మెయిన్స్‌లో విజయానికి వ్యూహాలు | Mains strategies for success | Sakshi
Sakshi News home page

మెయిన్స్‌లో విజయానికి వ్యూహాలు

Published Thu, Oct 23 2014 4:34 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 PM

మెయిన్స్‌లో విజయానికి వ్యూహాలు

మెయిన్స్‌లో విజయానికి వ్యూహాలు

 ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి అత్యున్నత సర్వీసుల్లో అడుగుపెట్టి వ్యక్తిగత వికాసంతో పాటు సామాజిక అభివృద్ధికి బాసటగా నిలిచే భాగ్యం కోసం సివిల్ సర్వీసెస్ రాస్తుంటారు. ఇలాంటి లక్ష్యంతో 2014 సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్‌కు హాజరైన లక్షల మందిలో విజయాన్ని అందుకున్నది కొందరే! ఇక రెండో మెట్టు మెయిన్స్.. ఇందులో మెరుగైన స్కోర్ సాధిస్తేనే గెలుపు గమ్యాన్ని చేరుకునేందుకు మార్గం కనిపిస్తుంది. మెయిన్స్‌లో విజయానికి అవసరమైన ప్రిపరేషన్ వ్యూహాలపై ఫోకస్...
 
 ముందుగా సివిల్స్ ప్రిలిమ్స్‌ను దిగ్విజయంగా పూర్తిచేసిన అభ్యర్థులకు అభినందనలు. ఇప్పటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో డిసెంబర్‌లో జరిగే మెయిన్స్ పరీక్షలో మంచి స్కోర్ సాధించేందుకు సిద్ధంకావాలి. ఆప్షనల్ పేపర్లతో పాటు జనరల్ ఎస్సే (ఒక పేపర్), జనరల్ స్టడీస్ (నాలుగు పేపర్లు) రాయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పటిష్ట ప్రణాళికను రూపొందించుకుని, ప్రిపరేషన్ కొనసాగించాలి.
 
 జనరల్ ఎస్సే
 ఈసారి జరిగే మెయిన్స్‌లో ఒకటి కంటే ఎక్కువ ఎస్సేలు రాయాల్సిన అవసరం ఉండొచ్చు. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌లో సూచనప్రాయంగా (candidates may be required to write essays on multiple topics) పేర్కొన్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన అంశాలపై ఎస్సేలు రాయటం ప్రాక్టీస్ చేయాలి. ఇటీవలి కాలంలో వివిధ రంగాల్లో చోటుచేసుకున్న ముఖ్యమైన పరిణామాలపై దృష్టిసారించాలి.
 
 ఉదా:
 ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర
 బాలల హక్కులు
 స్మార్ట్ సిటీలు
 ఒక ప్రవర్తనా సవాలుగా శుభ్రత
 కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన (కజీజీఝఠఝ జౌఠ్ఛిటఝ్ఛ్ట ్చఛీ క్చ్ఠజీఝఠఝ జౌఠ్ఛిట్చఛ్ఛి ్ఛ్టఛి.,)
 
 మనకంటూ ఓ ప్రత్యేకం
 జనరల్ ఎస్సేను జనరల్ స్టడీస్ నుంచి వేరుగా చూడాలి. రాసే విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కో శైలి ఉంటుంది. ఓ అంశానికి సంబంధించి అభిప్రాయాలను సౌకర్యవంతంగా, స్వేచ్ఛగా వెల్లడించగల శైలి ఏంటన్నది గుర్తించి, దాన్ని అనుసరించాలి. సందర్భానుసారం గొప్ప వ్యక్తుల వ్యాఖ్యలను ఉదాహరించాలి. ఇవి అభిప్రాయాలకు బలం చేకూరుస్తాయి. అభ్యర్థి రాసే వ్యాసంలో ఆత్మస్థైర్యం, ఆశావాదం, నిర్మాణాత్మకత ప్రతిబింబించాలి. అనవసర విషయాల జోలికి వెళ్లకూడదు. ఎస్సే ద్వారా మన వ్యక్తిత్వం ఏంటన్నది బయటపడుతుంది. దీన్ని గుర్తుంచుకొని ముందడుగు వేయాలి. మంచి వాక్యాలతో ఉత్సాహంతో మనస్ఫూర్తిగా ఇష్టపడుతూ రాసే ఎస్సే.. ఎగ్జామినర్‌ను కట్టిపడేస్తుందనడంలో సందేహం లేదు.
 
 జనరల్ స్టడీస్
 జనరల్ స్టడీస్ పేపర్లలోని ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు ప్రధానంగా అయిదు అంశాలను గుర్తుంచుకోవాలి.. 1.కిందటి సారి జరిగిన పరీక్షలో పదాల సంఖ్య భారంగా పరిణమించింది. అయితే ఈ విషయంలో అభ్యర్థులు భయపడాల్సిన అవసరం లేదు. పదాల పరిమితిపై ఆందోళన చెందకుండా, నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ బాగా రాస్తే మంచి స్కోర్ సాధించవచ్చు.
 
 2.ప్రశ్నను బట్టి సమాధానాన్ని పాయింట్ల రూపంలో రాయాలా? లేదంటే దీంతోపాటు విశ్లేషణాత్మకత విధానంలోనూ రాయాలా? అనేది నిర్ణయించుకోవాలి. కొన్ని ప్రశ్నలకు పాయింట్ల రూపంలో సమాధానం రాయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మరికొన్నింటికి రెండు విధానాలనూ జోడిస్తూ రాసినప్పుడే మేలు జరుగుతుంది. నేషనల్ ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ); ప్రతిపాదిత మోటార్ వాహనాల చట్ట సవరణలు, జువైనల్ జస్టిస్ యాక్ట్ తదితర అంశాలను పాయింట్ల రూపంలో రాయొచ్చు. భారతదేశంలో పంట మార్పిడి ఆవశ్యకతకు సమాధానాన్ని రెండు విధానాల్లోనూ రాయొచ్చు.
 
 3.Comment, Elaborate, Illustrate, analyse, Be Critica.. తదితర పదాలు ప్రశ్నల్లో కనిపిస్తాయి. ఓ ప్రశ్నను రూపొందించే వ్యక్తి మీ నుంచి దేన్ని ఆశిస్తున్నాడనేది ఈ పదాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. దానికి తగినట్లు సమాధానం రాయాలి. వ్యాఖ్యానించమన్నారా.. విశ్లేషించమన్నారా? లేదంటే విమర్శనాత్మకంగా విశ్లేషించమన్నారా? ఇలా సమాధానాన్ని ఏ కోణంలో రాయాలన్నది గుర్తించాలి.  4.మరో ముఖ్య విషయం కచ్చితమైన సమాధానమంటే కేవలం ఫ్యాక్ట్స్‌ను మాత్రమే రాయడం కాదు. విశ్లేషణాత్మకంగా సమాధానం రాయడం ప్రధానం. ఫ్యాక్ట్స్ అనేవి ఓ అంశంపై అభ్యర్థి శ్రద్ధను మాత్రమే తెలియజేస్తాయి. 5.కారణం ఏదైనా సరే ఒక పేపర్‌ను సరిగా రాయలేదని అనిపిస్తే అతిగా ఆలోచించకుండా అంతటితో దాన్ని మరచిపోయాలి. లేదంటే దీని ప్రభావం మరో పేపర్‌పై పడుతుంది.
 
 హిస్టరీ- కొన్ని ముఖ్యాంశాలు
  మొదటి ప్రపంచ యుద్ధం  గదర్ పార్టీ  భారతదేశానికి గాంధీజీ తిరిగి రాక (1915)  1914 నుంచి అరబ్ రాజకీయాలు  టిబెట్ అంశం (1950-59)  పంచశీల ఒప్పందం  హెండర్‌సన్ బ్రూక్స్ రిపోర్టుసిమ్లా ఒప్పందం (1972)  జాతీయ ఆత్యయిక పరిస్థితి (1975)జనతా పార్టీ (1977-79) కార్గిల్ యుద్ధం (1999) తదితర అంశాలపై దృష్టిసారించాలి. భౌగోళిక శాస్త్రం/పర్యావరణం: అయిచీ జీవ వైవిధ్య లక్ష్యాలు; తుఫాన్లు, ఎల్‌నినో, కరువుకాటకాలు; తీవ్ర వాతావరణ మార్పులు; ఆగ్రో ఫారెస్ట్రీ విధానం- 2014 తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.సామాజిక అంశాలకు సంబంధించి ముఖ్యంగా యువత జీవనశైలి, ప్రపంచీకరణ అనంతరం భారతీయ సంస్కృతిలో మార్పులను అధ్యయనం చేయాలి.సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్‌పీజీ) విధానాలు అమలు కాలం (1991) నుంచి గ్రామీణ సమాజంలో వచ్చిన మార్పులపై అవగాహన పెంపొందించుకోవాలి.
 
 పాలిటీ, గవర్నెన్‌‌స: ఇందులో ప్రధానంగా ప్రతిపక్ష నేత, ఉరిశిక్ష అమలు, ఉమ్మడి పౌర స్మృతి, ఆర్టికల్ 370, సహకార సమాఖ్యవాదం, ఖనిజాలకు రాయల్టీ చెల్లింపుల పెరుగుదల, ఉన్నత స్థాయి న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్-కొలీజియం వ్యవస్థ, ప్రధాని కార్యాలయం (పీఎంవో) తదితర అంశాలు ముఖ్యమైవని.అంతర్జాతీయ సంబంధాలు, జాతీయ వ్యవహారాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధిత అంశాలపై తప్పనిసరిగా దృష్టిసారించాలి.
 
 జీఎస్ పేపర్ 4 (నైతికత, నిజాయితీ, అభిరుచి): ఈ విభాగంలోని ప్రశ్నలకు వ్యక్తిగత అవగాహన సామర్థ్యం ప్రధానం. వివిధ కేస్‌స్టడీలను అధ్యయనం చేయడం ద్వారా దీన్ని పెంపొందించుకోవచ్చు. శక్తి, సంపద, ధర్మ (డ్యూటీ), నిజాయితీ తదితరాలకు సంబంధించిన మంచి కొటేషన్స్‌తో సిద్ధంగా ఉండాలి. ఈ అంశాలు మీరు రాసే సమాధానంలో ప్రతిబింబించాలి. ప్రభుత్వంలో పనిచేసే వారికి ఉండాల్సిన కనీస విలువలు, నైతిక ఆవశ్యకత అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఒక అంశంపై ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఎవరి విశ్లేషణ వారిది. విశ్వజనీన సమాధానాలను రూపొందించడం కష్టమైన పని. అందుకే స్వీయ వివేచన ఆధారంగా, నిర్మాణాత్మకంగా, ప్రాక్టికల్‌గా సాధ్యమయ్యేలా సమాధానాలు ఇవ్వాలి.
 ఆల్ ది బెస్ట్...
 
 మెయిన్స్ పరీక్ష విధానం
  పేపర్    మార్కులు
 అర్హత పేపర్లు:
 పేపర్-ఎ:    
 రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లోని
 ఎంపిక చేసుకున్న భాష    300
 పేపర్-బి:
 ఇంగ్లిష్    300
 మెరిట్‌కు పరిగణనలోకి తీసుకునే పేపర్లు:
 పేపర్-1 ఎస్సే    250
 పేపర్ 2 (జీఎస్-1)    250
 పేపర్ 3 (జీఎస్-2)    250
 పేపర్ 4 (జీఎస్-3)    250
 పేపర్ 5 (జీఎస్-4)    250
 పేపర్ 6 (ఆప్షనల్ సబ్జెక్టు పేపర్-1)    250
 పేపర్ 7 (ఆప్షనల్ సబ్జెక్టు పేపర్-2)    250
 మొత్తం మార్కులు    1750
 
 ఆలోచనా తీరు.. రాసే శైలి..
 విజయానికి కీలకం
 -శశాంక, సివిల్స్ 2012 టాపర్,
 అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనింగ్
 
 సివిల్స్ మెయిన్స్ ప్రిపరేషన్‌లో ‘రాయడం ప్రాక్టీస్’ చేయడమనేది కీలకమైన అంశం. ఎందుకంటే ఓ అంశానికి సంబంధించి ఎంతటి పరిజ్ఞానమున్నా, అవగాహన ఉన్నప్పటికీ రాతపూర్వకంగా సరిగా వ్యక్తీకరించకుంటే ఫలితం శూన్యం! వీలైనన్ని మాక్ టెస్ట్‌లు రాయడం ద్వారా లోపాలను అధిగమించి, రాత తీరును మెరుగుపరుచుకోవచ్చు.ఒకటి కంటే ఎక్కువ ఎస్సేలకు సమాధానాలు రాయాల్సి వస్తే సమయ పాలన కీలకపాత్ర పోషిస్తుంది. సమకాలీన అంశాలపై ఎస్సేలు రాసి నిపుణులతో దిద్దించుకోవాలి. దీనివల్ల బలాలు, బలహీనతలు తెలుస్తాయి. మెరుగుపరచుకోవాల్సిన అంశాలపై స్పష్టత వస్తుంది. జనరల్ స్టడీస్ పేపర్లను చాలా మంది బాగానే రాస్తున్నారు.. ఈ నేపథ్యంలో విజయాన్ని నిర్దేశించడంలో ఎస్సే, ఆప్షనల్ పేపర్లు, ఇంటర్వ్యూ కీలకమవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ సాగించాలి.
 
 ప్రతి రోజూ జనరల్ స్టడీస్, ఆప్షనల్
 ప్రిపరేషన్‌కు సమయం కేటాయించాలి. ఉదయం జనరల్ స్టడీస్ చదివితే, సాయంత్రం ఆప్షనల్ సబ్జెక్టు చదవాలి.
 సమయం ఎక్కువగా అందుబాటులో ఉండదు కాబట్టి ఒకట్రెండు పేపర్లతో పాటు ఒక ప్రామాణిక మ్యాగజైన్‌కు పరిమితమవ్వాలి. ముఖ్యమైన అంశాలను ప్రత్యేకంగా నోట్ చేసుకోవాలి.
 
 ఎంత ఎక్కువ చదివామనే దానికంటే చదివిన విషయం ఎంత వరకు గుర్తుంది అనేది ప్రధానం. అందుకే పునశ్చరణకు ప్రాధాన్యం ఇవ్వాలి.
 
 సామాజిక, ఆర్థిక సర్వే, బడ్జెట్, ముఖ్యమైన కమిటీల నివేదికలు వంటి వాటిని అధ్యయనం చేయడం ముఖ్యం. రాష్ట్రపతి, ప్రధానిమంత్రి ప్రసంగాలపై దృష్టికేంద్రీకరించాలి. ఎందుకంటే వీటి ద్వారా వివిధ అంశాలకు సంబంధించిన ప్రభుత్వ ఆలోచనా ధోరణి తేటతెల్లమవుతుంది.
 
 సమాధానం రాసేటప్పుడు ఒక ‘ఆఫీసర్’గా రాయాలి. ఆఫీసర్ అయినట్లు ఊహించుకుని సమాధానం రాస్తే ప్రాక్టికల్‌గా వీలయ్యే సూచనలు బయటపడతాయి.
 
 ఏదైనా సమస్య పరిష్కారానికి సూచనలు ఇచ్చేటప్పుడు క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్‌గా అమలు చేయడానికి వీలయ్యే వాటిని సూచించాలి.
 
 సమాధానాల్లో నెగిటివ్ అభిప్రాయాలను రాయొద్దు. అన్నీ సమస్యలే.. అంతా అవినీతి మయం, ఏమీ చేయలేం.. వంటి నిరాశాజనక అభిప్రాయాలను కాకుండా ‘‘తప్పులున్నాయి.. వాటిని సరిదిద్దుకునేందుకు అవకాశముంది..’’ అనే సానుకూల ధోరణిని ప్రతిబింబించాలి.
 
 జనరల్ స్టడీస్ 4 పేపర్ ప్రిపరేషన్‌కు ఇగ్నో మెటీరియల్ ను సేకరించి వాటిలోని కేస్ స్టడీలను అధ్యయనం చేయాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement