కేటాయింపు పొందిన ప్రిలిమ్స్ అభ్యర్థులకు ఫౌండేషన్ కోర్సులో ప్రవేశం లేదు
డీఓపీటీ ఉత్తర్వు జారీ
న్యూఢిల్లీ: గత ఏడాది సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్‌లలో కేటాయింపు పొంది, తిరిగి ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరుకాదలిచిన అభ్యర్థులు ఫౌండేషన్ కోర్సుకు హాజరు కావడం కుదరదని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఆఖిలభారత సర్వీసులైన ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్‌లకు, కేంద్ర సర్వీసులకు, గ్రూప్-ఏ సర్వీసులకు 2013 సంవత్సరపు పరీక్షద్వారా కేటాయింపు పొందిన అభ్యర్థులు, తమకు సూచించిన సంస్థల్లో వచ్చే నెల 1నుంచి ఫౌండేషన్ కోర్సుకు హాజరుకావలసి ఉంటుందని సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ (డీఓపీటీ) తన ఉత్తర్వులో పేర్కొంది. ఇలాగే సర్వీసుల కేటాయింపు పొందినా, ఈ నెల 24వ తేదీన జరగనున్న సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష రాయాలనుకుంటున్న అభ్యర్థులను మాత్రం ఫౌండేషన్ కోర్సుకు అనుమతించబోమని డీఓపీటీ స్పష్టంచేసింది.
గత ఏడాది నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత ప్రాతిపదికగా వివిధ సర్వీసులకు 1,122మంది అభ్యర్థుల పేర్లను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సిఫార్సు చేసింది.
వారిలో 981మంది అభ్యర్థులకు మాత్రమే సర్వీసుల కేటాయింపు జరిగింది. వివిధ కారణాలవల్ల 141మంది అభ్యర్థులకు కేటాయింపు జరగలేదు. కొంతమంది అభ్యర్థులు పరిమిత సంఖ్యలో సర్వీసులను మాత్రమే తమ ప్రాధాన్యతగా పేర్కొన్నారని, నిబంధనల ప్రకారం ప్రధాన జాబితా, రిజర్వ్‌డ్ జాబితాలనుంచి కేటాయింపులు పూర్తయిన తర్వాతే అలాంటి అభ్యర్థులకు కేటాయింపుల చేయడం సాధ్యమవుతుందని డీఓపీటీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కొందరు అభ్యర్థులు కచ్చితంగా ఓబీసీలేనా అన్నది కూడా నిర్ధారించుకోవలసి ఉందని, ముఖ్యమైన పత్రాలు సమర్పించనందున మరి కొందరి అభ్యర్థిత్వాలను తాత్కాలికమైనవిగా పరిగణిస్తున్నామని, కొందరి వైద్య పరీక్షలు కూడా పెండింగ్‌లో ఉన్నాయని డీఓపీటీ తెలిపింది. ఈ అంశాలన్నింటినీ నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించేందుకు అన్నివిధాలా కృషిచేస్తున్నామని, కొందరు అభ్యర్థులకు సర్వీసు కేటాయింపులు జరగకపోటవడానికి కారణాలను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నామని, అభ్యర్థులు తమకు ఇచ్చిన కోడ్ ద్వారా తెలుసుకోవచ్చని డీఓపీటీ తన ఉత్తర్వులో పేర్కొంది.