సివిల్ సర్వీసెస్ వయోపరిమితి కుదింపు?
♦ జనరల్ అభ్యర్థులకు 32 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు తగ్గింపు
♦ ఎప్పట్నుంచి వర్తింపజేస్తారన్న అంశంపై స్పష్టత లేమి
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యున్నతమైన సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు చేదువార్త! ఇప్పటివరకు జనరల్ అభ్యర్థులకు ఉన్న 32 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని కేంద్ర ప్రభుత్వం 30 ఏళ్లకు కుదించింది. ఈ మేరకు గురువారం upsc.govt.in వెబ్‌సైట్‌లో ఓవర్‌వ్యూ ఆఫ్ సివిల్ సర్వీసెస్ కేటగిరీ కింద వయోపరిమితి అంశంలో దీన్ని పొందుపరిచింది. అయితే ఈ కుదింపు ఎప్పట్నుంచి అమల్లోకి వస్తుందన్న విషయాన్ని అందులో తెలపలేదు. 2015 సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్‌లో అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి (జనరల్)ను 32 ఏళ్లుగా పేర్కొంది.
మరోవైపు 2016లో యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల టైం టేబుల్‌లో.. వచ్చే ఏప్రిల్ 23న సివిల్స్ నోటిఫికేషన్ జారీ చేస్తామని యూపీఎస్సీ ప్రకటించింది. మే 20 వరకు దరఖాస్తులు స్వీకరించి ఆగస్టు 7న ప్రిలిమ్స్, డిసెంబర్ 3 నుంచి ఐదురోజుల పాటు మెయిన్ పరీక్షలు ఉంటాయని వివరించింది. అయితే ఈ వయోపరిమితి కుదింపు ఏప్రిల్ 23న జారీ కాబోయే సివిల్స్ నోటిఫికేషన్‌కు వర్తిస్తుందా లేదా అన్నది యూపీఎస్సీ తన వెబ్‌సైట్‌లో ఎక్కడా తెలపలేదు. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కోచింగ్ సెంటర్‌లలో చేరి పరీక్షలకు సిద్ధమవుతున్నవారు తీవ్ర ఆవేదన లో పడ్డారు.