సుస్థిర భవిష్యత్‌కు.. ఆర్‌బీఐ కొలువులు | Jobs in RBI for secure future | Sakshi
Sakshi News home page

సుస్థిర భవిష్యత్‌కు.. ఆర్‌బీఐ కొలువులు

Published Thu, Jun 19 2014 1:00 AM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM

సుస్థిర భవిష్యత్‌కు.. ఆర్‌బీఐ కొలువులు - Sakshi

సుస్థిర భవిష్యత్‌కు.. ఆర్‌బీఐ కొలువులు

ఇటీవలి కాలంలో వెలువడుతున్న బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ల పరంపరలో మరో మంచి అవకాశం ఆశావహుల ముంగిట నిలిచింది.. దేశంలో బ్యాంకులను నియంత్రించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఆర్‌బీఐ).. గ్రేడ్-బి ఆఫీసర్ (జనరల్) పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. సుస్థిర భవిష్యత్‌కు మార్గం సుగమం చేసే ఆర్‌బీఐ గ్రేడ్-బి పోస్టులకు అర్హత, ఎంపిక ప్రక్రియ
 తదితర వివరాలు..
 
 మొత్తం ఖాళీలు: 117(జనరల్-58, ఎస్సీ-15, ఎస్టీ-8, ఓబీసీ-36)
 
 పరిమితంగానే:
 సివిల్స్ మాదిరిగా ఇందులో కూడా పరీక్ష హాజరుకు సంబంధించి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ క్రమంలో జనరల్ అభ్యర్థులకు నాలుగు సార్లు మాత్రమే హాజరయ్యే అవకాశం కల్పించారు (గతంలో నాలుగు సార్లు రాసిన అభ్యర్థులు ఈ సారి పరీక్ష రాయడానికి అనర్హులు). ఇతర కేటగిరీల అభ్యర్థులకు ఎటువంటి పరిమితి లేదు.
 ఎంపిక విధానం:
 ఎంపిక విధానంలో రెండు దశలు ఉంటాయి. అవి..రాత పరీక్ష, ఇంటర్వ్యూ.
 
 రాత పరీక్ష:
 రాత పరీక్ష ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పద్ధతుల కలయికగా ఉంటుంది. ఇందులో రెండు దశలు ఉంటాయి. మొదటి దశ రాత పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇది ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. రెండో దశ రాత పరీక్షను డిస్క్రిప్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు.
 
 మొదటి దశ:
 మొదటి దశ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ వంటి నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. సమాధానాలను గుర్తించడానికి 130 నిమిషాల సమయం కేటాయించారు. ఇందులో నిర్దేశించిన అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులు మాత్రమే రెండో దశ డిస్క్రిప్టివ్ టెస్ట్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
 
 రెండో దశ:
 ఇందులో మూడు పేపర్లు ఉంటాయి. అవి పేపర్-1 ఇంగ్లిష్, పేపర్- 2 ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్, పేపర్-3 ఫైనాన్స్ అండ్ మేనేజ్‌మెంట్. ప్రతి పేపర్‌కు 100 మార్కులు కేటాయించారు. సమాధానాలను మూడు గంటల్లో రాయాలి. ఇందులో ఇంగ్లిష్ మినహా మిగతా రెండు పేపర్లకు సమాధానాలను ఇంగ్లిష్/హిందీ భాషల్లో మాత్రమే రాయాలి.
 
 ప్రిపరేషన్:
 జనరల్ అవేర్‌నెస్: ఇందులో సమకాలీన జాతీయ, అంతర్జాతీయ సంఘటనలు, చరిత్ర, ఆర్థికశాస్త్రం, జాగఫ్రీ, జనరల్ సైన్స్, ప్రణాళికలు, బడ్జెట్, రాజ్యాంగం, పన్ను విధానం, ఆర్థిక సర్వే సంబంధిత అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. కరెంట్ అఫైర్స్ నుంచి అడిగే ప్రశ్నలు అధిక శాతం ఆర్థిక అంశాలపైనే ఉంటాయి. కాబట్టి సిలబస్‌లోని ఆర్థిక అంశాలను సమకాలీన సంఘటనలతో సమన్వయం చేసుకుంటూ విశ్లేషణాత్మక ప్రిపరేషన్ సాగించాలి.

 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: ఇందులో సంప్రదాయ ప్రశ్నలు కాకుండా  డేటాఇంటర్‌ప్రిటేషన్ ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. కాబట్టి ఆపరేషన్ ఆన్ బ్రాకెట్స్,లీనియర్ ఈక్వేషన్స్, రేషియో, ప్రాఫిట్-లాస్, టైమ్-డిస్టెన్స్-స్పీడ్-వర్క్, జ్యామెట్రీ, వెన్‌డయాగ్రమ్స్ వంటి అంశాలను ప్రాధాన్యత క్రమంలో ప్రిపేర్ కావాలి. ఈ క్రమంలో ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న ఆల్జీబ్రా, త్రికోణమితి, వైశ్లేషిక రేఖాగణితం, రేఖాగణితం, మెన్సురేషన్ వంటి అంశాల్లోని ప్రాథమిక భావనలపై అవగాహన పెంచుకోవాలి. ఎక్కువగా కాలిక్యులేషన్స్ ఉంటాయి. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ సమస్యలను సాధించే విధంగా షార్ట్‌కట్ మెథడ్స్ నేర్చుకోవాలి. వీలైనంత ఎక్కువగా సమస్యలను ప్రాక్టీస్ చేయాలి.

 రీజనింగ్: అభ్యర్థిలోని విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పరీక్షించే విభాగం ఇది. ఇందులో స్టేట్‌మెంట్స్ అండ్ కన్‌క్లూజన్స్, ఇన్‌పుట్-అవుట్‌పుట్, రిలేషన్స్, కేలండర్స్, క్లాక్స్, డెరైక్షన్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా నంబర్స్-ఆల్ఫాబెట్స్, వర్డ్ ఇమేజెస్ వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి.

 డిస్క్రిప్టివ్ పేపర్: విభాగానికి సంబంధించి ఇంగ్లిష్ పేపర్‌లో ఎస్సే, ప్రిసీస్ రైటింగ్, కాంప్రెహెన్షన్, బిజినెస్/ఆఫీస్ కరస్పాండెన్స్ వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. పేపర్-2, పేపర్-3లలో వచ్చే ప్రశ్నలు అయా అంశాలపై అభ్యర్థుల విస్తృత అవగాహనను  పరిశీలించే విధంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కేవలం అవగాహన పెంచుకోవడమే కాకుండా..ఆ సమాచారాన్ని విశ్లేషణాత్మకంగా ఏవిధంగా ప్రెజెంట్ చేయాలో నేర్చుకోవాలి. ఈ విభాగానికి సంబంధించి గత ప్రశ్నపత్రాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీటిని అనుసరిస్తూ ప్రశ్నల సరళిపై అవగాహన ఏర్పర్చుకోవాలి. ఏయే అంశాల నుంచి ఎటువంటి ప్రశ్నలు వస్తున్నాయి? వాటికి సమకాలీనంగా ఎటువంటి ప్రాధాన్యత ఉంది? వంటి అంశాలను బేరీజు వేసుకుంటూ విశ్లేషణాత్మక ప్రిపరేషన్ సాగించాలి.
 
 చివరగా:
 రెండో దశలో నిర్వహించిన రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు చివరగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఇంటర్వ్యూలో ఇంగ్లిష్/హిందీ భాషల్లో మాత్రమే సమాధానాలివ్వాలి. రెండో దశ రాత పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్ ఆధారంగా తుది నియామకాన్ని ఖరారు చేస్తారు.
 
 రిఫరెన్స్ బుక్స్
 -    ఎన్‌సీఈఆర్‌టీ: 6 నుంచి 12వ తరగతి పుస్తకాలు
 -    క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: ఆర్‌ఎస్ అగర్వాల్
 -    రీజనింగ్: ఆర్‌ఎస్ అగర్వాల్, టీఎస్ అగర్వాల్
 -    ఇండియా ఇయర్ బుక్
 -    ప్రతియోగితా దర్పణ్
 -    ఇంగ్లిష్: జీఆర్‌ఈ బారెన్స్
 -    ఆర్‌బీఐ గ్రేడ్-బి ఆఫీసర్స్ ఎగ్జామ్: ఉప్‌కార్ పబ్లికేషన్స్
 
 నోటిఫికేషన్ సమాచారం
 -    అర్హత: 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ/
 కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ/50 శాతం మార్కులతో డాక్టరేట్ డిగ్రీ. లేదా బ్యాచిలర్
 డిగ్రీతోపాటు సీఏ/సీఎస్ లేదా పీజీ డిప్లొమా ఇన్
 మేనేజ్‌మెంట్/ఎంబీఏతోపాటు బ్యాచిలర్ డిగ్రీ.
 -    వయసు: 21 నుంచి 30 ఏళ్లు (జూన్ 1, 2014
 నాటికి). రిజర్వ్‌డ్ అభ్యర్థులకు నిర్దేశించిన విధంగా వయోసడలింపు ఉంటుంది.
 -    దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 -    ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ:
 జూన్ 23, 2014.
 -    ఆఫ్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ:
 జూన్ 26, 2014
 -    ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జూన్ 23, 2014.
 -    మొదటి దశ రాత పరీక్ష తేదీలు: ఆగస్టు 2,3,9,10.
 వివరాలకు: http://rbi.org.in
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement