కష్టపడి కాదు.. ఇష్టపడి చదివా... | Software to Forest Service | Sakshi
Sakshi News home page

కష్టపడి కాదు.. ఇష్టపడి చదివా...

Published Sun, Feb 22 2015 11:10 PM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM

కష్టపడి కాదు..  ఇష్టపడి చదివా... - Sakshi

కష్టపడి కాదు.. ఇష్టపడి చదివా...

ఇంజనీరింగ్ పూర్తవగానే ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో మంచి ఉద్యోగం లభించింది.

 సక్సెస్ స్టోరీ

ఇంజనీరింగ్ పూర్తవగానే ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో మంచి ఉద్యోగం లభించింది. తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నియామకాల్లోనూ ప్రతిభ చూపి సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్‌లో కొలువు సొంతం చేసుకున్నాడు. అయితే తనకోసమే కాకుండా సమాజానికీ సేవ చేయాలని భావించాడు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలను ఎంచుకున్నాడు. రెండుసార్లు ప్రిలిమ్స్, మెయిన్స్‌లో నెగ్గి ఇంటర్వ్యూ తర్వాత వెనుదిరిగినా నిరాశ చెందలేదు. ఈసారి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్)లో తొలి ప్రయత్నంలోనే 24వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు.. హైదరాబాద్ కుర్రాడు కె. భార్గవ్ తేజ. అతని సక్సెస్ స్టోరీ తన మాటల్లోనే..
 
పుట్టి పెరిగింది.. హైదరాబాద్‌లోనే. నాన్న రాధా మనోహర్‌రావు బీహెచ్‌ఈఎల్‌లో మేనేజర్. అమ్మ మాలతి గృహిణి. అక్క యూఎస్‌లో ఉంటోంది. అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే ఐఎఫ్‌ఎస్‌లో విజయం సాధించగలిగాను.
 
 ఫస్ట్ అఛీవ్‌మెంట్!


బీహెచ్‌ఈఎల్‌లోని ప్రైవేటు పాఠశాలలో పదోతరగతి వరకు చదివాను. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడిని. ఇంటర్‌లో 97 శాతం మార్కులు సాధించాను. ఎంసెట్‌లో 1900 ర్యాంకు సొంతం చేసుకుని 75 శాతం మార్కులతో బీటెక్ పూర్తి చేశాను.
 
 చిన్నతనంలోనే బీజం!

ఉన్నతస్థాయి ఉద్యోగులతోనే సమాజంలో కోరుకున్న మార్పు సాధ్యమవుతుంది. అందుకే అత్యున్నత సర్వీసుల్లో చేరాలని చిన్నతనంలోనే లక్ష్యంగా నిర్దేశించుకున్నాను. దానికనుగుణంగానే సివిల్స్‌ను ఎంచుకున్నాను. విస్తృత పోటీని తట్టుకుని.. కఠినమైన ప్రిలిమ్స్, మెయిన్స్‌లో నెగ్గి రెండుసార్లు ఇంటర్వ్యూ వరకు చేరుకోగలిగాను. కానీ ఫైనల్ కటాఫ్‌లో స్వల్ప తేడాతో వెనుదిరిగాను. సివిల్స్‌కు ప్రిపేరయ్యే క్రమంలో అటవీ సంరక్షణపై ఆసక్తి పెరిగింది. అందుకే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షను రాశాను. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాను.
 
 సాఫ్ట్‌వేర్ టు ఫారెస్ట్ సర్వీస్

 బీటెక్  పూర్తిచేసిన తర్వాత టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాను. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించి సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్‌లో ఉద్యోగం సొంతం చేసుకున్నాను. మంచి భవిష్యత్తుతోపాటు సమాజంలో మనం కోరుకునే మార్పు, అభివృద్ధి సివిల్ సర్వీసెస్‌తోనే సాధ్యం. అన్నింటికంటే ప్రధానంగా సొసైటీకి సేవ చేయాలనే నా సంకల్పానికి సివిల్స్ సరిగ్గా సరిపోతుంది. అందుకే సివిల్స్ ఎంచుకున్నాను.
 
ప్రిలిమ్స్ ప్రిపరేషన్


సివిల్ సర్వీసెస్, ఐఎఫ్‌ఎస్ రెండింటికీ ప్రిలిమ్స్ ఉమ్మడిగానే ఉంటుంది. కాబట్టి అధిక స్కోరు లక్ష్యంగా ప్రిపేరయ్యాను. అప్పుడే ప్రిలిమ్స్ కటాఫ్ కంటే ఎక్కువ మార్కులు సాధించొచ్చు. ఇంజనీరింగ్, మ్యాథ్స్ నేపథ్యం ఉంది కాబట్టి పేపర్ -2 (సీశాట్)లో ఎక్కువ మార్కులు సాధించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. పేపర్ -1 జనరల్ స్టడీస్ విషయంలో సివిల్స్, ఐఎఫ్‌ఎస్ మెయిన్స్ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని సన్నద్ధమయ్యాను.
 
ఆప్షన్స్.. ఎంపిక

ఐఎఫ్‌ఎస్ ప్రిపరేషన్‌లో ఆప్షన్స్ ఎంచుకోవడంలో మొదటిసారి ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అకడమిక్ విద్యలో అభ్యసించని ఏవైనా రెండు ఆప్షనల్ సబ్జెక్టులను ఎంచుకోవాల్సి వచ్చింది. దాంతో వివిధ ఆప్షనల్స్‌కు సంబంధించిన పూర్తి సిలబస్‌ను పరిశీలించాను. వాటిల్లో జనరల్ స్టడీస్ ప్రిపరేషన్‌కూ ఉపయుక్తంగా ఉంటూ, భవిష్యత్తులో ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్‌గా రాణించడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని సొంతం చేసుకునేందుకు వీలైన ఆప్షనల్స్‌ను ఎంచుకున్నాను. అవే.. ఫారెస్ట్రీ, జియాలజీ.
 
రిఫరెన్స్ బుక్స్.. సెల్ఫ్ నోట్స్

ఫారెస్ట్రీ ఆప్షనల్ కోసం ఫారెస్ట్రీ బుక్ - మణికందన్, జియాలజీ ఆప్షనల్ కోసం బేసిక్స్ ఆఫ్ జియాలజీ - పి.ముఖర్జీ బుక్స్ చదివాను. వివిధ అంశాల ప్రాథమిక, విస్తృత అవగాహన కోసం మాత్రమే ఈ బుక్స్‌ను ఉపయోగించుకున్నాను. కోచింగ్ తీసుకోలేదు. ఇంటర్నెట్‌ను ఉపయోగించి వివిధ ఉప అంశాలకు సంబంధించిన ముఖ్యమైన పాయింట్లతో సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. కొత్త సబ్జెక్టులపై పట్టు పెంచుకోవడానికి ఈ విధానం ఎంతగానో తోడ్పడింది. నా దృష్టిలో ఇంటర్నెట్ మాత్రమే బెస్ట్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్.
 
 మెయిన్స్.. వ్యూహాలు

మెయిన్స్‌లో ప్రధానంగా సమయపాలన ఎంతో ప్రధానం. అడిగిన ప్రశ్నలకు సూటిగా, వర్డ్ లిమిట్‌కు మించకుండా సమాధానాలు రాసేలా ప్రిపేరయ్యాను. చాలా ప్రశ్నలకు పాయింట్ల వారీగా సమాధానాలు రాయడమే కాకుండా వీలైనన్ని ఎక్కువ పటాలను గీశాను. చిన్నతనం నుంచే వేగంగా రాయడం అలవాటు. అది మెయిన్స్‌లో ఎంతగానో ఉపయోగపడింది.
 
ఇంటర్వ్యూ

అప్పటికే రెండుసార్లు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలను ఎదుర్కొన్న అనుభవంతో ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూకు హాజరయ్యాను. గతంలో జరిగిన పొరపాట్లు, లోపాలను సరిదిద్దుకున్నాను. కొన్నాళ్లు ఇంజనీరింగ్ సబ్జెక్టులను, వర్క్ ప్రొఫైల్ తదితర అంశాలను అధ్యయనం చేశాను. అభ్యర్థుల్లోని నిజాయతీ, సమాజం, పరిసరాలపై వారికుండే శ్రద్ధ తదితర అంశాలను ఇంటర్వ్యూ చేసేవారు పరిగణనలోకి తీసుకుంటారు. అందుకనుగుణంగానే వారి ప్రశ్నల సరళి ఉంటుందనేది నా అభిప్రాయం. ఇంటర్వ్యూలో ఎక్కువగా ప్రొఫైల్, ఆసక్తులు అలవాట్లకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ప్రస్తుతం సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్‌లో పనిచేస్తున్నందున టాక్సేషన్ అంశాలపై కూడా ఎక్కువగా ప్రశ్నించారు. దేశ ఆర్థిక పరిస్థితులు, అటవీ అంశాలపై చర్చలా ఇంటర్వ్యూ సాగింది. నా భావాలను పూర్తిగా వ్యక్తపరచడానికి మంచి అవకాశం లభించింది.
 
స్మార్ట్ వర్క్ ఈజ్ బెటర్ దెన్ హార్డ్ వర్క్!


ఐఎఫ్‌ఎస్ రాయాలనుకునేవారు పక్కా ప్రణాళికతో వీలైనంత ముందుగానే ప్రిపరేషన్‌ను ప్రారంభించాలి. ప్రిలిమ్స్‌లో సివిల్స్ కటాఫ్ కంటే ఐఎఫ్‌ఎస్ కటాఫ్ ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి పేపర్-2లో ఎక్కువ మార్కులు సాధించేందుకు ప్రయత్నించాలి. మెయిన్స్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రిలిమ్స్‌కు ప్రిపేరవ్వాలి. రెగ్యులర్‌గా చేతితో రాయడాన్ని ప్రాక్టీస్ చేయాలి. లోపాలుంటే సరిదిద్దుకోవాలి. స్మార్ట్ వర్క్ ఈజ్ బెటర్ దెన్ హార్డ్ వర్క్!
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement