కార్పొరేట్ కొలువు నుంచి ఐఎఫ్‌ఎస్‌కు.. | Indian Forest Service IFS | Sakshi
Sakshi News home page

కార్పొరేట్ కొలువు నుంచి ఐఎఫ్‌ఎస్‌కు..

Published Thu, Apr 23 2015 3:35 AM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM

Indian Forest Service IFS

 కార్పొరేట్ కొలువు.. ఆపై చేతినిండా సంపాదన.. ఈ రెండూ ఉన్నాయి! ఇంకేం బాగా బతికేయొచ్చు..! అని సరిపెట్టుకోకుండా సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలి.. అలాంటి అవకాశాన్ని కల్పించే ఉద్యోగాన్ని చేజిక్కించుకోవాలనే ఆలోచనే సివిల్ సర్వీసెస్ పరీక్ష దిశగా వెళ్లేలా చేసింది. ఆ సర్వీస్ సాధించకున్నా, దానికోం చేసిన సాధన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్)లో నాలుగో ర్యాంకు రావడానికి ఉపయోగపడిందంటున్నాడు గుంటుపల్లి వరుణ్. ఈ విజయ ప్రస్థానం అతని మాటల్లోనే...
 
 సక్సెస్ స్టోరీ
 నాన్న చిన్న స్థాయి వ్యాపారవేత్త, అమ్మ గృహిణి. చెల్లి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. పదో తరగతి వరకు హైదరాబాద్‌లో చదివాను. పదో తరగతి పరీక్షల్లో స్కూల్ టాపర్‌గా నిలిచాను. తర్వాత ఇంటర్మీడియెట్, మద్రాస్ ఐఐటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ బీటెక్ పట్టా తీసుకున్నాక, ఐఐఎం-ఇండోర్ నుంచి పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎం) పూర్తిచేశాను.
 
 చదువు తర్వాత ఉద్యోగం
 ముంబైలో ఏడాదిన్నర పాటు డెస్టిమనీ ఎంటర్‌ప్రైజెస్‌లో పనిచేశా. తర్వాత ఎడెల్‌వైస్ సెక్యూరిటీస్ సంస్థలో ఈక్విటీ రీసెర్చ్ అనలిస్టుగా మూడేళ్లు ఉద్యోగం చేశాను.
 
 ఐఎఫ్‌ఎస్ దిశగా
 మంచి సంస్థల్లో ఉద్యోగం, సంతృప్తికరమైన సంపాదన ఉన్నా సివిల్ సర్వీసెస్ ద్వారా సమాజానికి సేవచేసే అవకాశం లభిస్తుందన్న ఉద్దేశంతో అటువైపు అడుగులు వేశాను. సివిల్ సర్వీసెస్ వల్ల అణగారిన ప్రజల ఉన్నతికి కృషి చేయొచ్చని, ఉద్యోగంలోనూ మంచి సంతృప్తి లభిస్తుందని భావించి, సివిల్స్ ప్రిపరేషన్‌ను ప్రారంభించాను. అయితే ఉద్యోగంలో తీరిక లేకుండా ఉండటం వల్ల ప్రిపరేషన్ సరిగా సాగలేదు. దీంతో రెండు సార్లు విఫలమయ్యాను. ఇక లాభం లేదనుకొని, 2012, సెప్టెంబర్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తిస్థాయిలో సివిల్స్ సన్నద్ధతపై దృష్టిపెట్టాను.
 
 ఉమ్మడి సన్నద్ధత
 మొదట్లో ఐఎఫ్‌ఎస్‌పై దృష్టి పెట్టలేదు. 2013లో యూపీఎస్సీ పరీక్ష విధానాన్ని మార్చింది. సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలో ఒక ఆప్షనల్‌ను తగ్గించడంతో పాటు సివిల్స్‌కు, ఐఎఫ్‌ఎస్‌కు ఉమ్మడి ప్రిలిమినరీ పరీక్ష వెసులుబాటు నాకు ఎంతగానో ఉపయోగపడింది. ఒకేసారి రెండు పరీక్షలకు ప్రిపేరయ్యే అవకాశం లభించింది.
 
 ఐఎఫ్‌ఎస్‌లో రెండోసారి విజయం
 ఐఎఫ్‌ఎస్‌కు చేసిన తొలి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. 29మార్కుల తేడాతో సర్వీస్ చేజారింది. రెండోసారి (2014) మ్యాథమెటిక్స్, ఫారెస్ట్రీ ఆప్షనల్ సబ్జెక్టులతో విజయం సాధించా. మ్యాథ్స్‌పై పట్టుసాధించాలంటే కనీసం ఆర్నెల్లు పడుతుంది. మొదటిసారి సరైన ప్రిపరేషన్ లేకపోవడం వల్ల మ్యాథ్స్‌లో తక్కువ మార్కులు వచ్చాయి. ఈ అనుభవం దృష్ట్యా లోపాలను సరిచేసుకొని రెండోసారి అధిక సమయం ప్రాక్టీస్ చేశాను. ఫలితంగా మ్యాథ్స్‌లో ఎక్కువ మార్కులు సాధించగలిగాను.  ఫారెస్ట్రీ పేపర్‌కు ఎక్కువ సమయం కేటాయించకున్నా, జనరల్ స్టడీస్‌లో ఎన్విరాన్‌మెంట్ అంశాలను బాగా చదవడం ఆ ఆప్షన్‌ను సంతృప్తికరంగా రాసేందుకు ఉపయోగపడింది.
 
 ప్రిపరేషన్
 సొంతంగానే సివిల్స్‌కు, ఐఎఫ్‌ఎస్‌కు సిద్ధమయ్యాను. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఉమ్మడి ప్రణాళికతో చదివాను. జనరల్ స్టడీస్‌లోని పేపర్ల కోసం ఎన్‌సీఈఆర్‌టీ, ఇతర ప్రామాణిక పుస్తకాలు చదివాను. కరెంట్ అఫైర్స్ కోసం పత్రికలు, ఇంటర్నెట్‌ను ఉపయోగించుకున్నా. సివిల్స్ మెయిన్స్ పేపర్ల కోసం రాయడం ప్రాక్టీస్ చేశాను. ఇది ఐఎఫ్‌ఎస్ జనరల్ నాలెడ్జ్ పేపర్‌కు ఉపయోగపడింది.
 
 ప్రిపరేషన్ సమయంలో ఒత్తిడిని జయించేందుకు సుడోకోను సాధించడం, పాటలు వినడం, స్నేహితులను కలవడం చేసేవాడిని. ఒకవేళ సర్వీస్ రాకపోతే తిరిగి కార్పొరేట్ ఉద్యోగంలో చేరేందుకు అవకాశం ఉండటంతో ఆందోళనకు గురికాకుండా దృష్టిని పూర్తిస్థాయి ప్రిపరేషన్‌పై పెట్టగలిగాను.
 
 ఇంటర్వ్యూ
 ఆర్థిక సంబంధిత సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉండటం వల్ల ఇంటర్వ్యూలో వాటిపై ప్రశ్నలడిగారు. స్టాక్ మార్కెట్, ఫారెస్ట్రీలపై ప్రశ్నలు వచ్చాయి. కరెంట్ అఫైర్స్ నుంచి కూడంకుళం ప్రాజెక్టు, గ్రీన్ పీస్ ఎన్జీవో, పర్యావరణ కాలుష్యంతో పాటు నేను చదివిన మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ ఐఎఫ్‌ఎస్‌కి ఎలా ఉపయోగపడుతుందని భావిస్తున్నావనే ప్రశ్న కూడా అడిగారు. ఇంటర్వ్యూ 25 నిమిషాల పాటు జరిగింది.
 
 విజయానికి అండగా
 ఈ విజయాన్ని పూర్తిగా నా కుటుంబానికే అంకితమిస్తున్నాను. వారి ప్రోత్సాహం లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. ఐఎఫ్‌ఎస్‌కి సిద్ధమవుతున్న వారు కనీసం ఏడాది సమయం కేటాయించాలి. జనరల్ నాలెడ్జ్, రెండు ఆప్షనల్ సబ్జెక్టులను సమగ్రంగా చదవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్‌లకు ఒకేసారి ప్రిపేర్ కావాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ పరీక్షలకు వ్యవధి చాలా తక్కువ ఉంటుంది. పోస్టులు తక్కువ, పోటీ ఎక్కువగా ఉండటంతో సివిల్ సర్వీసెస్ కంటే ఐఎఫ్‌ఎస్ ప్రిలిమ్స్ కటాఫ్ మార్కులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ప్రిలిమ్స్‌లో మంచి మార్కులు సాధించాలి. మెయిన్స్‌కి రెండు నెలల ముందే సిలబస్ పూర్తిచేసి, రివిజన్‌పై దృష్టిసారించాలి. వారాలు, నెలల వారీ లక్ష్యాలను నిర్దేశించుకొని, చదివితే విజయం ఖాయం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement