సివిల్స్ ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: దేశంలోని అత్యున్నతమైన పౌర సేవా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్వంటి సర్వీసుల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు-2014 వెల్లడయ్యాయి. జాట్లకు రిజర్వేషన్ కల్పించే వివాదం కోర్టులో ఉండగానే ఆదివారం రాత్రి యూపీఎస్సీ ఈ ఫలితాలను విడుదల చేసింది. ప్రధాన పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ఏప్రిల్ 27 నుంచి మౌఖిక పరీక్షలు(ఇంటర్వ్యూలు) నిర్వహించే అవకాశం ఉంది.
యూపీఎస్సీ వెల్లడించిన ఫలితాల నోటిఫికేషన్లో జాట్ల విషయాన్ని పేర్కొనలేదు. గతంలోని యూపీఏ ప్రభుత్వం జాట్లకు కేంద్ర సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు వారిని ఓబీసీల్లో చేర్చింది. అయితే, దీనిపై కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్లడంతో కేంద్ర నిర్ణయం చెల్లుబాటుకాదని పేర్కొంటూ తుది తీర్పు వెలువరించకుండా పెండింగ్లో పెట్టింది. దీంతో ఆ తీర్పు వచ్చాకే ఫలితాలు వస్తాయని భావించగా.. ఆ విషయాన్ని ప్రస్తావించకుండానే యూపీఎస్సీ ఫలితాలు వెల్లడించింది. మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లను యూపీఎస్సీ వెబ్సైట్ www.upsc.gov.inలో ఉంది.