ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపులు పూర్తి
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలకు అఖిల భారత స్థాయి అధికారుల కేటాయింపులు పూర్తయ్యాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపుల తుది జాబితాను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. దీంతో దాదాపు పది నెలలుగా జరిగిన కసరత్తు ఎట్టకేలకు ముగిసింది. రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాలకు ఉన్నతాధికారుల తాత్కాలిక కేటాయింపులు జరిగిన సంగతి తెలిసిందే. తర్వాత అధికారుల నుంచి అభ్యంతరాలు తీసుకుని తాత్కాలిక తుది కేటాయింపుల జాబితాను గత డిసెంబర్ 26న కేంద్రం ప్రకటించింది. అనంతరం 45 రోజుల్లోనే తుది జాబితాను ప్రకటించాలని ప్రధాని నరేంద్రమోదీ ఆదేశించినప్పటికీ కొంత ఆలస్యం జరిగింది. వాస్తవానికి గత నెల రెండో వారంలోనే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నా.. వివిధ ఒత్తిళ్ల నేపథ్యంలో తుది కేటాయింపుల జాబితా ప్రకటన ఆలస్యమైంది.
ఎట్టకేలకు సుదీర్ఘ కసరత్తు అనంతరం ఈ తుది జాబితాను తాజాగా కేంద్రం ప్రకటించింది. ఈ కేటాయింపుల ఆధారంగానే అధికారులంతా తమకు దక్కిన రాష్ర్ట కేడర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కేటాయింపులపై ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. క్యాట్‌ను ఆశ్రయించడమో, కోర్టుల్లోనో తేల్చుకోవాల్సి ఉంటుంది. అంతేతప్ప తుది జాబితాలో మార్పుచేర్పులకు ఇక అవకాశం లేదు. అభ్యంతరాలున్న అధికారులు డెప్యూటేషన్‌పై తమకు నచ్చిన రాష్ర్టంలో పనిచేసే అవకాశమున్నా.. అందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. గతంలో ఏపీకి కేటాయించినప్పటికీ తెలంగాణలోనే పనిచేస్తున్న వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, నిజామాబాద్ కలెక్టర్ రొనాల్డ్ రాస్, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ అమ్రపాలీ ఇప్పుడు ఆంధ్రాకు వెళ్లక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. కాగా, గత ఏడాది జూన్ 2 నాటికి పదవిలో ఉన్న వారినందరినీ తుది జాబితాలో కేటాయింపులు చేశారు. ఏపీ నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో సత్యనారాయణ మహంతి, జె.రామానంద్, బి.పి.ఆచార్య, టి.రాధ, షాలినీ మిశ్రా, శాంతికుమారి, జయేష్‌రంజన్, వికాస్‌రాజ్, శ్వేతా మహంతి, ఎస్కే సిన్హా, శశాంక్ గోయల్, రజత్‌కుమార్, జి.అశోక్‌కుమార్, వి.శేషాద్రి, యోగితా రాణా ఉన్నారు. తెలంగాణ నుంచి ఏపీకి దక్కిన వారిలో ఎ.కె. పరీడా, రణదీప్ సూడాన్, విద్యాసాగర్, రొనాల్డ్‌రాస్, వాకాటి కరుణ, ఆమ్రపాలి, పూనం మాలకొండయ్య, సోమేశ్‌కుమార్, ఏపీ సహానీ, రజత్ భార్గవ, అనిల్‌కుమార్ సింఘా ల్, ప్రవీణ్‌ప్రకాశ్, సిద్దార్థ జైన్, ప్రశాంతి ఉన్నారు. కాగా, వీరిలో ఎస్కే సిన్హా, చందనాఖన్, లక్ష్మీపార్థసారథి భాస్కర్, జె. రామానంద్ ఇప్పటికే పదవీవిరమణ చేశారు.
ఐపీఎస్ కేటాయింపుల్లో స్పల్ప మార్పులు
ఐపీఎస్ అధికారుల గత కేటాయింపులతో పోల్చితే తాజాగా ఏపీ నుంచి తెలంగాణకు నలుగురు, తెలంగాణ నుంచి ఏపీకి ఒకరు మారాల్సి వస్తోంది. తాజాగా తెలంగాణకు కేటాయించిన ఐపీఎస్‌ల సంఖ్య 92 నుంచి 95కి పెరిగింది. గతంలో తెలంగాణకు కేటాయించినప్పటికీ, తాత్కాలిక ప్రాతిపదికన ఏపీ నిఘా విభాగం చీఫ్‌గా కొనసాగుతున్న అదనపు డీజీ ఏఆర్ అనురాధను కేంద్రం ఏపీకే కేటాయించింది. ఇక ఏపీ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ అదనపు డీజీ ఈష్ కుమార్, తాత్కాలిక కేటాయింపులో తెలంగాణకే వచ్చి ఇక్కడే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ చీఫ్‌గా పని చేస్తున్న మహేష్ మురళీధర్ భగవత్, కేంద్ర సర్వీసుల్లో ఉన్న విజయ్‌కుమార్, గుంటూరు అర్బన్ ఎస్పీగా పనిచేస్తున్న రాజేష్‌కుమార్ కూడా తెలంగాణ కేడర్‌కే వచ్చారు. ప్రస్తుతం డిప్యుటేషన్‌పై సీఆర్పీఎఫ్ స్పెషల్ డెరైక్టర్‌గా పని చేస్తున్న కోడె దుర్గాప్రసాద్ కేటాయింపులో ఏ మార్పులేదు. గతంలో ఆయ న్ను తెలంగాణకు కేటాయించినప్పటికీ దుర్గాప్రసాద్ ఏపీ కేడర్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపినట్లు వార్తలొచ్చాయి. మాజీ డీజీపీ ఏకే మహంతి కుమారులైన అవినాష్ మహంతి, అభిషేక్ మహంతి ఇరు రాష్ట్రాలకూ చెరొకరు వచ్చారు. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా పనిచేస్తున్న అవినాష్ తెలంగాణ క్యాడర్‌కు, విజయవాడ ఏసీపీగా విధు లు నిర్వర్తిస్తున్న అభిషేక్ మహంతి ఏపీకే కొనసాగనున్నారు. ఉమ్మడి ఏపీలో ఉన్న 256 ఐపీఎస్ పోస్టుల పంపకంలో భాగంగా, ఏపీకి 144 పోస్టులు, తెలంగాణకు 112 పోస్టులు వచ్చాయి. తాజా కేటాయింపుల తర్వాత కూడా తెలంగాణకు 17 మంది అధికారులు తక్కువయ్యారు. తుది కేటాయింపులకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్రం త్వరలో విడుదల చేయనుంది. ఐఎఫ్‌ఎస్ అధికారుల తుది కేటాయింపుల ప్రకారం తెలంగాణకు 58 మంది, ఏపీకి 69 మంది వచ్చారు. తెలంగాణ కేడర్‌కు కేటాయించిన ఐఎఫ్‌ఎస్‌ల సంఖ్య 56 నుంచి 58కి పెరిగింది. ఏపీ కేడర్‌లో ఈ సంఖ్య 71 నుంచి 69కి తగ్గింది. ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే వారిలో ఎం.రామ్ ప్రసాద్, హరీశ్చంద్ర మిశ్రా, సురేశ్ నగేష్ జాదవ్, బీహెచ్.బసివి రెడ్డి, సోని బాలాదేవి, షఫీయుల్లా వున్నారు. తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి మారుతున్న వారిలో పి.మల్లికార్జున రావు, రాహుల్ పాండే, సి.సెల్వం, సుబ్బా రాఘవయ్య ఉన్నారు.