సాక్షి సిటీబ్యూరో: మైనార్టీ విద్యార్థులకు సివిల్ సర్వీస్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనార్టీ సంస్థ రంగం సిద్ధం చేసింది. ఏటా వంద మందిని ఎంపిక చేసి వారికి ఈ అవకాశం కల్పిస్తున్నట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఇందుకోసం మే 8వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించి.. 12వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఖమ్మం, రంగారెడ్డి మినహా మిగతా ఎనిమిది పాత జిల్లాల్లో ప్రవేశ పరీక్షలు ఉంటాయని ఆ శాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులకు ఉన్నతమైన శిక్షణనిచ్చేందుకు ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఓ కమిటీని వేసి నగరంలోని ఐదు ప్రముఖ ఐఏఎస్ స్టడీ సర్కిళ్లను ఎంపిక చేశారు.
స్టైఫండ్, మెటీరియల్ కూడా..
ఎంపికైన విద్యార్థులకు కోచింగ్‌కు అయ్యే ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుంది. పైగా ఉపకార వేతనం కూడా ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. లోకల్ విద్యార్థికి రూ.2500, నాన్ లోకల్ విద్యార్థికి రూ.5 వేలు ఇవ్వనున్నారు. దీంతో పాటు స్టడీ మెటీరియల్ కొనుగోలుకు అదనంగా రూ.3500 ఇస్తారు. కోచింగ్ ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.1.51 లక్షలు వెచ్చించనుంది.
మైనార్టీల ప్రగతికి తోడ్పాటు
ప్రతిభావంతులైన మైనార్టీ విద్యార్థుల కోసం ప్రవేశపేట్టిన సివిల్ సర్వీస్ కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలి. ఎంపికైన విద్యార్థులకు నగరంలోని టాప్ కోచింగ్ సెంటర్లలో కోచింగ్ ఇవ్వలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలి.– ప్రొఫెసర్ ఎస్.ఎ.షుకూర్,సీఈడీఎం డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment