foundation course
-
రామానాయుడు ఫిలిం స్కూల్లో కౌన్సిలింగ్ ఫౌండేషన్ కోర్సు !
మానవుని దైనందిన జీవితంలో అతి ముఖ్యమైనది మానసిక ఆరోగ్యం. ప్రస్తుత బిజీ లైఫ్‌లో సంపాదన పరుగులో మనిషికి మానసిక ప్రశాంతత దారుణంగా కరువయ్యిందనే చెప్పాలి. అందుకోసం తాను ఏం చేయాలన్నది కూడా స్ప్రుహ లేనంత గందరగోళంలో ఉన్నాడు. దీంతో సమస్యలన్నీ ఒక పెనుభూతంలా కనిపించి ఎదుర్కొనే స్థైర్యం లేక నిసత్తువుగా మారిపోతున్నాడు. విద్యార్థుల నుంచి పెద్ద పారిశ్రామిక వేత్తల వరకు అందర్ని వేధిస్తున్న సమస్యే ఈ మానసిక అనారోగ్యం.దీన్ని మెరుగుపరుచుకుని మనల్ని మనం సంసిద్ధం చేసుకునేలా కౌన్సిలింగ్ ఇచ్చే చాలా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. అలానే రామానయుడు ఫిల్మ్ స్కూల్ ముందుకొచ్చింది. ఈ మేరకు గ్లోబల్ వెల్ఫేర్ ఫౌండేషన్, ముదిత ట్రైబ్ ఫౌండేషన్ల సహకారంతో రామా నాయుడు ఫిల్మ్ స్కూల్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే నో కాస్ట్ ఫౌండేషన్ కోర్సును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని పర్సన్-టు-పర్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిస్టియన్ కౌన్సెలింగ్ అనే సంస్థ నిర్వహిస్తుంది. దీని ద్వారా ఆయా వ్యక్తులు సహ కౌన్సిలర్లుగా మారి తమ కమ్యూనిటీలలో మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించే స్థాయికి చేరేలా ఈ కోర్సుని రూపొందించారు.మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కౌన్సిలింగ్ నో కాస్ట్ ఫౌండేషన్ కోర్సు రామానాయుడు ఫిలిం స్కూల్లో ఇవాళ మే 1 నుంచి ప్రారంభమై మే 6, 2024 వరకు నిర్వహిస్తున్నారు. ఈ వారం రోజుల ఫౌండేషన్ కోర్సు కోసం సుమారు 56 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. కరోనా మహమ్మారి తర్వాత మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కౌన్సిలర్ల డిమాండ్ ఎక్కువయ్యిందని గ్లోబల్ వెల్ఫేర్ ఫౌండేషకి చెందిన శ్రీనివాసన్ లింగేశ్వరన్ అన్నారు. ఆ డిమాండ్‌ని తీర్చే ఉద్దేశ్యంతోనే ఈ కోర్సుని రూపొందిచడం జరిగిందని చెప్పారు. ఇది కేవలం కౌన్సిలర్ల కొరత సమస్యను పరిష్కరించడమే కాకుండా మానిసిక ఆరోగ్యాన్ని గురించి అవగాహన కల్పించేలా ప్రాధాన్యత ఇచ్చేలా చేసి సంపూర్ణ సంక్షేమ నిబద్ధతకు పెద్ద పీట వేస్తుంది. ఈ మేరకు ముదిత వ్యవస్థాపకురాలు మిహీకా దగ్గుబాటి మాట్లాడుతూ..ఎటువంటి ఖర్చు లేకుండా వారివారీ కమ్యూనిటీలలో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేలా శక్తిమంతంగా చేయడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఇలాంటి కోర్సులు నగరంలోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి ప్రభావాన్ని చూపిస్తాయని రామానాయుడు పిల్మ్ స్కూల్ చైర్మన్ డి సురేష్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో అభ్యాసకులకు ఇద్దరూ ప్రఖ్యాత మనస్తత్వవేత్తలు కౌన్సిలింగ్ ద్వారా మాసిక ఆరోగ్యంపై లోతైన అవగాహానను, ఆచరణాత్మక పద్ధతుల గురించి కూలంకషంగా తెలియజేస్తారు. ఈ కోర్సులో మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కీలక అంశాలన్నింటిని నిపుణులు కవర్ చేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా ఆయా వ్యక్తులు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడమే గాక ఇతరులను ప్రభావితం చేసేలా కౌన్సిలర్లుగా మారి సంతోషకరమైన సమాజానికి బాటలు వేస్తారు. ఇంకెందుకు ఆలస్యం ఈ కోర్సులో జాయిన్ అయ్యి ఉజ్వల భవిష్యత్తు దిశగా ఇవాళ నుంచే తొలి అడుగులు వేద్దాం. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!) -
గురుకుల విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సు
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థుల లక్ష్యాన్ని సాకారం చేసేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఇప్పటివరకు ఇంటర్మీడియెట్ వరకు వసతితోపాటు ఉచిత విద్య అందిస్తుండగా.. తాజాగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, దేశంలోని ప్రఖ్యాత కాలేజీల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తోంది. ఆ కాలేజీల్లో సీటు వచ్చేందుకు ప్రత్యేక శిక్షణ ఇప్పించనుంది. ఇందుకోసం ప్రముఖ శిక్షణ సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ అందజేసింది. నెలాఖరులోగా ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశం ఉంది. ప్రముఖ సంస్థలతో ఒప్పందం ఇంటర్మీడియెట్ పూర్తయిన తర్వాత ఇంజనీరింగ్, మెడిసిన్‌తోపాటు ఇతర రంగాలపైనా విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు రాష్ట్ర విద్యాసంస్థల వరకే పరిమితం అవుతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో కోర్సు చదవాలంటే వ్యక్తిగతంగా ఫీజులు చెల్లించాలి. అంతేకాకుండా ప్రఖ్యాత యూనివర్సిటీలు, కాలేజీల్లో సీట్లు సాధించాలంటే ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. ఆర్థికంగా వెనుకబడ్డ గురుకుల విద్యార్థులకు ఇవి రెండూ కష్టం. ఈ నేపథ్యంలో ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోంది. పట్టుదల, భారీ లక్ష్యాలున్న విద్యార్థుల అభిప్రాయాలు తీసుకుని వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించనుంది. దీనికి సంబంధించిన శిక్షణ కోసం ప్రముఖ ఇన్స్టిట్యూట్లతో అవగాహన కుదుర్చుకోవాలని నిర్ణయించింది. ఉచితంగా మెటీరియల్ కూడా అందజేయనుంది. అలాగే ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకుతో సీటు సాధించిన వారి కోర్సు ఫీజును కూడా ఎస్సీ అభివృద్ధి శాఖ భరించనుంది. పాఠశాల స్థాయి నుంచే శిక్షణ లక్ష్యాల్ని నిర్దేశించుకునే విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే పలు దఫాలుగా శిక్షణ ఇప్పించేలా ఎస్సీ గురుకుల సొసైటీ ప్రణాళికను రూపొందించింది. ఇంటర్మీడియెట్ నుంచి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వనుంది. 2018–19 విద్యా సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం అందుబాటులోకి రానుంది. తొలుత జూనియర్ కాలేజీ స్థాయి ఉన్న ఎస్సీ గురుకుల పాఠశాలన్నింట్లోనూ ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చేలా అధికారులు చర్యలు చేపట్టారు. వచ్చే ఏడాది ఎస్సీ గురుకులాల్లోనూ దీనిని అందుబాటులోకి తేనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. -
మున్సిపల్ స్కూల్స్‌లో అడ్వాన్స్డ్ ఫౌండేషన్ కోర్సు
- వచ్చే ఏడాది 13 జిల్లాల్లో ఐఐటీ, ఒలింపియాడ్ స్కూళ్లు - రూ.100 కోట్ల బడ్జెట్ కేటాయింపు - రాష్ట్ర కో ఆర్డినేటర్ రావుల రవీంద్ర కర్నూలు(టౌన్): ‘రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది అన్ని మున్సిపాలిటీల పరిధిలో కెరీర్ ఫౌండేషన్ కోర్సులు ప్రారంభించాం. మంచి ఫలితాలు రావడంతో ఇక అడ్వాన్స్డ్ ఫౌండేషన్ కోర్సులను ప్రారంభించేందుకు నిర్ణయించాం’ అని ఫౌండేషన్ కోర్సు రాష్ట్ర కోఆర్డినేటర్ రావుల రవీంద్ర తెలిపారు. స్థానిక నగరపాలకలోని సమావేశ భవనంలో సోమవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మున్సిపల్ పాఠశాలల్లో కెరీర్ ఫౌండేషన్ కోర్సు తీసుకొచ్చి మెరుగైన ఫలితాలు సాధించామని రవీంద్ర తెలిపారు. ఈ ఏడాది ఎంపిక చేసిన 59 పాఠశాలల్లో అడ్వాన్స్డ్ ఫౌండేషన్ కోర్సు అమలులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. కామన్ సిస్టమ్.. 6,7,8,9,10 తరగతుల్లో ఒకే పాఠ్యాంశం, కామన్ షెడ్యూల్, కామన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నట్లు రవీంద్ర తెలిపారు. కెరీర్ కోర్సు ప్రారంభించిన మొదటి ఏడాదిలోనే రాష్ట్రంలోని 263 మున్సిపల్ పాఠశాలల్లో 36వేల మంది విద్యార్థులు శిక్షణ తీసుకున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది నుంచి13 జిల్లాల్లో ఐఐటీ ఒలింపియాడ్ స్కూళ్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జిల్లా పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, మండల స్థాయి పాఠశాలల్లోనూ వీటిని ప్రారంభిస్తామన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎస్ రవీంద్రబాబు, డిప్యూటీ కమిషనర్ రామలింగేశ్వర్ పాల్గొన్నారు. -
కేటాయింపు పొందిన ప్రిలిమ్స్ అభ్యర్థులకు ఫౌండేషన్ కోర్సులో ప్రవేశం లేదు
డీఓపీటీ ఉత్తర్వు జారీ న్యూఢిల్లీ: గత ఏడాది సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్‌లలో కేటాయింపు పొంది, తిరిగి ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరుకాదలిచిన అభ్యర్థులు ఫౌండేషన్ కోర్సుకు హాజరు కావడం కుదరదని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఆఖిలభారత సర్వీసులైన ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్‌లకు, కేంద్ర సర్వీసులకు, గ్రూప్-ఏ సర్వీసులకు 2013 సంవత్సరపు పరీక్షద్వారా కేటాయింపు పొందిన అభ్యర్థులు, తమకు సూచించిన సంస్థల్లో వచ్చే నెల 1నుంచి ఫౌండేషన్ కోర్సుకు హాజరుకావలసి ఉంటుందని సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ (డీఓపీటీ) తన ఉత్తర్వులో పేర్కొంది. ఇలాగే సర్వీసుల కేటాయింపు పొందినా, ఈ నెల 24వ తేదీన జరగనున్న సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష రాయాలనుకుంటున్న అభ్యర్థులను మాత్రం ఫౌండేషన్ కోర్సుకు అనుమతించబోమని డీఓపీటీ స్పష్టంచేసింది. గత ఏడాది నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత ప్రాతిపదికగా వివిధ సర్వీసులకు 1,122మంది అభ్యర్థుల పేర్లను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సిఫార్సు చేసింది. వారిలో 981మంది అభ్యర్థులకు మాత్రమే సర్వీసుల కేటాయింపు జరిగింది. వివిధ కారణాలవల్ల 141మంది అభ్యర్థులకు కేటాయింపు జరగలేదు. కొంతమంది అభ్యర్థులు పరిమిత సంఖ్యలో సర్వీసులను మాత్రమే తమ ప్రాధాన్యతగా పేర్కొన్నారని, నిబంధనల ప్రకారం ప్రధాన జాబితా, రిజర్వ్డ్ జాబితాలనుంచి కేటాయింపులు పూర్తయిన తర్వాతే అలాంటి అభ్యర్థులకు కేటాయింపుల చేయడం సాధ్యమవుతుందని డీఓపీటీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కొందరు అభ్యర్థులు కచ్చితంగా ఓబీసీలేనా అన్నది కూడా నిర్ధారించుకోవలసి ఉందని, ముఖ్యమైన పత్రాలు సమర్పించనందున మరి కొందరి అభ్యర్థిత్వాలను తాత్కాలికమైనవిగా పరిగణిస్తున్నామని, కొందరి వైద్య పరీక్షలు కూడా పెండింగ్‌లో ఉన్నాయని డీఓపీటీ తెలిపింది. ఈ అంశాలన్నింటినీ నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించేందుకు అన్నివిధాలా కృషిచేస్తున్నామని, కొందరు అభ్యర్థులకు సర్వీసు కేటాయింపులు జరగకపోటవడానికి కారణాలను వెబ్సైట్లో పొందుపరుస్తున్నామని, అభ్యర్థులు తమకు ఇచ్చిన కోడ్ ద్వారా తెలుసుకోవచ్చని డీఓపీటీ తన ఉత్తర్వులో పేర్కొంది.