సివిల్స్ టాపర్ తొలివేతనం ఎవరికో తెలుసా?
సివిల్స్ టాపర్ నందిని ఫస్ట్ శాలరీ వారికే...
Published Sat, Jun 10 2017 12:38 PM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM
మంగళూరు : సివిల్స్ ఆలిండియా టాపర్ గా నిలిచి దేశవ్యాప్తంగా సుపరిచితురాలైన కేఆర్ నందిని తన తొలి వేతనాన్ని ఉచిత విద్యకు విరాళంగా ఇస్తున్నారు.. ఐఏఎస్ టాపర్ గా నిలిచిన వెంటనే నందిని, విద్యకే తొలి ప్రాధాన్యమివ్వనున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తొలి వేతనాన్ని ఆల్వా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఉచిత విద్యా పథకానికి ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించారు. తన కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం ఆల్వా ఫౌండేషన్ ను సందర్శించిన ఆమె, ఈ ప్రకటన చేసినట్టు ఆ ఫౌండేషన్ తెలిపింది. ఈ ఫౌండేషన్ చైర్మన్ ఎం మోహన్ ఆల్వాను కలిసిన నందిని, చదువుకోవాలనుకునే విద్యార్థులకు తాను సహాయం చేయడం కొనసాగిస్తానని చెప్పారు.
ఆల్వా ఉచిత ఎడ్యుకేషన్ స్కీమ్ కింద లబ్దిపొందిన విద్యార్థుల్లో నందిని కూడా ఒకరు కావడం విశేషం. నందిని సాధించిన ఘనతకు మోహన్ ఆల్వా ఆమెకు లక్ష రూపాయలను బహుమతిగా అందించారు. కన్నడ సాహిత్యంతో తనకున్న సంబంధం, తన లక్ష్యాలను సాధించడానికి చాలా సహకరించాయని నందిని పేర్కొన్నారు. సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన నందిని, తన నేపథ్యానికి భిన్నంగా కన్నడ సాహిత్యాన్ని ఐఏఎస్ పరీక్షల్లో ఆప్షనల్ గా ఎంచుకున్నారు.
నందిని తండ్రి కేవీ రమేశ్, తల్లి విమలమ్మ కూడా ఈ ఫౌండేషన్ సందర్శనలో కూతురితో పాటు పాల్గొన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నదే లక్ష్యంగా నాలుగో ప్రయత్నంలో ఆమె ఈ ఘనతను సాధించారు. కర్ణాటక కోలార్ జిల్లాలోని కెంబోడి ప్రాంతానికి చెందిన వారు కేఆర్ నందిని.
Advertisement