంప్ట్‌లు:
 ఏఆర్‌సీ సిఫార్సులు: జనరల్ కేటగిరీ అభ్యర్థులకు మూడు; ఓబీసీ వర్గానికి అయిదు; ఎస్సీ/ఎస్టీ వర్గాలకు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకు ఆరు అటెంప్ట్‌లు ఉండాలని సిఫార్సు చేసింది.
 
 ప్రభుత్వ నిర్ణయం: వీటిని యథాతథంగా అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకు మాత్రం రెండేళ్ల అదనపు అటెంప్ట్‌ల సదుపాయం కల్పించింది.
 
పరీక్ష విధానంపై ఏమన్నారు?
రెడో ఏఆర్‌సీ: పరీక్ష కు సంబంధించి రెండు విధానాలను సిఫార్సు చేసి.. రెండింటిలో ఏదో ఒకదాన్ని అమలు చేయాలని పేర్కొంది. అవి..
 
 విధానం1: ప్రిలిమినరీ, మెయిన్స్ ఎగ్జామినేషన్స్‌లు వరుసగా రెండు లేదా మూడు రోజుల్లో నిర్వహించాలి. ఖాళీల మేరకు ప్రిలిమ్స్‌కు నిర్దేశిత కటాఫ్ అనుసరించి వాటిని సాధించిన అభ్యర్థులనే మెయిన్స్ మూల్యాంకనలో పరిగణనలోకి తీసుకోవాలి. ఆ తర్వాత పర్సనాలిటీ టెస్ట్ నిర్వహించాలి.
 
 విధానం 2: ముందుగా ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించాలి. నిర్దేశిత కటాఫ్ ప్రకారం అర్హులైన అభ్యర్థులను మెయిన్ ఎగ్జామినేషన్‌కు అనుమతించాలి. ర్యాంకుల ఆధారంగా.. ఖాళీలను పరిగణనలోకి తీసుకుని 1:2 లేదా 3 నిష్పత్తిలో పర్సనాలిటీ టెస్ట్‌కు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయాలి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ముగిసిన రెండు నెలల్లోపు మెయిన్ ఎగ్జామినేషన్స్ నిర్వహించాలి.
 
 పరీక్ష ప్యాట్రన్:
 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌ను జనరల్ స్టడీస్ అంశాలపై ఒకటి లేదా రెండు పేపర్లలో నిర్వహించాలి. భారత రాజ్యాంగం, భారత న్యాయ వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ, పాలిటీ, చరిత్ర, సంస్కృతి అంశాలను సిలబస్‌లో చేర్చాలి. ప్రిలిమినరీ స్థాయిలో ఎలాంటి ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండకూడదు.
 
 మెయిన్ ఎగ్జామినేషన్‌ను కేవలం రెండు పేపర్లలో... కంపల్సరీ సబ్జెక్ట్స్‌గా డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించాలి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో పేర్కొన్న సిలబస్ అంశాలనే ఈ కంపల్సరీ సబ్జెక్ట్స్‌కు సిలబస్‌గా నిర్దేశించాలి. ఈ రెండు పేపర్లకు అదనంగా ఎస్సే పేపర్‌ను నిర్వహించాలి.
 
 ప్రభుత్వ నిర్ణయం: ఇటీవలే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల విధానంలో మార్పులు చేసిన ప్రభుత్వం ఈ విషయంలో ఏఆర్‌సీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోలేదు. ప్రస్తుతమున్న విధానాన్నే (సీశాట్, మెయిన్స్) కొనసాగించాలని నిర్ణయించింది.
 
 ఇప్పటివరకూ ఇలా..
 
 గత ప్రభుత్వం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కు హాజరయ్యే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 30 ఏళ్ల నుంచి 32 ఏళ్లకు, అటెంప్ట్‌ల సంఖ్యను కూడా 4 నుంచి ఆరుకు పెంచుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 10న నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి, అటెంప్ట్‌ల సంఖ్య కూడా పెరిగింది. ఓబీసీ వర్గాలకు ఏడు నుంచి తొమ్మిదిసార్లకు; ఎస్సీ/ఎస్టీలకు ఎలాంటి పరిమితి లేదు. ఇది దేశంలో లక్షల మంది అభ్యర్థుల్లో ఆనందోత్సాహాలు నింపింది.
 
 ఇప్పుడు ఆందోళన ఎందుకు?..
 
 2014 ఆగస్ట్ 24న నిర్వహించిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌కు దేశవ్యాప్తంగా మూడు లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 30 వేలకుపైగా పరీక్ష రాశారు. కానీ తాజా నిర్ణయంతో అన్ని వర్గాల అభ్యర్థుల ఆందోళన చెందుతున్నారు. సివిల్స్ సిలబస్‌పై అవగాహన పొందడానికే చాలా సమయం పడుతుంది. కాబట్టి తాజా మార్పులు అమలైతే.. సివిల్స్ అవకాశం చేజారడమే కాకుండా.. కోర్ ఫీల్డ్‌లో తిరిగి ఉద్యోగం పొందడానికి ఇబ్బందులు ఎదురవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. యువతకు ఉపాధి కల్పించే అంశాల్లో ఇలాంటి నిర్ణయాలు సరికాదని, వారి భవిష్యత్తును పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు, అభ్యర్థులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
 
 నిపుణుల మాట..
డీఓపీటీ ప్రకటనకు కట్టుబడి ఉండాలి
 
సివిల్స్ ఎంపిక విధానంలో మార్పులు తేవాలని, అందుకు రెండో ఏఆర్‌సీ సిఫార్సులను ఇప్పటికిప్పుడు అమలు చేయాలనే కేంద్ర ప్రభుత్వ యోచన సరికాదు. వాస్తవానికి 2018 వరకు సివిల్స్ ఎంపిక ప్రక్రియలో ఎలాంటి మార్పులు ఉండవని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ రెండు నెలల క్రితం స్పష్టం చేసింది. కానీ దీనికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయాలనుకోవడం అహేతుకుం. ప్రస్తుతం మన దేశంలో అమలవుతున్న విద్యా విధానం ప్రకారం.. చాలా మంది విద్యార్థులకు 25 ఏళ్ల వయస్సుకి గానీ సివిల్ సర్వీసెస్ పరీక్షపై అవగాహన రావడం లేదు. కాబట్టి గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లుగా ఉండటమే సమంజసం.  గరిష్ట వయోపరిమితిని 26 ఏళ్లకు కుదించడం అసంబద్ధం. ఈ నిర్ణయం వల్ల గ్రామీణ అభ్యర్థులు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు నష్టపోతారు.
 - శ్రీరంగం శ్రీరామ్,  డెరైక్టర్, శ్రీరామ్స్ ఐఏఎస్ అకాడమీ
 
విలువైన సమయం వృథా అవుతోంది
 
సివిల్ సర్వీసెస్‌కు ఎంపికవడం అనేది నేటి యువతలో ప్రతి ఒక్కరి స్వప్నం. వందల సంఖ్యలో ఉండే పోస్టులకు లక్షల్లో పోటీ పడుతున్నారు. వీరంతా గరిష్ట వయోపరిమితి, అటెంప్ట్‌ల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఏళ్ల తరబడి కృషి చేస్తున్నారు. చివర్లో చిన్నపాటి పొరపాట్ల వల్ల విజయం పొందలేకపోతున్నారు. పర్యవసానంగా జీవితంలో విలువైన సమయం వృథా అవుతోంది. రెండు లేదా మూడు అటెంప్ట్‌లకు పరిమితమై, విజయ సాధ్యాసాధ్యాలను పరిశీలించుకోవాలి. సివిల్ సర్వీసెస్‌లో యంగ్ బ్లడ్‌ను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో రెండో ఏఆర్‌సీ అర్హత నిబంధనలను కఠినం చేసింది. దీనివల్ల విద్యార్థుల్లో ఒక్క సివిల్ సర్వీసే కెరీర్ అనే భావన వీడి, ఇతర అవకాశాల సాధనలో తమ నైపుణ్యాలు ప్రదర్శించడానికి వీలవుతుంది. ఫలితంగా అన్ని రంగాల్లో నిపుణులైన అభ్యర్థులతో నాణ్యత ప్రమాణాలు మెరుగవుతాయి.
 - డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్,  రెండో ఏఆర్‌సీ సభ్యులు, మాజీ ఐఏఎస్ అధికారి
 
 అమలు చేయాలనే నిబంధన లేదు
 
ఏఆర్‌సీ, ఇతర కమిటీలు ఇచ్చిన సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించినట్లు ప్రకటించినా.. అమలు చేయాలనే నిబంధన ఏమీ లేదు. గతంలో సతీష్ చంద్ర కమిటీ వయోపరిమితిని తగ్గించాలని, నెగెటివ్ మార్కింగ్ ప్రవేశపెట్టాలని సూచించినా.. వెంటనే అమలు కాలేదు. కాబట్టి అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా తమ ప్రిపరేషన్‌పై దృష్టిపెట్టాలి.
 -గోపాల కృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ
 
 ఈ అంశంపై పాఠకులు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఈ మెయిల్:
  sakshieducation@gmail.com

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement