ఆ వైఫల్యాలే నా విజయానికి సోపానాలు | Failures were my stepping stones to success | Sakshi
Sakshi News home page

ఆ వైఫల్యాలే నా విజయానికి సోపానాలు

Published Thu, Jun 19 2014 12:59 AM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM

ఆ వైఫల్యాలే నా విజయానికి సోపానాలు - Sakshi

ఆ వైఫల్యాలే నా విజయానికి సోపానాలు

ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్.. ప్రజలకు సేవ చేసేందుకు ప్రత్యక్ష మార్గం అనే బలమైన ఆలోచన..
 అదే విధంగా కుటుంబంలోని అందరూ సివిల్ సర్వీసుల్లో ఉండటంతో పీజీ చదివేటప్పుడే సివిల్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాను. మూడు సార్లు ఓటమి ఎదురైనా.. నిబ్బరం కోల్పోకుండా.. దీక్ష, పట్టుదలతో
 నాలుగో ప్రయత్నంలో విజయం సాధించాను. ఆశించిన లక్ష్యం ఐఏఎస్ సొంతం చేసుకున్నాను’.. అంటున్న సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2013-14 30వ ర్యాంకర్ కృత్తిక జ్యోత్స్నతో ఇంటర్వ్యూ...
 
 అందరూ సివిల్ సర్వీసుల్లోనే.. అదే తొలి ప్రేరణ:
 కుటుంబ నేపథ్యం అంతా సివిల్ సర్వీసుల్లోనే. నాన్న ఎస్.బి.ఎల్. మిశ్రా ఐఎఫ్‌ఎస్ అధికారి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ హోదాలో ఉన్నారు. అమ్మ నిరుపమ అలీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అడిషనల్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సోదరుడు కార్తికేయ మిశ్రా  ఐఏఎస్ అధికారి. ఆంధ్రప్రదేశ్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సీఎండీ హోదాలో ఉన్నారు. సోదరి కనిక జ్యోత్స్న దుబాయ్‌లో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌లో ఉన్నత హోదాలో పని చేస్తోంది. ఇలాంటి వాతావరణంలో పెరిగిన నేను చిన్నప్పటి నుంచే సివిల్ సర్వీసులు అంటే మక్కువ పెంచుకున్నాను. వీటి ద్వారా ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం లభిస్తుందనే ఆలోచన బలంగా నాటుకుంది. దీంతో ఎలాగైనా సివిల్స్ విజయం సొంతం చేసుకోవాలని కృషి చేశాను. లక్ష్యం సాధించాను.
 
 పీజీ.. తర్వాత పూర్తి స్థాయిలో..:
 చిన్ననాటి నుంచే సివిల్స్ లక్ష్యంగా ఉన్నప్పటికీ ఢిల్లీ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక.. 2009 చివరి నుంచి పూర్తి స్థాయిలో సివిల్స్ ప్రిపరేషన్‌కు ఉపక్రమించాను. మొదటి సారి 2010లో సివిల్స్ ప్రిలిమ్స్‌కు హాజరయ్యాను. తొలుత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ సబ్జెక్ట్‌లు ఆప్షనల్‌గా సివిల్స్ ప్రిపరేషన్ సాగించాను. ఇందుకోసం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌కు మొదట్లో కోచింగ్ తీసుకున్నప్పటికీ.. ఆ తర్వాత అంతా స్వీయ ప్రిపరేషన్‌తోనే సన్నద్ధమయ్యాను.
 
 కుటుంబ సభ్యుల తోడ్పాటు ఎంతో:
 సివిల్స్ ప్రిపరేషన్ విషయంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మరువలేనిది. ముఖ్యంగా నాన్న, అన్నయ్య ఎంతో సహకరించారు. నిర్మాణాత్మక ప్రిపరేషన్‌కు అమూల్యమైన సలహాలిచ్చారు. అంతేకాకుండా జనరల్ స్టడీస్, జనరల్ ఎస్సేస్ విషయంలో వారే ఇంటర్నెట్ సోర్స్‌ల ద్వారా సమాచారం సేకరించి అందించారు.
 
 మూడు సార్లు నిరాశ.. అయినా చెదరని పట్టుదల:
 ప్రస్తుత విజయం నాకు నాలుగో ప్రయత్నంలో లభించింది. 2010 నుంచి 2012 వరకు మూడు సార్లు ఫలితాల్లో నిరాశే ఎదురైంది. రెండోసారి 2011లో ఇంటర్వ్యూ వరకు వెళ్లినా ఫలితం దక్కలేదు. మూడో ప్రయత్నంలోనూ అంతే. ఈ క్రమంలో మానసికంగా ఎంతో నిరుత్సాహానికి గురయ్యాను. ముఖ్యంగా మూడో ప్రయత్నం (2012)లో ఓటమి మానసికంగా ఎంతో కుంగదీసింది. అయితే ఈ సమయంలో సోదరి కనిక జ్యోత్స్న ఇచ్చిన సపోర్ట్ మరవలేనిది.  నిరాశకు వెంటనే ఫుల్‌స్టాప్ పెట్టేసి చివరి ప్రయత్నంలో ఎట్టి పరిస్థితుల్లో సాధించాలనే పట్టుదలతో సాగాను.
 
 ప్రతిసారి.. నిత్య నూతనంగా:
 మూడు సార్లు ఓటమి ఎదురైనా .. ప్రతి అటెంప్ట్‌ను కొత్త సవాలుగా స్వీకరించి రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగాను. రెండో ప్రయత్నంలో అనారోగ్యం కారణంగా విఫలమయ్యాను. మూడో ప్రయత్నంలో రైటింగ్ ప్రాక్టీస్ సరిగా చేయక ముఖ్యంగా ఎస్సే పేపర్‌లో తక్కువ మార్కులు లభించాయి. ఇలా ప్రతిసారి ఎదురైన ఓటమి వెనుక కారణాలను అన్వేషించి తదుపరి అటెంప్ట్‌ను కొత్త ఛాలెంజ్‌గా తీసుకుని ప్రిపరేషన్‌కు ఉపక్రమించాను.
 
 స్వీయ ప్రిపరేషన్.. సాగించానిలా:
 సివిల్స్ తొలి ప్రయత్నానికి ఉపక్రమించే ముందు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ కోసం కొన్ని రోజులు కోచింగ్ తీసుకున్నాను. సిలబస్, ప్రశ్నల శైలిపై అవగాహన లభించాక సొంతగా చదవడం ప్రారంభించాను. ఈ క్రమంలో ప్రతి రోజు అయిదు నుంచి ఆరు గంటలు కేటాయించాను. ప్రతి రోజు చదివిన అంశాలకు సంబంధించి షార్ట్‌కట్ మెథడ్స్‌లో సొంత నోట్స్ రూపొందించుకోవడం, అంతుకుముందు రోజు చదివిన అంశాలను పునశ్చరణ చేసుకోవడం వంటి వ్యూహాలు అనుసరించాను. ఎన్‌సీఈఆర్‌టీ 6 నుంచి 12 తరగతుల పుస్తకాలు, మోడ్రన్ ఇండియన్ స్పెక్ట్రమ్, విజార్డ్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ-లక్ష్మీకాంత్ పుస్తకాలను చదివాను. వీటితోపాటు కచ్చితంగా ప్రతి రోజు టీవీ చానళ్లలో ప్రసారమయ్యే చర్చా కార్యక్రమాలను చూసి ముఖ్యాంశాలను నోట్ చేసుకోవడం హాబీగా చేసుకున్నాను.
 
 ఆప్షనల్స్.. ఇవే:
 అకడెమిక్ నేపథ్యం మ్యాథమెటిక్స్ అయినప్పటికీ.. సివిల్ సర్వీస్ పరీక్ష విధానం, ప్రశ్నల శైలి, సిలబస్ తదితర కారణాలతో.. తొలుత పాత విధానంలోని సివిల్స్ మెయిన్స్ కోసం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ సబ్జెక్ట్‌లను ఆప్షనల్స్‌గా ఎంచుకున్నాను. ఈ సబ్జెక్ట్‌లు చదివితే జనరల్ అవేర్‌నెస్ పెరుగుతుందనే భావనే ఇందుకు ప్రధాన కారణం. అప్పటి వరకు అకడెమిక్స్‌లో మ్యాథమెటిక్స్ ఓరియెంటేషన్‌తో చదవడంతో సివిల్స్‌లో జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్‌ల ప్రాధాన్యాన్ని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇది కలిసొచ్చింది.
 
 మెయిన్స్ కొత్త ప్యాట్రన్‌కు ఇలా:
 మొదటిసారిగా 2010లో సివిల్స్ రాశాను. అప్పుడు ప్రిలిమ్స్ పేపర్-2 కోసం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్‌గా తీసుకున్నాను. ఇందుకోసం కొన్ని రోజులు కోచింగ్ తీసుకున్నాను. 2011లో ప్రిలిమ్స్‌లో మార్పులు చేసిన విషయం తెలిసిందే. రెండో పేపర్‌లో ఆప్షనల్ బదులు సీ-శాట్‌ను ప్రవేశపెట్టారు. సీ-శాట్ కోసం పదో తరగతి స్థాయి పుస్తకాలు చదివా.
 
 2013 మెయిన్స్‌లోనూ అంతే. రెండు ఆప్షనల్స్ స్థానంలో ఒకే ఆప్షనల్ విధానానికి రూపకల్పన చేశారు. అంతేకాకుండా.. ఎలాంటి నేపథ్యం ఉన్నవారికైనా అకడెమిక్స్‌తో అంతగా సంబంధం లేని ఎథిక్స్, మోరల్ వాల్యూస్ పేపర్ ప్రవేశపెట్టారు. ప్యాట్రన్ మారినా ఎలాంటి ఆందోళన చెందలేదు. అప్పటి వరకు సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లు ఆప్షనల్‌గా చదివిన నేను.. ఆ రెండింటిలో బాగా పట్టు లభించిన సోషియాలజీని ఆప్షనల్‌గా ఎంచుకున్నాను. మిగతా పేపర్లన్నీ జనరల్ స్టడీస్, జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్‌కు సంబంధించినవే కాబట్టి.. ప్రిపరేషన్ పరంగా ఇబ్బంది పడిన సందర్భాలు తక్కువ.
 
 అందరికీ కలిసొచ్చే.. కొత్త ప్యాట్రన్:
 మెయిన్స్ ఎగ్జామినేషన్ కొత్త ప్యాట్రన్ అందరికీ కలిసొచ్చేదిగా ఉంది. లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్‌కు ఆస్కారం లభిస్తుంది. కాబట్టి అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సామాజిక అంశాలపై అవగాహన, కరెంట్ అఫైర్స్‌పై పట్టుతో మెయిన్స్‌ను సులువుగానే ఎదుర్కోవచ్చు. ఇందుకోసం భావ వ్యక్తీకరణ సామర్థ్యాన్ని, ఒక అంశాన్ని పూర్వాపరాలతో విశ్లేషించే నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి. ఈ విషయంలో న్యూస్ పేపర్లు, ఇతర కాంపిటీటివ్ మ్యాగజైన్లలోని ఎడిటోరియల్స్, వ్యాసాలు చదవడం లాభిస్తుంది.
 
 ఇంటర్వ్యూ.. 25 నిమిషాలు:
 ఏప్రిల్ 15న ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో అల్కా సిరోహి నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బోర్డ్ ఇంటర్వ్యూ నిర్వహించింది. 20 నుంచి 25 నిమిషాల వ్యవధిలో ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో సాగింది. వేదిక్ మ్యాథ్స్, నా అభిమాన కవి జాన్ మిల్టన్ పోయట్రీ, మేథో సంపత్తి హక్కులు, విద్యా హక్కు, మానవాభివృద్ధి సూచీ-భారత స్థానం- ఇతర దేశాలతో పోలిక, నాయకత్వ లక్షణాలు, చిన్న రాష్ట్రాలు-పెద్ద రాష్ట్రాల ఏర్పాటుపై జరుగుతున్న చర్చలు, నక్సలిజం, ప్రీ-పోల్, పోస్ట్ పోల్ సర్వేల గురించి ప్రశ్నలు అడిగారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో తడబడినా.. బోర్డ్ సభ్యులు హింట్స్ ఇచ్చి ఒత్తిడి లేని వాతావరణంలో ఇంటర్వ్యూ చేశారు. ముఖ్యంగా మొదటి ప్రశ్నగా నా పేరులోని అర్థం చెప్పమంటే.. చెప్పలేకపోయాను. దీనికి కొంత ఆందోళన చెందాను. కానీ బోర్డ్ సభ్యులు హింట్ ఇచ్చి సహకరించారు. ఇంటర్వ్యూ పూర్తయ్యాక కచ్చితంగా విజయం సాధిస్తాననే నమ్మకం కుదిరింది. అది నిజమైంది. నాన్న, అన్నయ్య సలహాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌ను ప్రాధాన్యతగా ఎంచుకున్నాను.
 
 అభ్యర్థులకు సలహా:
 ఔత్సాహిక అభ్యర్థులకు నా సలహా.. సహనం, ఓర్పు సహజ లక్షణాలుగా అలవర్చుకోవాలి. సుదీర్ఘ వ్యవధిలో సాగే ఎంపిక ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ, నిస్పృహలను దరి చేరనీయకూడదు. ఇక.. ప్రిపరేషన్ విషయానికొస్తే.. తొలి ప్రయత్నానికి కనీసం సంవత్సరం ముందు నుంచి ఆ దిశగా వ్యూహాలు రూపొందించుకోవాలి. మార్కెట్లో విస్తృతంగా లభించే మెటీరియల్ అంతటినీ చదవాలనే ఆతృత సరికాదు. నాణ్యమైన మెటీరియల్‌ను ఎంపిక చేసుకోవాలి. అంతేకాకుండా సిలబస్, గత ప్రశ్న పత్రాల పరిశీలన ద్వారా ఎంపిక చేసుకున్న మెటీరియల్‌లో చదవాల్సిన అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. కోచింగ్, ప్రిపరేషన్‌కు కేటాయించే సమయం  అనేది వ్యక్తిగత సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం సివిల్స్ ప్యాట్రన్ అన్ని నేపథ్యాల అభ్యర్థులకు అనుకూలించేదిగా ఉంది. ప్రిలిమ్స్‌లో సీ-శాట్ విషయంలో నాన్-మ్యాథ్స్ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కానీ ఈ పేపర్‌లో మ్యాథమెటికల్ ఎబిలిటీ కంటే ఇతర విభాగాలకు వెయిటేజీ ఎక్కువ. అంతేకాకుండా అడిగే ప్రశ్నలన్నీ పదో తరగతి స్థాయిలోనే ఉంటున్నాయి. కాబట్టి చక్కటి ప్రణాళికతో చదివితే విజయం సాధ్యం.
 
 మూడు సార్లు ఓటమి ఎదురైనా .. ప్రతి అటెంప్ట్‌ను కొత్త సవాలుగా స్వీకరించి రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగాను. ఇలా ప్రతిసారి ఎదురైన ఓటమి వెనుక కారణాలను అన్వేషించి తదుపరి అటెంప్ట్‌ను కొత్త ఛాలెంజ్‌గా తీసుకుని ప్రిపరేషన్‌కు ఉపక్రమించాను.
 
 అకడెమిక్ ప్రొఫైల్
 -    భారతీయ విద్యా భవన్ హైస్కూల్ (హైదరాబాద్)లో 2002లో 10వ తరగతి ఉత్తీర్ణత (91 శాతం)
 -    ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో 2004లో + 2 ఉత్తీర్ణత (85 శాతం)
 -    ఢిల్లీ యూనివర్సిటీ నుంచి 2007లో బీఎస్సీ (75 శాతం)
 -    ఢిల్లీ యూనివర్సిటీ నుంచి 2009లో మ్యాథమెటిక్స్‌లో పీజీ (52 శాతం)
 
 చదివిన పుస్తకాలు
 -    జనరల్ స్టడీస్: ఆరు నుంచి 12 తరగతుల వరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు
 -    ఇండియన్ పాలిటీ: లక్ష్మీకాంత్
 -    ఇండియన్ ఎకానమీ సిన్స్ ఇండిపెండెన్స్: ఉమా కపిల
 -    హిస్టరీ: స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్
 -    జాగ్రఫీ ఫర్ జనరల్ స్టడీస్: విజార్డ్ పబ్లికేషన్స్
 -    ఇండియన్ కల్చర్: స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్
 -    సోషియాలజీ: బీఏ సోషియాలజీ పుస్తకాలు, ఇగ్నో ఎంఏ (సోషియాలజీ) మెటీరియల్; సోషియాలజీ థీమ్స్ అండ్ పర్‌స్పెక్టివ్స్- హరాలమ్‌బస్; సోషియలాజికల్ థియరీ - రిట్జర్
 -    ఎథిక్స్: ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్- రమేశ్ కె.అరోరా.
 -    వీటితోపాటు క్రమం తప్పకుండా దినపత్రికల్లోని ఎడిటోరియల్ వ్యాసాలు, టీవీ చర్చా
 కార్యక్రమాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement